సూపర్ స్టార్ రజనీకాంత్ చాలా రోజుల తర్వాత ప్ల‌బిక్‌లోకి వచ్చారు. సోమవారం ఓ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఆయన వెంట భార్య లత, రెండో కుమార్తె సౌందర్య కూడా ఉన్నారు. పెద్ద కుమార్తె ఐశ్వర్య, హీరో ధనుష్ తమ దారులు వేర్వేరు అని జనవరి 17న ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నుంచి రజనీకాంత్ బయట ఎక్కడా కనిపించలేదు. పబ్లిక్ ఫంక్షన్లు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు.


చెన్నైలో సోమవారం జరిగిన ఓ కార్యక్రమానికి రజనీకాంత్ హాజరు అయ్యారు. ఓ హోటల్ ఓపెనింగ్ ఆయన చేతుల మీదుగా జరిగింది. దాంతో అక్కడ ఉన్న అభిమానుల ఆనందానికి అవధులు లేవు. ఫొటోలు తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. నెట్టింట రజనీకాంత్ ఫొటోలు వైరల్ అయ్యాయి. అయితే... హోటల్ ఓపెనింగ్ దగ్గర మీడియాతో మాట్లాడటానికి రజనీకాంత్ ఇష్టపడలేదు. బహుశా... ఐశ్వర్య విడాకుల ప్రస్తావన వస్తుందని అవాయిడ్ చేసినట్టు ఉన్నారు. ఇలాంటి పబ్లిక్ ఫంక్షన్లకు రజనీకాంత్ వచ్చిన ప్రతిసారీ ఆయన వెంట ఐశ్వర్య కనిపించేవారు. కానీ, ఈసారి లేరు.


ఇటీవల ఐశ్వర్య కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆరు రోజుల క్రితం తనకు కొవిడ్ పాజిటివ్ అని ఆమె వెల్లడించారు. అందువల్ల, రజని వెంట రావడానికి కుదరలేదు ఏమో! సినిమాలకు వస్తే... తెలుగులో 'పెద్దన్న'గా విడుదలైన 'అన్నాత్తే' సినిమా తర్వాత రజనీకాంత్ విరామం తీసుకుంటున్నారు. తాజాగా కొత్త సినిమాకు ఓకే చెప్పారని సమాచారం. త్వరలో ఆ వివరాలు వెల్లడి కానున్నాయని చెన్నై టాక్.