UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. భవిష్యత్ ప్రధాని అభ్యర్థిగా భాజపా భావిస్తోందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై కేంద్ర హోంమంత్రి, భాజపా చాణక్యుడు అమిత్ షా కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యోగిని.. కాబోయే ప్రధానిగా ప్రజలు భావించడం సహజమేనన్నారు.
సహజమే
యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో మరోసారి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అయితే సీఎం యోగిని కాబోయే ప్రధాని అభ్యర్థిగా ప్రజలు చూస్తున్నారని, దీనిపై మీరేమంటారు అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా సమాధానమిచ్చారు.
ఇది సహజమే. యోగి నాయకత్వంలో ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నో ఏళ్లుగా లేని అభివృద్ధి జరిగింది. యూపీలో 30 వైద్య కళాశాలలు వచ్చాయి. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాల వచ్చేలా చూస్తున్నాం. రాష్ట్రంలో రెండు ఎయిమ్స్ ఆసుపత్రులు ఉన్నాయి. రాష్ట్రంలో 10 కొత్త విశ్వవిద్యాలయాలు, 77 కళాశాలలు భాజపా సర్కార్ నిర్మించింది. 1.4 లక్షల కాలేజీలను అభివృద్ధి చేశాం. - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
శాంతిభద్రతలు
రాష్ట్రంలో శాంతి భద్రతలను మెరుగు పరిచేందుకు యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా శ్రమించారు. అలానే రహదారుల అనుసంధానాన్ని అభివృద్ధి చేశామని.. గంగా ఎక్స్‌ప్రెస్‌వేను ప్రారంభించామన్నారు.
యోగి ఆదిత్యానాథ్.. అందరికీ ఆదర్శంగా నిలిచారు. శాంతిభద్రతలను అదుపులో ఉంచేందుకు తీవ్రంగా శ్రమించారు. దొంగతనాలు, అత్యాచారాల కేసులు 30-70 శాతం పడిపోయాయి. యూపీలో ఇంతకుముందు ఎప్పుడు ఇంత మంచి రహదారులు లేవు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను ఎక్స్‌ప్రెస్‌వేలతో అనుసంధానం చేశారు. - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
మళ్లీ గెలుపు ముఖ్యం
2024లో నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడు యోగి ఆదిత్యానాథ్ గెలుపు భాజపాకు కీలకమని భావిస్తున్నారా అని అడిగిన ప్రశ్నకు అమిత్ షా.. యూపీ తమకు చాలా కీలకమన్నారు.
నేను అలా చెప్పను. దిల్లీలో అధికారం కావాలంటే లఖ్‌నవూ చాలా కీలకమంటున్నాను. ఉత్తర్‌ప్రదేశ్‌లో 80 లోక్‌సభ స్థానాలు ఉన్నందున ఇక్కడ భాజపా అధికారంలోకి రావడం కీలకం. 2024లో కేంద్రంలో అధికారంలో ఉండాలంటే ఇది అవసరం. ఉత్తర్‌ప్రదేశ్‌లో అత్యధిక స్థానాలు లేకపోతే కేంద్రంలో పూర్తి మెజార్టీతో అధికారంలోకి రావడం కష్టం. - అమిత్ షా, కేంద్ర హోంమంత్రి