ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. 'లోక్‌ కల్యాణ్ సంకల్ప పత్రం' పేరుతో విడుదల చేసిన ఈ మేనిఫెస్టోలో రైతులు, నిరుద్యోగులకు వరాలజల్లు కురిపించింది భాజపా. లఖ్‌నవూలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్‌లో జరిగిన జన సభలో మేనిఫెస్టోను విడుదల చేశారు.







కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రదాన్, అనురాగ్ ఠాకూర్  యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సహా యూపీ భాజపా చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 


ఏముంది?



  • ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎంకిసాన్) కింద భూములు లేని రైతులకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రెట్టింపు చేయనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఏడాదికి రూ.6 వేలు రైతుల ఖాతాలో వేస్తోంది సర్కార్.

  • గోధుమ, వరి పంటకు కనీస మద్దతు ధర.

  • మహిళా ఓటర్లపై వరాల జల్లు కురిపించింది కాషాయ పార్టీ. అధికారంలోకి వస్తే విద్యార్థినుల, ఉద్యోగం చేసే మహిళలకు స్కూటీలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అలానే విద్యార్థినులకు యూపీఎస్‌సీ, పీఎస్‌సీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తామని వాగ్దానం చేసింది.

  • అలానే విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేస్తామని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్‌లైన్ బోధన ఎక్కువగా ఉండటంతో ఇవి వారికి ఉపయోగపడతాయని అభిప్రాయపడింది.

  • నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొంది. కనీసం ఒక్క ఇంట్లో ఒక్క ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది.

  • ఉజ్వల యోజన కింద వినియోగదారులకు ఏడాదిలో 3 సిలిండర్లు ఉచితంగా అందిస్తామని వాగ్దానం చేసింది.

  • అలానే శ్రీకృష్ణ జన్మభూమి ఆలయాన్ని పునరుద్ధరణ చేస్తామని హామీ ఇచ్చింది భాజపా. 


ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల కోసం ఫిబ్రవరి 7న ఉదయం 10.15 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేస్తామని భాజపా నిశ్చయించుకుంది. కానీ లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో విడుదలను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్​ప్రదేశ్ భాజపా అధ్యక్షుడు స్వతంత్ర దేవ్ సింగ్ ప్రకటించారు. 


ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు 7 విడతల్లో జరగనున్నాయి. మొదటి విడత ఎన్నికలు ఫిబ్రవరి 10న జరగనుంది. మార్చి 10న ఫలితాలు ప్రకటించనున్నారు.


Also Read: Cancer: టీ, కాఫీలు మరీ వేడిగా తాగుతున్నారా? ఆ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువంటున్న అధ్యయనం


Also Read: Boycott KFC Trending: కెఎఫ్‌సిని ఎందుకు బాయ్‌కాట్ చేయమంటున్నారు? అసలేం జరిగింది?