Telangana DGP Meets Revath Reddy: రేవంత్ రెడ్డి ఇంటికి తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్ సహా ఇతర ఉన్నతాధికారులు వెళ్లారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డికి అందరూ పుష్ప గుచ్ఛం అందించారు. రేవంత్ రెడ్డిని కలిసిన వారిలో అంజనీ కుమార్ సహా, మహేశ్ భగవత్ తదితరులు కలిశారు. తెలంగాణ ఎన్నికల కౌంటింగ్‌లో కాంగ్రెస్ పార్టీ జోరు ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 65కు పైగా స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. అశ్వారావు పేట, ఇల్లందు, రామగుండం స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఈ క్రమంలో పోలీసులు ఉన్నతాధికారులు రేవంత్ రెడ్డి వద్దకు వెళ్లి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
గాంధీ భవన్ కు ర్యాలీగా రేవంత్ రెడ్డి
ఆ వెంటనే అక్కడి నుంచి రేవంత్ రెడ్డి ర్యాలీగా గాంధీ భవన్ కు బయలుదేరారు. దారిపొడవునా అభిమానులు కేరింతలు కొడుతూ రేవంత్ రెడ్డి సీఎం అంటూ ఉత్సాహంతో నడిచారు.
రేవంత్‌రెడ్డి కష్టపడి పని చేశారు: కోమటిరెడ్డి
రేవంత్‌రెడ్డి కష్టపడి పని చేశారని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. నేను సీఎం రేసులో ఉన్నానా? లేదా అనేది అప్రస్తుతం అని అన్నారు. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి అని ప్రజలు కోరుకున్నారని అన్నారు. ఈ ఐదేళ్లు ఎలాంటి గొడవలు ఉండవు. సోనియాగాంధీకి బర్త్‌డే గిఫ్ట్ ఇస్తున్నామని, సీఎం అభ్యర్థిని ఖర్గే, సోనియా గాంధీ నిర్ణయిస్తారని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు కాబట్టి ఫార్మాలిటీ ప్రకారం పోలీసులు అక్కడకు వెళ్లారని అన్నారు.