TPCC Chief Revanth Reddy News in Telugu: అడవికి రాజైన సింహం వేటాడాలంటే ఒంటరిగా వెళ్లదు.. గుంపులుగా వెళ్తాయి. కానీ పులి అలా కాదు... సింగిల్ గానే వేటాడుతుంది. ఇది అడవిలో టైగర్ ప్రత్యేకత. టైగర్ అని దగ్గరివాళ్లు ప్రేమగా పిలుచుకునే అనుముల రేవంత్ రెడ్డి రాజకీయాలూ అంతే. దూకుడైన స్వభావం.. పదునైన మాటలతో రాజకీయరంగంలోకి దూసుకొచ్చిన నేటితరం నేత రేవంత్ రెడ్డి. అతి తక్కువ కాలంలోనే రాజకీయాల్లో వేగంగా ఎదిగిన నేతగా ఆయన. ఉద్యమ నేతగా, తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా, పదేళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకుడిగా ఉన్న కేసీఆర్ ను దూకుడుగా ఎదుర్కొన్న నేత రేవంత్ రెడ్డి. 130 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది.


అన్ని ప్రధాన పార్టీలతో అనుబంధం
రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం విద్యార్థి నేతగా ప్రారంభమైంది. ప్రస్తుతం టీపీసీసీ చీఫ్ గా ఉన్నప్పటికీ తెలంగాణలోని బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ వంటి ప్రధాన పార్టీలతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. విద్యార్థి జీవితంలో బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం ఏబీవీపీలో ఆయన సభ్యుడిగా పనిచేశారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. ఆ తర్వాత 2001-2002 మధ్య కాలంలో టీఆర్ఎస్‌లో పని చేశారు. 2004లో కల్వకుర్తి నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించినా ఆయనకు నిరాశే ఎదురైంది. 2006లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మిడ్జిల్ మండలం నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచారు. అక్కడి నుంచి ఆయన వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఎన్నికల రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 2007లోను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. రేవంత్ రెడ్డిలోని చురుకుదనం చూసిన టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్... కాంగ్రెస్ నుంచి అప్పటికే ఐదుసార్లు గెలిచిన గుర్నాథరెడ్డిని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లోనూ మరోసారి గెలిచి టీడీపీ ఫ్లోర్ లీడర్ అయ్యారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం, మారిన రాజకీయ పరిణామాల వల్ల క్రమంగా టీడీపీ ఇక్కడ ఉనికి కోల్పోయే పరిస్థితులు ఏర్పడటంతో మరోసారి ఆ పార్టీని వదిలి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు.


మూడేళ్లలోనే పీసీసీ చీఫ్‌గా...
2017 అక్టోబర్ 31న కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి.. 2018 ఎన్నికల్లో కొండంగల్ నుంచి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చాక రేవంత్ రెడ్డికి ఇది తొలి ఓటమిగా చెప్పవచ్చు. ఆ తర్వాత 2018 సెప్టెంబర్ 20న తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఆ ముగ్గురిలో రేవంత్ ఒకరు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోకుండా ఆ తర్వాత 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి బరిలో దిగి పది వేల ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిపై విజయం సాధించి పార్లమెంట్లో అడుగుపెట్టారు రేవంత్ రెడ్డి. 2021 జులైలో రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ చీఫ్ గా నియమించింది.


వివాదాలు- కేసులు
ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ ప్రకారం రేవంత్ రెడ్డిపై 89 కేసులున్నాయి. అందులో ముఖ్యమైంది ఓటుకు నోటు కేసు. 2015 మే 31న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయడానికి నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్‌సన్‌కు లంచం ఇచ్చారనే ఆరోపణలపై రేవంత్ రెడ్డిని అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది. ఇందులో చంద్రబాబు పాత్రపైనా ఆరోపణలొచ్చాయి. తనపై అన్యాయంగా, దురుసుగా ప్రవర్తించిన పోలీసుల పేర్లను డైరీలో రాసుకుంటా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరినీ వదిలిపెట్టను అని ఓ సందర్భంలో రేవంత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.


కుటుంబ నేపథ్యం
మహబూబ్ నగర్ జిల్లా (ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లా) కొండారెడ్డి పల్లిలో 1969 నవంబర్ 8న రేవంత్ రెడ్డి జన్మించారు. నర్సింహారెడ్డి, రాంచంద్రమ్మలు ఆయన తల్లిదండ్రులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పూర్తి చేశారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మేన కోడలు గీతను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె.