UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆరో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ముఖ్యంత్రి యోగి ఆదిత్యనాథ్ పోటీ చేసిన గోరఖ్‌పుర్ సహా పూర్వాంచల్‌ ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు ఈ విడతలో ఓటింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 53.31 శాతం పోలింగ్ నమోదైంది.


ఆ స్థానంపైనే


మొత్తం పది జిల్లాల్లోని 57 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ​ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ పోటీ చేసిన గోరఖ్​పుర్​ నియోజకవర్గంవైపే అందరి చూపు ఉంది. ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు చంద్రశేఖర్ ఆజాద్ గోరఖ్​పుర్ అర్బన్ నియోజకవర్గం నుంచి యోగి ఆదిత్యనాథ్​కు వ్యతిరేకంగా పోటీ చేశారు.






ఆ నియోజకవర్గంలోని కన్యా నగర్​ క్షేత్రలోని పోలింగ్​ కేంద్రం వద్ద సీఎం యోగి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు గోరఖ్​నాథ్​ ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం తథ్యమని యోగి ధీమా వ్యక్తం చేశారు.


ప్రముఖులు వీరే


ఈ విడత ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్‌తో పాటు పలువురు మంత్రులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.



  1. సూర్యప్రతాప్ షాహీ

  2. సతీశ్ చంద్ర ద్వివేది

  3. జైప్రతాప్ సింగ్

  4. శ్రీరాం చౌహాన్

  5. జైప్రకాశ్ నిషాద్ 


విపక్ష నేతలు



  • ఎస్పీ నేత స్వామిప్రసాద్ మౌర్య

  • యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ 

  • అసెంబ్లీలో విపక్ష నేత రామ్ గోవింద్ చౌదరి


ఎస్పీ ధీమా


మరోవైపు ఈ విడత ఎన్నికల్లోనూ సమాజ్‌వాదీదే పై చేయని ఆ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఈ ఎన్నికల్లో భాజపాను ఓడించి సమాజ్‌వాదీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


యూపీలో ఏడో విడత పోలింగ్ మార్చి 7న జరగనుంది. అనంతరం మార్చి 10న ఫలితాలు వెలువడనున్నాయి.


Also Read: Russia Ukraine War: అలాంటిదేం లేదు, ఉక్రెయిన్‌లో మా విద్యార్థులు బందీలుగా లేరు: భారత్


Also Read: Russia Ukraine War: ఇది వాళ్ల టైం- బైడెన్‌ను చేతకానివాడిగా చూస్తున్నారు: ట్రంప్ షాకింగ్ కామెంట్స్