Chhattisgarh Assembly Election Results:



ఛత్తీస్‌గఢ్‌లో లీడ్‌లో బీజేపీ..


ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల ఫలితాల (Chhattisgarh Election Result 2023) ట్రెండ్ ముందు కాంగ్రెస్‌కి ఫేవర్‌గానే కనిపించినా ఆ తరవాత వేవ్‌ మళ్లీ బీజేపీ వైపు మళ్లుతోంది. 90 నియోజకవర్గాలున్న ఛత్తీస్‌గఢ్‌లో 46 చోట్ల విజయం సాధించిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశముంటుంది. అయితే...ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తామని గట్టిగానే ప్రచారం చేసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు (Chhattisgarh Election Result) కూడా ఇదే అంచనా వేశాయి. ఇక్కడ బీజేపీ కన్నా కాంగ్రెస్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించాయి. కానీ...కౌంటింగ్‌ మొదలైన తరవాత తొలి రౌండ్లలో కాంగ్రెస్‌ లీడ్‌లో దూసుకుపోయింది. రౌండ్‌లు మారే కొద్దీ...ఒక్కసారిగా బీజేపీ అభ్యర్థులు లీడ్‌లోకి వచ్చారు. ఇప్పుడు అందిన సమాచారం ప్రకారం 50 మందికి పైగా బీజేపీ అభ్యర్థులు లీడ్‌లో ఉన్నారు. కచ్చితంగా గెలుస్తామనుకున్న కాంగ్రెస్ మాత్రం వెనకబడిపోయింది. దాదాపు అన్ని కీలక నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థులే దూసుకుపోతున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో పరిపాలనా వ్యవస్థ సరిగ్గా లేదని విమర్శలు చేస్తూ ప్రచారం చేసింది బీజేపీ. ముఖ్యంగా సీఎం భూపేశ్ భగేల్‌ని టార్గెట్ చేసింది. 


మోదీ గ్యారెంటీలకే ఓటు.. 


మోదీ గ్యారెంటీలకే ఛత్తీస్‌గఢ్ ఓటర్లు మొగ్గు చూపుతున్నారని బీజేపీ శ్రేణులు ఇప్పటికే సంబరాలు మొదలు పెట్టాయి. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలుసని, కానీ ఈ స్థాయిలో ఉందని ఊహించలేదని చెబుతున్నాయి. అంటే...బీజేపీ కూడా ఊహించని రీతిలో గెలుపొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినీతి, లిక్కర్ స్కామ్, మహదేవ్ యాప్ స్కామ్‌ లాంటి అంశాలు కాంగ్రెస్‌ విజయావకాశాలపై కొంత ప్రభావం చూపించినట్టే కనిపిస్తోంది. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్న చర్చ అప్పుడే మొదలైంది. బీజేపీ తరపున మాజీ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పేరు గట్టిగానే వినబడుతోంది. హైకమాండ్‌ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని ఇప్పటికే రమణ్ సింగ్ వెల్లడించారు. తాను ఎప్పటికీ అధిష్ఠానాన్ని ఏమీ అడగలేదని స్పష్టం చేశారు. ఇక ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే..కాంగ్రెస్‌కే అన్ని ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. కానీ ఇప్పుడు ట్రెండ్‌ని చూస్తుంటే అదంతా తారుమారైంది.