ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వందల బ్రాంచ్‌లను కలిగి ఉన్న ప్రముఖ ఫాస్ట్‌ఫుడ్ చైన్ ‘కెఎఫ్‌సి’. మనదేశంలో కూడా చాలా చోట్ల దానికి బ్రాంచిలు ఉన్నాయి. ఇప్పుడు కెఎఫ్‌సి బహిష్కరించాలంటూ భారతీయులు పిలుపునిస్తున్నారు. ‘బాయ్‌కాట్ కెఎఫ్‌సి’ హ్యాష్‌ట్యాగ్ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండవుతోంది. ఇంతకీ కెఎఫ్‌సీ మీద మనకెందుకు అంత కోపం వచ్చింది? ఇన్నాళ్లు కెఎఫ్‌సీకి బ్రహ్మరథం పట్టిన మనవాళ్లు ఎందుకిలా ఎదురు తిరిగారు? దానికి కారణం ఒక్కటే ‘మన మనోభావాలు దెబ్బతిన్నాయి’.
భారతీయులకు దేశం పట్ల ప్రేమ, గౌరవం ఎక్కువ. ఇప్పటికే దేశ సరిహద్దులు, భౌగోళిక పరిస్థితులపై పక్క దేశాలతో ఎన్నో ఏళ్లుగా పోరాడుతూనే ఉన్నాం. కాశ్మీర్ కోసం ఎంతో మంది మన వీర జవానులు ప్రాణాలు అర్పిస్తూనే ఉన్నారు. ఎంతో సున్నితమైన అంశం పట్ల స్పందించినప్పుడు కచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. మన దేశానికి చెందని వాళ్లు, కాశ్మీర్ తో ఎలాంటి బంధం లేని వాళ్లు ఆ అంశం గురించి ఏదైనా ప్రకటన చేసే ముందు కూడా, తరువాత జరిగే పర్యవసానాల గురించి ఆలోచించుకోవాలి. కెఎఫ్‌సి మాత్రం భారతీయులకు కోపం తెచ్చేలా ప్రవర్తించింది.
పాకిస్తాన్లో ఉన్న కెఎఫ్‌సి సోషల్ మీడియా ఖాతాలో ‘మీరు మా ఆలోచనల నుంచి ఎప్పటికీ బయటికి పోరు, భవిష్యత్తులో మీకు శాంతియుత జీవనం దక్కుతుందని మేం ఆశిస్తున్నాం’ అని పోస్టు పెట్టారు. దానితో పాటూ ఓ ఫోటోని కూడా జత చేశారు. అందులో ‘కాశ్మీర్ ప్రాంతం కాశ్మీరీలకే చెందుతుంది’ అని కొటేషన్ ఉంది. అది చదివాక భారతీయ నెటిజన్ల రక్తం ఉడికింది. పరాయి దేశానికి చెందిన వ్యక్తి మా దేశంలో ప్రజలు, భూమి గురించి నిర్ణయించడమేంటని మండి పడ్డారు. కెఎఫ్‌సి ని బహిష్కరించండి అంటూ ట్విట్టర్లో క్యాంపెయిన్ మొదలుపెట్టారు.
పోస్టు తీసేసినా కూడా...
ఎప్పుడైతే తమ పోస్టు వల్ల ఇబ్బందుల్లో పడ్డామని కెఎఫ్‌సి వాళ్లు గుర్తించారో వెంటనే దాన్ని డిలీట్ చేశారు. అంతేకాదు ‘భారత దేశానికి బయట ఉన్న వ్యక్తులు మా సోషల్ మీడియా ఖాతాలో ప్రచురించిన పోస్టుకు మేము క్షమాపణలు కోరుతున్నాము. మేము భారతదేశాన్ని చాలా గౌరవిస్తాము. భారతీయులుందరికీ సేవ చేయాలనే నిబద్ధతతో ఉన్నాము’ అని ప్రకటన విడుదల చేసింది కెఎఫ్‌సి. అయినా కూడా భారతీయ నెటిజన్లలో కోపం చల్లారడం లేదు.