సమ్మక్క సారలమ్మ భక్తులకు శుభవార్త. కరోనాకు భయపడి లేదా ఇంకేవైనా కారణాలతో మేడారానికి వెళ్లలేకపోతున్న భక్తులకు దేవాదాయ శాఖ మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. మేడారం జాతరకు వెళ్లకున్నా మొక్కులు చెల్లించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సమ్మక్క - సారలమ్మ ప్రసాదాన్ని ఆర్టీసీ పార్శిల్ సర్వీస్‌తో పాటు పోస్టల్ శాఖ ద్వారా భక్తుల ఇళ్ల వద్దకు చేర్చనున్నామని వెల్లడించారు. ఆర్టీసీ, తపాలా, ఐటీ శాఖల సహకారంతో ఇలా మేడారం ప్రసాదం డోర్ డెలివరీ చేస్తున్నామని వెల్లడించారు. ఈ మేరకు దేవాదాయ శాఖ వినూత్న ప్రయోగం చేస్తుందని స్పష్టం చేశారు.
అంతేకాకుండా, మొక్కుల రూపంలో బంగారంలా భావించే బెల్లాన్ని వనదేవతలకు పంపే వీలు ఉంటుందని మంత్రి తెలిపారు. అలాగే 200 గ్రాముల బంగారం, అమ్మవారి పసుపు, కుంకుమ, ఫొటోలను ప్రసాదంగా పొందవచ్చని తెలిపారు. దీనికి సంబంధించి ఆర్టీసీ, పోస్టల్ శాఖలతో ఇప్పటికే చర్చలు జరిపి ఏర్పాట్లు చేశామని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వానికి చెందిన టీఎస్ ఫోలియో అనే యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని తెలిపారు.
మొక్కులు చెల్లించాలనుకున్న వారు ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవలనూ వినియోగించుకోవచ్చని చెప్పారు. పోస్టు ద్వారా ప్రసాదాన్ని పొందాలనుకున్న వారు.. ఈ నెల 12 నుంచి 22వ తేదీ వరకు ఆ యాప్ ద్వారా రూ.225 చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. మరోవైపు, మొక్కులుగా బెల్లం చెల్లించాలనుకున్న వారు తెలంగాణ ఆర్టీసీ వెబ్ సైట్‌లో సంప్రదించవచ్చని ఆర్టీసీ ఇంకో ప్రకటన విడుదల చేసింది. మరింత సమాచారం కోసం 040 30102829, 040 68153333 నంబర్లను సంప్రదించాలని సూచించింది.
రెండేళ్లకోసారి జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం దేశం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే సమ్మక్క-సారలమ్మ దేవతలకు మొక్కులు చెల్లించుకుంటారు. అనంతరం మేడారం పరిసర ప్రాంతాల్లో తనివితీరా ఎంజాయ్ చేస్తుంటారు. మేడారం జాతర అంటేనే పూర్తిగా మాంసాహారం, మద్యం సర్వసాధారణం. మేడారం చుట్టూ దట్టమైన అడవి, పక్కనే జంపన్నవాగు, చిన్న చిన్న సెలయేర్లు కనిపిస్తాయి. కుటుంబసమేతంగా వనదేవతల దర్శనం కోసం వచ్చే భక్తులు ఇక్కడ ప్రకృతి అందాల మధ్య అడవిలో స్వయం పాకం చేసుకొని ఇక్కడే ఒకరోజంతా ఆనందంతో గడుపుతారు.