Fans attack on Bigg Boss 7 contestants : ‘బిగ్ బాస్’ సీజన్ 7 ఫినాలే పూర్తయ్యింది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా, అమర్‌దీప్ రన్నరప్‌గా నిలిచాడు. షో ముగిసిన తర్వాత వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరారు. వీరిని కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. దీన్ని అవకాశంగా తీసుకుని కొంతమంది ఆకతాయిలు రెచ్చిపోయారు. స్టూడియో నుంచి బయటకు వస్తున్న ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్స్, ఇతర సెలబ్రిటీల కార్లపై రాళ్లు విసిరారు. చేతికి అందిన వస్తువులతో కార్ల అద్దాలను పగలగొట్టారు. అంతేకాదు.. అక్కడే ఫ్యాన్ వార్ కూడా జరిగింది. పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ అభిమానులు కొట్టుకున్నారు. అటుగా వెళ్తున్న ఆర్టీసీ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు.


ఫ్యాన్స్ మధ్య వార్..


ప్రతీ బిగ్ బాస్ సీజన్‌లో అన్నపూర్ణ స్టూడియోస్ బయట ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. కానీ ఎప్పుడూ, ఎవరిపై దాడి జరగలేదు. ఈసారి మాత్రం విన్నర్, రన్నర్‌లుగా నిలిచిన అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అమర్ కారు అద్దాలు పగలగొట్టి మరీ మీ ఫ్యాన్స్ అని చెప్తూ ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు కొందరు ఆకతాయిలు. అంతే కాకుండా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వచ్చి అమర్‌ను బూతులు తిట్టారు. ఆ సమయంలో కారులో ఉన్న అమర్ దీప్ తల్లి, భార్య భయంతో వణికిపోయారు. వద్దని చెబుతున్నా ఆకతాయిలు దాడి ఆపలేదు. ప్రస్తుతం ఆ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సెలబ్రిటీలపై దాడి చేయడం మాత్రమే కాకుండా ఒకరిపై ఒకరు కూడా దాడులు చేసుకున్నారు.










కార్ల వెనకాల పరుగులు


ప్లలవి ప్రశాంత్, అమర్‌దీప్ ఫ్యాన్స్ మధ్య కూడా పెద్ద వాగ్వాదమే జరిగింది. ఆ తర్వాత ఒకరినొకరు కొట్టుకుంటూ అటుగా వచ్చిన ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. ఇలా జరుగుతుందని తెలియకపోవడంతో పోలీసులు కూడా ఎక్కువ సంఖ్యలో లేరు. దీంతో వారిని కంట్రోల్ చేయడం అసాధ్యంగా మారింది. ఇప్పటివరకు జరిగిన బిగ్ బాస్ సీజన్స్ అన్నింటిలో ఇంత దారుణంగా సెలబ్రిటీపై దాడి జరగడం ఇదే మొదటిసారి. అయితే ఇది ఎవరైనా కావాలని చేయించారా, లేదా నిజంగానే వారు అమర్, ప్రశాంత్‌ల ఫ్యాన్సా అని తెలియాల్సి ఉంది. వారి కారు అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు చాలా దూరం వాటి వెనుక పరిగెత్తారు కూడా. దీంతో రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయి.. మిగతావారు కూడా ఇబ్బందిపడ్డారు. అయితే, పల్లవి ప్రశాంత్ కారుపై మాత్రం ఎవరూ దాడి చేయలేదు. దీంతో ఈ విధ్వంసానికి పాల్పడింది అతడి ఫ్యాన్సే అంటూ సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది.


పోలీసులకు ఫిర్యాదు చేసిన అశ్వినీ, గీతూ


ఇప్పటికీ ఈ విషయంపై అమర్‌దీప్, పల్లవి ప్రశాంత్ రియాక్ట్ అవ్వకపోయినా.. గీతూ, అశ్విని మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఆకతాయిలపై పోలీసులకు ఫిర్యాదు చేయడం వరకు వెళ్లారు. ఒకవేళ కంటెస్టెంట్స్ ప్రవర్తన నచ్చకపోతే.. వారిపై దాడి చేశారని అనుకోవచ్చు, కానీ ఆర్టీసీ బస్సులపై దాడి చేయడం ఏంటని సీరియస్ అయ్యింది గీతూ. వాళ్లంతా పిచ్చివాళ్లని తిట్టింది. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు మాత్రం ఇష్టం వచ్చినట్టు దాడి చేశారని, తన కారు అద్దం పగలగొట్టినవాడిని తీసుకొస్తే.. రూ.10 వేలు రివార్డ్ ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. కష్టపడి కారు కొన్నానని, ఇంకా ఈఎమ్ఐలు కట్టుకుంటున్నా అని వాపోయింది. కారు అద్దాల లోపల చేయి పెట్టేస్తున్నారని, ఇప్పుడు ఇన్సురెన్స్ కావాలన్నా ముందుగా పోలీస్ స్టేషన్‌లో వెళ్లి ఫిర్యాదు చేయాలని తెలిపింది. వారు అసలు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే కాదని, ఎవరో ఆకతాయిలు అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది గీతూ.






Also Read: విన్నర్ నేనే, నాకు తెలుసు - ‘బిగ్ బాస్’పై శివాజీ షాకింగ్ కామెంట్స్