ఏపీ సీఎం జగన్ హైదరాబాద్ ముచ్చింతల్‌లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో పాల్గొన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సీఎం జగన్ రోడ్డు మార్గంలో ముచ్చింతల్ చేరుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో వచ్చిన సీఎం జగన్ ముందుగా ప్రవచన మండపానికి చేరుకున్నారు. చినజీయర్ స్వామి సమక్షంలో చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానాన్ని సీఎం జగన్ వీక్షించారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ సమాజంలో అసమానతలను తొలగించేందుకు రామానుజాచార్యులు కృషి చేశారన్నారు. సుమారు వెయేళ్ల క్రితమే అసమానతలకు వ్యతిరేకంగా పోరాడారన్నారు. ఇంతటి మహోన్నత ఆశ్రమాన్ని నిర్మించిన చినజీయర్ స్వామికి అభినందనలు తెలిపారు. రామానుజ స్వామి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. సమతామూర్తి విగ్రహం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. అనంతరం సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని సీఎం జగన్ దర్శించుకున్నారు. విగ్రహ విశేషాలను చినజీయర్ స్వామి సీఎం జగన్‌కు వివరించారు.
సీఎం జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయాను : చినజీయర్ స్వామి
సీఎం జగన్ పై చినజీయర్ స్వామి ప్రశంసలు కురిపించారు. జగన్ నిబద్ధతను చూసి ఆశ్చర్యపోయానన్న ఆయన... ఏపీలో అన్ని వర్గాల ప్రజలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. పాలకులు అన్ని వర్గాలను సమానంగా చూడాలన్నారు. విద్య, వయస్సు, ధనం, అధికారం నాలుగు కలిగి ఉన్నవారు ఇతరుల సలహాలు తీసుకోరన్నారు. కానీ ఇవన్నీ ఉన్న సీఎం జగన్‌లో ఎలాంటి గర్వం లేదన్నారు. వైఎస్ జగన్ అందరి సలహాలు స్వీకరిస్తారన్నారు. సీఎం జగన్ మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని చినజీయర్ స్వామి ఆకాంక్షించారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చినజీయర్ స్వామి గుర్తుచేసుకున్నారు. వైఎస్ఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి పాడుపడ్డారన్నారు. వైఎస్ఆర్ తనకు బాగా తెలుసని, ముఖ్యమంత్రి కాకముందు వచ్చి తనను కలిశారన్నారు.
ఆశ్రమంలో హాల్ ఆఫ్ ఫ్రేమ్
దేశంలో సమాజ సేవకులకు మంచి జరగాలని చినజీయర్ స్వామి కోరుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని వర్గాలు క్షేమంగా ఉండాలన్న ఆయన... సమతా స్ఫూర్తిని సమాజానికి అందించాలన్నారు. సమానత కోసం సమాజంలో ఎందరో పోరాడారని చినజీయర్ అన్నారు. నల్ల, తెల్లజాతీయుల మధ్య అంతరాలు తొలగించేందుకు అబ్రహం లింకన్, నల్లజాతీయుల ఉన్నతి కోసం నెల్సన్ మండేలా పోరాడారని గుర్తుచేశారు. రామానుజాచార్యులు సమానత్వం కోసం ఎంతో పోరాడారని చినజీయర్ స్వామి అన్నారు. సమతామూర్తి కేంద్రంలో హాల్ ఆఫ్ ఫ్రేమ్ ఏర్పాటు చేశామన్న ఆయన.. లింకన్, లూథర్ కింగ్, మండేలా తదితర 150 మంది చిత్రాలను హాల్ ఆఫ్ ఫ్రేమ్‌గా ఏర్పాటుచేశామన్నారు.