ప్రపంచంలో కాఫీ, టీలతోనే చాలా మందికి తెల్లారుతుంది. ఉదయం లేచాక ఈ పానీయాలు తాగనిదే ఏ పనీ మొదలుపెట్టరు. వీరిలో కొంతమంది గోరువెచ్చగా తాగితే, మరికొంతమంది చాలా వేడిగా తాగుతారు. అలా వేడిగా తాగుతున్న వారికి ఇదో షాకింగ్ న్యూస్. రోజూ వేడిగా వేడిగా పానీయాలు తాగే వారిలో అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెబుతోంది ఓ కొత్త అధ్యయనం. వేడిగా కాకుండా గోరు వెచ్చగా తాగమని సిఫారసు చేస్తోంది. 


క్యాన్సర్‌తో ముడిపడిన పలు అంశాలపై నిత్యం అధ్యయనాలు సాగుతూనే ఉన్నాయి. ఎలాంటి ఆహారాలు, పానీయాల వల్ల క్యాన్సర్ ముప్పు పెరుగుతుందో, ఎలాంటి ఆహారాల వల్ల ప్రమాదం తగ్గుతుందో తెలుసుకోవడమే ఈ అధ్యయనాల ముఖ్య ఉద్దేశం. అలా జరుగుతున్న ఓ అధ్యయనంలో అన్న వాహిక క్యాన్సర్‌కు సంబంధించి షాకింగ్ ఫలితం వచ్చింది. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్యాన్సర్‌లో ప్రచురించిన పరిశోధన వివరాల ప్రకారం అన్నవాహిక క్యాన్సర్, వేడి పానీయాల మధ్య సంబంధాన్ని వివరించింది. గతంలో కూడా ఈ అంశంపై పలు అధ్యయనాలు జరిగాయి. అవి కూడా దాదాపు ఇదే ఫలితాన్ని చెప్పాయి. 


కొత్త అధ్యయనం ప్రకారం 60సెంటీగ్రేడుల ఉష్ణోగ్రత లేదా అంతకన్నా ఎక్కువ వేడితో టీ తాగేవారిలో అన్నవాహిక క్యాన్సర్ బయటపడింది. ఇరాన్‌లో ఈ అధ్యయనం సాగింది. అలా వేడివేడి పానీయం రోజూ అన్నవాహిక నుంచి జారడం వల్ల అన్నవాహిక గోడలపై కణాలు పొలుసుల కణ క్యాన్సర్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని పరిశోధకులు కనిపెట్టారు. అయితే ఇదొక్కటే కారణమని చెప్పలేమని తెలిపారు. ఒక వ్యక్తికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చే ప్రమాదం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. ధూమపానం అలవాటు ఉందా? ఎంత సేపు పొగతాగుతారు, వారి ఆహారపు అలవాట్లు ఏంటి? ఇవన్నీ కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాల గురించి వివరిస్తాయి. ఈ అలవాట్లు కూడా అన్నవాహిక క్యాన్సర్ వచ్చేందుకు దోహదం చేయవచ్చని అభిప్రాయపడ్డారు.


యూకేలో ఎక్కువ మంది గ్రీన్ లేదా బ్లాక్ టీ తాగుతారు. చాలా మంది చల్లని పాలను కలుపుకుంటారు. కాబట్టి కాఫీల్లాంటివి త్వరగా చల్లారిపోతాయి. కాబట్టి వీరికి అన్నవాహిక క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ అని యూకే క్యాన్సర్ రీసెర్చ్ పరిశోధకులు చెబుతున్నారు. ఈ సంస్థ డేటా ప్రకారం ప్రతి ఏడాది 9,300 మంది అన్నవాహిక క్యాన్సర్ బారిన పడుతున్నారు. 


Also read: కారంపొడికి బదులు పచ్చిమిర్చే వాడండి... డయాబెటిక్ రోగులకు మంచిది


Also read: హ్యాపీ ప్రపోజ్ డే, ఇలా ప్రపోజ్ చేసి మనసు దోచేయండి