గుప్పెడంత మనసు ఫిబ్రవరి 8 మంగళవారం ఎపిసోడ్


దేవయాని రిషిని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చెయ్యడం విన్న మహేంద్ర.. జగతిని పంపించెయ్యాలని నిర్ణయించుకుంటాడు. రిషి దేవయాని మాటలను తలుచుకుని ఆలోచిస్తుండగా మహేంద్ర జగతితో కలసి లగేజ్ తీసుకుని కిందకు వస్తాడు. జగతి వెళ్లిపోతుంది అని చెబుతాడు. ‘వెళ్లమని ఎవ్వరూ చెప్పలేదుగా డాడ్’ అంటాడు రిషి ఇబ్బందిగా చూస్తూ. ‘ఎవరి క్లారిటీలు వాళ్లకి ఉంటాయి కదా రిషి.. ఏంటి ఇలా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? నీకేం కావాలో నాకు తెలుస్తుంది కదా రిషి’ అంటాడు మహేంద్ర. ఇంతలో దేవయాని, ఫణీంద్ర వస్తారు. లగేజ్ బ్యాగ్ చూసిన దేవయాని.. ‘ఈ జగతి ఏంటీ ఇంత ట్విస్ట్ ఇచ్చింది.. నేను పంపాలనుకుంటే తనే వెళ్లిపోతుంది.. మహేంద్ర జగతిలు మామూలు వాళ్లు కాదు. అందుకేగా మిమ్మల్ని ఒకరికి ఒకరిని దూరం చేసింది..అమ్మో నేను రిషి దగ్గర చెడ్డదాన్ని కాకూడదు’అనుకుంటుంది దేవయాని మనసులో. 


‘ఏంటి జగతి.. ఎందుకు ఇలా సడన్‌గా బయలుదేరుతున్నావో తెలుసుకోవచ్చా’ అంటుంది దేవయాని కావాలనే. ‘మహేంద్రా ఏంటిది? జగతి వెళ్లడం ఏంటీ?’ అంటాడు ఫణీంద్ర. ‘మనం రమ్మనలేదు.. మనం ఉండమనలేం అన్నయ్యా’ అంటాడు మహేంద్ర బాధగా.. ‘ఏంటమ్మా ఉండొచ్చు కదా..’ అంటాడు ఫణీంద్ర. జగతి తలదించుకుంటుంది బాధగా.. ఫణీంద్ర రెండు అడుగులు ముందుకు వేసి.. ‘అమ్మా జగతి నువ్వు ఇంట్లోకి రావడం మాకు ఎప్పుడూ ఆనందమే అమ్మా’ అంటాడు బాధగా.. ‘అవును అన్నయ్యా.. ఈ ఇంటికి జగతి రాకకు కారణాలు ఏదైనా సరే.. వచ్చినందుకు.. వచ్చేలా చేసిన వాళ్లకి.. థాంక్స్ చెప్పాలి’ అంటాడు మహేంద్ర.


ఇంతలో ధరణి వచ్చి బొట్టు పెడుతుండగా..ఇలాంటివి పెద్దమ్మ చేతుల మీదుగా జరిగితే బావుంటుంది వదినా అంటాడు రిషి. నన్ను ఇలా ఇరికించాడేంటని అనుకుంటూ దేవయాని అయిష్టంగా బొట్టు పెడుతుంది. అప్పుడు కూడా ఫణీంద్ర చాలా ఎమోషనల్‌గా ‘అమ్మా జగతి.. నువ్వు కాలేజ్‌లో సార్ అంటావ్.. మేము మేడమ్ అంటాం.. కానీ పిలుపు మారింత మాత్రాన్న బంధాలు మారవమ్మా.. ఈ ఇల్లు నీ రాకకోసం ఎదురు చూస్తూ ఉంటుందమ్మా.. నీ స్థానం ఎప్పటికీ నీదే.. ఎవరు అవును అన్నా కాదు అన్నా బంధాలు రక్తసంబంధాలు అబద్దం కాదు కదా?’ అంటాడు ఫణీంద్ర. ‘చాలు అన్నాయ్యా.. చాలా గొప్ప మాట చెప్పావ్’ అంటూ ‘జగతి ఆశీర్వాదం తీసుకుందా’ అంటాడు మహేంద్ర.  దేవయాని వెనక్కి వెళ్లిపోవడంతో జగతి, మహేంద్రలు ఫణీంద్ర కాళ్లకు నమస్కారం చేస్తారు. 


జగతి చాలా ఎమోషనల్‌గా ముందుకు నడుస్తూ రిషివైపు తిరిగి చూస్తుంది కానీ రిషి తలదించేసుకుంటాడు. గుమ్మం దాటే ముందు కూడా లోపలకి అడుగుపెట్టిన క్షణాలని తలుచుకుని కన్నీళ్లు కారుస్తుంది. ఆ గడపకు మరోసారి నమస్కరించి  రిషివైపు చూస్తుంది. రిషి పట్టనట్లుగా తలతిప్పుకుంటాడు. మొత్తానికీ ఆ సీన్ మనసుల్ని పిండేస్తుంది. ఇక వసు కూడా వెనుకే నడుస్తుంది. మెట్లు దిగి ముందుకు నడుస్తుంటే.. ఫణీంద్ర కూడా వెనుకే వెళ్తాడు. రిషి వెళ్లబోతుంటే దేవయాని భుజంపై చెయ్యి వేసి ఆపేస్తుంది. ‘వసు నువ్వు వెళ్లి కారులో కూర్చోమ్మా’ అంటాడు మహేంద్ర. వసు వెళ్తుంది. అప్పుడు మహేంద్ర జగతితో.. బాధగా.. ‘జగతి నా భార్యగా గౌరవంగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టాలి నువ్వు.. ఎవరో పిలిస్తేనో ఎవరో అనుమతి ఇస్తేనో కాదు..’ అంటాడు మహేంద్ర. 


‘నువ్వు ఎందుకు వెళ్లమన్నావో నాకు అర్థమైంది మహేంద్రా.. చంద్రుడిది కలువ పువ్వుది గొప్ప బంధం మహేంద్రా కానీ అవి ఎప్పటికి కలవవు’అంటుంది జగతి. ‘జగతి నువ్వంటే నేనే.. నేనంటే నువ్వే.. నీ గౌరవమే నా గౌరవం.. నిన్ను ఎవరైనా ఒక మాట అంటే నేను భరించలేను.. అందుకే ఇలా..’ అంటూ మహేంద్ర లగేజ్‌ని కారులో పెడతాడు. ‘నువ్వు కూర్చో మహేంద్రా.. నేను డ్రైవ్ చేస్తాను’అంటూ జగతి కారు డ్రైవ్ చేస్తూ ముందుకు వెళ్లిపోతుంది. దేవయాని సంబరానికి అవధులు ఉండవు. సంబరంగా నవ్వుకుంటూ లోపలికి వెళ్లిపోతుంది. ఫణీంద్ర బాధగా గుమ్మం బయటే కారు వెళ్తుంటే చూస్తూ ఉండిపోతాడు. ధరణి కళ్లనిండా నీళ్లతో రిషిని కోపంగా చూస్తూ లోపలకి వెళ్లిపోతుంది.


ఇక జగతి ఇంటి ముందు కారు ఆపి.. వసు కీ నా బ్యాగ్‌లో ఉంది తలుపు తియ్యి అని పంపించి.. మహేంద్రని తీసుకుని లోపలికి వెళ్తుంది. అక్కడ వసు కన్ను ఆర్పకుండా జగతినే జాలిగా చూస్తుంటే.. ‘ఏంటి వసు అలా చూస్తున్నావ్.. ఇక ఇక్కడికి రాను అనుకున్నావా? ఈ గడప నన్ను శపించిందేమో.. నువ్వు మళ్లీ నా దగ్గరకే రావాలని.. ఈ గడపకి ఆ గడపకి దూరం తక్కువే అయినా.. ఆ గడప దాటి లోపలకి వెళ్లడానికి 22 ఏళ్లు పట్టింది..’ అంటుంది జగతి బాధగా.. ‘వీలైతే నన్ను క్షమించు జగతి.. నా భార్యని గౌరవం లేని చోట నేను చూడలేను జగతి.. అందుకే ఇలా’ అంటాడు మహేంద్ర బాధగా.. నీ తప్పేం లేదు మహేంద్రా అంటుంది జగతి. ఇక రిషి మేడపై ఒంటరిగా నిలబడి జరిగింది అంతా తలుచుకుంటూ బాధపడతాడు. ధరణి కూడా అలానే వంట గదిలో బాధపడుతుంటే.. దేవయాని వచ్చి అందరికీ స్వీట్ చెయ్యమంటుంది.


రేపటి (బుధవారం) ఎపిసోడ్ లో
రిషి.. ధరణిని.. వదినా మీరేదో డల్‌గా ఉన్నారేంటీ అంటాడు. ‘అనుకోకుండా ఒక సంతోషం ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది రిషి’ అంటుంది ధరణి.  కట్ చేస్తే.. వసుతో మహేంద్ర.. ‘జగతి ఆ ఇంటికి అతిథిగా వచ్చింది.. జగతి సగర్వంగా తలెత్తుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టాలి.. రిషి జగతిని అమ్మగా గుర్తించాలి’అంటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే రిషి కారు ఇంటి ముందు ఆగుతుంది. 


Also Read: వాయిస్ తగ్గించి మాట్లాడు ఆయుష్షు మిగులుతుంది.. సౌందర్య రీ ఎంట్రీ మామూలుగా లేదు .. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్