టీఆర్ఎస్, బీజేపీ మధ్య వరి రాజేసిన అగ్గి ఇంకా కొనసాగుతోంది. తాజాగా బడ్జెట్ పై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రమయింది. ఇప్పుడు సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగి బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారు. జాతీయ స్థాయిలో చక్రం తిప్పేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని అందుకే బీజేపీని టార్గెట్ చేశారని కమలం పార్టీ నేతలు అంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో బీజేపీ నేతలకు విమర్శలు చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని 'ఈక్వాలిటీ ఫర్ తెలంగాణ' అనే యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ పోస్టులు పెట్టారు. ఈ పోస్టులు వైరల్ అయ్యాయి. దీంతో మంత్రి కేటీఆర్, బీజేపీ నేతల మధ్య ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం చోటుచేసుకుంది.  






బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్ వేదిగా విమర్శలు చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్‌. రామచంద్రరావు ట్వీట్లకు మంత్రి కేటీఆర్ కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణకు బడ్జెట్ లో అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక బీజేపీ నేతలు మతపర అంశాలు తెరపైకి తీసుకువస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన అంశాలు ఇవీ అని ట్వీట్ చేశారు.  తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా, అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల విషయంలో అన్యాయంపై కిషన్‌రెడ్డి వివరణ ఇవ్వాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. మతసామరస్యం అంటే గాడ్సే భక్తులకు అర్థం కాదని కౌంటర్ ఇచ్చారు. ఐటీఐఆర్‌ ఇవ్వకున్నా దిగ్గజ ఐటీ కంపెనీలు తెచ్చామని, జాతీయ హోదా ఇవ్వకున్నా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నామని, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా ప్రైవేటు కోచ్‌ ఫ్యాక్టరీ పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ కిషన్ రెడ్డికి ట్వీట్ చేశారు. రాష్ట్రానికి అండగా మేముంటే..దేశానికే దండగ మీరు అని కౌంటర్‌ ఇచ్చారు.