సామాజిక ఉద్యమకారుడి స్థానం నుంచి రాజకీయాల్లోకి ఆమ్ ఆద్మీ పేరుతో ఎంట్రీ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ బయట గొప్ప విజయాన్ని నమోదు చేశారు. పంజాబ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించారు. ఏ రాష్ట్రంలోనూ పెద్దగా బలపడలేకపోయిన ఆప్.. పంజాబ్‌లో ఎలా బలపడింది...? పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేదాకా ఎలా వెళ్లింది..? ఆప్ విజయానికి కారమమైన ఐదు కారణాలేంటి ?


1. ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్‌లో మొదటి నుంచి క్రేజ్ !


అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీని ప్రకటించినప్పుడు దేశవ్యాప్తంగా విస్తృత చర్చ జరిగింది. ఢిల్లీలో ఆ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత వచ్చిన  2014 లోక్‌సభ ఎన్నికల్లో పంజాబ్‌లో  నాలుగు స్థానాలు గెలుచుకుని సంచలనం సృష్టించింది. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోయినా 20 సీట్లు , 23.72% ఓటు షేరుతో పంజాబ్‌ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది.  ఆ తర్వాత కేజ్రీవాల్ రాజకీయంగా వేసిన తప్పటడుగుల వల్ల ఆమ్ ఆద్మీ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేక చతికిలపడిపోయినా.. అనూహ్యంగా బలం పుంజుకుంది.







2. కాంగ్రెస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని నమ్మకం కలిగించడం !


దశాబ్దాలుగా శిరో మణి అకాలీదళ్‌ బిజెపి కూటమి, కాంగ్రెస్‌ల మధ్యనే ముఖాముఖి పోటీ కొనసాగుతూ వచ్చింది. 1997 నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని జాట్‌సిక్కు నేతలు ఇద్దరే సొంతం చేసుకున్నారు. మాజీ సిఎంలు కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌,  ప్రకాశ్‌సింగ్‌ బాదల్‌ ఇద్దరే ముఖ్యమంత్రులుగా వచ్చారు. అయితే కాంగ్రెస్, లేదంటే అకాలీల పాలనే గత కొన్ని దశాబ్దాలుగా చూసిచూసి విసిగెత్తిన ప్రజలకు ఆప్‌ ఒక బలమైన ప్రత్యామ్నాయంగా కనిపించేలా చేయడంలో సక్సెస్ అయింది.  చివరి నెలల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చి దళిత నేతకు అవకాశం కల్పించినా ప్రయోజనం లేకపోయింది. పంజాబ్‌ యువత కూడా ఆప్‌వైపే  ఉన్నట్లుగా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేశాయి. బీజేపీ, అకాలీదల్ కూటమిగా లేకపోవడం.. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాలతో ఇబ్బంది పడుతూండటంతో ప్రజలు ప్రత్యామ్నాయం వైపు చూశారు. ఫలితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి చోటు దక్కింది.


3. కేజ్రీవాల్ ప్రజాకర్షక హామీలు !
  
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. పంజాబ్‌లో పార్టీకి ఎంతో మెరుగైన అవకాశాలు ఉన్నాయని ముందుగానే గుర్తించి వ్యూహాలు అమలు చేశారు. ఢిల్లీ మోడల్‌ పరిపాలన, అధికారంలోకి వస్తే గృహాలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆప్‌కున్న క్లీన్‌ ఇమేజ్, ముఖ్యంగా విద్య, ఆరోగ్య రంగాల్లో  ఢిల్లీలో ఆప్‌ చేస్తున్న అభివృద్ధి పంజాబ్‌లోని దిగువ మధ్యతరగతిని ఆకర్షించింది. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో చేసిన తప్పుల్ని దిద్దుకుంటూ ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రివాల్‌ వ్యూహాత్మకంగా ముందుకెళ్లారు.  ప్రాంతీయ పార్టీ కాకపోవడంతో బయటవాళ్లు అన్న ముద్ర, ప్రత్యర్థులందరూ ఇదే అంశాన్ని పదే పదే ఎత్తిచూపిస్తూ ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆప్‌ తనదైన శైలిలో ముందుకు వెళ్లింది. పంజాబ్‌ ఓటర్లలో 45 శాతం ఉన్న.. 96 లక్షల మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుంది. 12 మంది విద్యాధికులైన మహిళలకు టికెట్లు ఇచ్చింది. అక్రమ ఇసుక తవ్వకాలపైనే ఆప్‌ ప్రధానంగా దృష్టి సారించింది. అక్రమ ఇసుక తవ్వకాలను అరికడితే రాష్ట్రానికి 20 వేల కోట్ల ఆదాయం వస్తుందని, దానిని సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించవచ్చునని కేజ్రివాల్‌ విస్తృతంగా ప్రచారం చేశారు. ఫలితం కనిపించింది.



4. ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగానే ప్రకటించడం !


ఆమ్ ఆద్మీ పార్టీ నేత  కేజ్రీవాల్  మరే రాజకీయ పార్టీ చేయని విధంగా టెలి ఓటింగ్‌ ద్వారా పార్టీ రాజ్యసభ సభ్యుడు భగవంత్‌ మన్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఇలా ప్రకటించడానికి కారణం కూడా ఉంది. ఇతరపార్టీలు ఆప్ గెలిస్తే కేజ్రీవాల్ సీఎం అవుతారని ప్రచారం చేయకుండా నిలుపదల చేయగలిగారు. 2017 ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ  ముఖ్యమంత్రి అభ్యర్థి కేజ్రీవాల్ అని అని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ప్రకటించేశారు. పంజాబ్‌లో ఆప్ గెలిస్తే ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి పంజాబ్‌కు కేజ్రీవాల్ వెళ్తారని ఆప్ ప్రచారం చేశాయి. దీన్ని ఇతరపార్టీలు అస్త్రంగా మార్చుకున్నాయి.ఎందుకంటే కేజ్రీవాల్ పంజాబ్‌కు చెందిన వ్యక్తి కాదు. ఆప్ గెలిస్తే  పంజాబ్‌కు హర్యానా వ్యక్తి సిఎం అవ్ఞతారని అప్పట్లో ఇతర పార్టీలు విస్తృతంగా ప్రచారం చేశాయి. ఫలితంగా గెలుస్తారన్న అంచనాల మధ్య చివరికి పరిమితమైన స్థానాలతో సరి పెట్టుకోవాల్సి వచ్చింది. ఈ సారి అలాంటి పరిస్థితి తలెత్తకుండా కేజ్రీవాల్ ముందుగానే సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్‌ను ప్రకటించారు.


5. కాంగ్రెస్ అంతర్గత గొడవలతో ఆమ్ఆద్మీకి లాభం ! 
 
పంజాబ్ కాంగ్రెస్ ఓటమికి ఆ పార్టీ ముఠా తగాదాలే కారణం అని చెప్పుకోవచ్చు.  పీసీసీ అధ్యక్షుడు నవజోత్‌ సింగ్‌ సిద్ధూయే ఆ పార్టీకి  మైనస్‌ అయ్యారు.  అయితే కొత్త సీఎం చన్నీ దళితుడు కావడం, రాష్ట్ర జనాభాలో 32 శాతం వారే ఉండటంతో కాంగ్రెస్‌ ఎన్నో ఆశలు పెట్టుకుంది.  గత ఏడాది సెప్టెంబర్‌లో సీఎం పదవిలోకి వచ్చిన చన్నీ కొద్ది కాలంలోనే తీసుకున్న నిర్ణయాలు కూడా ప్రజల్ని ఆకర్షించేలా నిర్ణయాలు తీసుకున్నారు. కానీ అవన్నీ గ్రూపు రాజకీయాలతో కొట్టుకుపోయాయి. అంతిమంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో అనూహ్యమైన విజయాన్నిసొంతం చేసుకుంది.