హోరాహోరీగా సాగిన తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ముందంజలో ఉంది. బీఆర్‌ఎస్‌కు పట్టున్న ప్రాంతాల్లో కాంగ్రెస్‌ గురి పెట్టింది. ఎవరూ ఊహించని ప్రాంతాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు లీడ్‌లోకి వచ్చారు. ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. మొత్తంగా ఉత్తర, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగితే... హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో బీఆర్‌ఎస్ తన పట్టు ఇంకొక సారి నిలుపుకుంది.


మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్‌ బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడ్డాయి. ఇక్కడ కాంగ్రెస్ 8 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే... బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఆరు స్థానాల్లో విజయం దిశగా పయణిస్తున్నారు. ఇలా మహబూబ్‌నగర్‌లో ఇరు పార్టీల మధ్య టైట్‌ ఫైట్ నడుస్తోంది.


మెదక్ జిల్లాలో కారు జోరు
మెదక్‌ జిల్లా పరిస్థితి చూసుకుంటే ఇక్కడ అధికార పార్టీకి మొగ్గు కనిపిస్తోంది. అందరి అంచనాలును తలకిందులు చేస్తూ ఇక్కడ బీఆర్‌ఎస్‌ దూసుకెళ్తోంది. పది స్థానాలు ఉన్న మెదక్‌లో ఆరింటిలో కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. నాలుగు స్థానాల్లో హస్తం గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఈ రెండు పార్టీలు మినహా వేరే వాళ్లు ఈ మెదక్‌లో చోటు దక్కేలా కనిపించడం లేదు.


హైదరాబాద్ లోనూ
హైదరాబాద్‌లో పరిస్థితి కూడా బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా ఉంది. ఇక్కడ 15 నియోజకవర్గాలు ఉంటే.. 8 స్థానాల్లో అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. 1 స్థానంలో మాత్రమే కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక్కడ మిగతా పార్టీలు కూడా ఖాతాలు తెరుస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ కంటే బీజేపీ లీడ్‌లో ఉంది. ఇక్కడ రెండు స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఎంఐఎం అభ్యర్థులు నాలుగు స్థానాల్లో దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపనట్టే కనిపిస్తోంది.


రంగారెడ్డిలో కూడా
రంగారెడ్డి జిల్లాలో ఫలితాలు చూస్తే బీఆర్‌ఎస్‌ జోరు కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్ నుంచి కారు దూసుకెళ్లింది. 14 స్థానాలు ఉన్న రంగారెడ్డి జిల్లాలో మూడంటే మూడు చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు సత్తా చూపగలిగారు. మిగతా 11 స్థానాల్లో మాత్రం కారు బ్రేకుల్లేకుండా దూసుకెళ్లింది. చంద్రబాబు అరెస్టు లాంటి అంశాలతో ఇక్కడ కారుకు స్పీడ్‌ బ్రేకర్లు ఉంటాయని అంతా భావించారు కానీ అలాంటి పరిస్థితి ఏమీ కనిపించడం లేదు. రంగారెడ్డి జిల్లాలో కారు తన పట్టు నిలుపుకునేట్టు కనిపిస్తోంది.


వరంగల్‌లో కాంగ్రెస్ హవా
వరంగల్ జిల్లాలో మాత్రం కాంగ్రెస్‌ హవా కొనసాగింది. ఇక్కడ బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం ఉంటుందని అంతా భావించారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించ లేదు. మొదటి నుంచి కాంగ్రెస్ స్పీడ్‌ కనిపిస్తోంది. ఇక్కడ మంత్రి ఎర్రబెల్లి ఓడిపోయే పరిస్థితి కనిపిస్తోంది. వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే మూడు చోట్ల మాత్రమే కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థులు ప్రభావం చూపుతున్నారు. మిగతా 9చోట్ల చేయి తిరినట్టు కనిపిస్తోంది.


ఆదిలాబాద్‌లో బీజేపీ


ఆదిలాబాద్‌ లాంటి బాగా వెనుకబడిన జిల్లాలో బీజేపీ దూసుకెళ్తోంది. ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్యే హోరాహోరీ పోరు కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ మాత్రం రెండంటే రెండు స్థానాల్లో ఆధిక్యం కనిపిస్తోంది. ఓవరాల్‌గా 10 స్థానాలు ఉన్న ఆదిలాబాద్‌ జిల్లాలో కాంగ్రెస్‌, బీజేపీ తలో నాలుగు స్థానాల్లో ముందంజలో ఉంటే... బీఆర్‌ఎస్‌ రెండు స్థానాల్లో ఆధిక్యం కనబరుస్తోంది.


ఖమ్మంలో తిరుగులేని కాంగ్రెస్


మొదటి నుంచి అనుకుంటున్నట్టు ఖమ్మంలో కాంగ్రెస్‌కు తిరుగు లేదు. ఎక్కడా బీఆర్‌ఎస్‌ ప్రస్తావన లేకుండా ఎలాంటి ఆటంకాలు లేకుండా కాంగ్రెస్ దూసుకెళ్తోంది. 10 స్థానాల్లో పోటీ జరిగితే 9 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు విజయం దిశగా పయనిస్తున్నారు. ఇక్కడ ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి ముందంజలో ఉన్నారు. బీఆర్‌ఎస్ టికెట్ దక్కని జలగం వెంకటరావు ఫార్వర్డ్‌ బ్లాక్‌ తరఫున పోటీ చేశారు. ఆయన అక్కడ విజయం దిశఘా పయనిస్తున్నారు.


నల్గొండలోనూ కాంగ్రెస్ సత్తా


నల్గొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ ఎదురు లేకుండా పోయింది. మంత్రిగా పని చేసిన జగదీష్‌రెడ్డి మినహా ఏ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఇక్కడ ప్రభావం చూపలేకపోయారు. అంతా వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ పోటీ చేసిన అన్ని స్థానాల్లో దూసుకెళ్తోంది. 12 స్థానాలు ఉన్న నల్గొండ జిల్లాలో 11 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థలు దూసుకెళ్తున్నారు.


నిజామాబాద్‌లో ఇలా


నిజామాబాద్‌లో జిల్లాలో విషయానికి వస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్‌ ఆధిక్యంలో ప్రదర్శిస్తోంది. ఇక్కడ రెండో స్థానం కోసం బీఆర్ఎస్‌, బీజేపీ పోటీ పడుతున్నారు. 9 స్థానాలు ఉన్న నిజామాబాద్ జిల్లాలో ఐదు స్థానాల్లో కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తుంటే... చెరో రెండు స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ పోటీ పడుతున్నాయి.