ముంబైలో జనవరి 3వ తేదీ నుంచి 9వ అజంతా-ఎల్లోరా ఫిల్మ్ ఫెస్టివల్ (AIFF 2024) ప్రారంభం కానుంది. జనవరి 7 వరకు జరిగే ఈ వేడుకల్లో ఇండియాతోపాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమాలను ప్రదర్శించనున్నారు. ముంబైలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఎంజీఎం క్యాంపస్‌లోని రుక్మిణి ఆడిటోరియంలో ఈ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి జాతీయ, అంతర్జాతీయ కళాకారులు, ఔత్సాహికులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.  


మరాఠ్వాడా ఆర్ట్ కల్చర్ ఫిల్మ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ వేడుకకు డైలీ హంట్ (Dailyhunt) డిజిటల్ మీడియా భాగస్వామిగా వ్యవహరిస్తోంది. చలన చిత్రం రంగంలో వివిధ నైపుణ్యాల గురించి సాధారణ ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ఫెస్టివల్ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అలాగే, ఈ వేడుకలో జాతీయ, అంతర్జాతీయ చిత్రాలే కాకుండా మరాఠీ చిత్రాలను సైతం ప్రదర్శిస్తారని వెల్లడించారు. స్థానిక కళాకారులకు, చిత్ర నిర్మాతలకు మధ్య సత్సంబంధాలను ఏర్పరిచేందుకు ఈ వేడుక వారధిగా పనిచేస్తుందన్నారు.


ఈ ఐదు రోజుల ఉత్సవంలో విభిన్న సినిమాలను ప్రదర్శిస్తారు. వివిధ కేటగిరీల్లో తొమ్మిది ఇండియన్ మూవీస్ పోటీ పడనున్నాయి. ఐదుగురు సభ్యుల జ్యూరీ, ప్రేక్షకుల నిర్ణయంతో విజేతలను ఎంపిక చేస్తారు. ఉత్తమ చిత్రానికి ప్రతిష్టాత్మక గోల్డెన్ కైలాష్ అవార్డుతో పాటు లక్ష రూపాయల నగదు బహుమతిని అందజేస్తారు. ఉత్తమ నటుడు, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రిప్ట్ అవార్డులను కూడా ఈ వేడుకలో అందించన్నారు.


కోల్‌కతాకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు ధృతిమాన్ ఛటర్జీ ఈ జ్యూరీకి అధ్యక్షత వహిస్తారు. చెక్ రిపబ్లిక్ నుంచి ప్రశంసలు దక్కించుకున్న సినిమాటోగ్రాఫర్ డిమో పోపోవ్, పూణేకు చెందిన సీనియర్ దర్శకుడు నచికేత్ పట్వర్ధన్, ఢిల్లీకి చెందిన సీనియర్ సినీ విమర్శకుడు రష్మీ దొరైస్వామి, పనాజీకి చెందిన ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ హరి నాయర్ ఈ జ్యూరీలో సభ్యులు. ప్రముఖ దర్శకుడు ఆర్.బాల్కీ ఈ ఉత్సవాలను ప్రారంభిస్తారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ అపూర్వ చంద్ర, ప్రముఖ దర్శకుడు అనుభవ్ సిన్హా ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు. ఈ వేడుకల్లో ప్రముఖ కవి, రచయిత, స్క్రీన్ రైటర్ జావేద్ అక్తర్‌కు పద్మపాణి జీవితకాల సాఫల్య పురస్కారాన్ని అందజేయనున్నారు. 


Also Read: ‘కేజీయఫ్’ కనెక్షన్, ‘బాహుబలి 3’ అప్‌డేట్ - ‘సలార్’ టీమ్‌తో రాజమౌళి ఇంటర్వ్యూ ప్రోమో!