Nagababu Files Nomination: ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన నాగబాబు- ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి నారా లోకేష్
జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. శాసన సభ్యుల కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇటీవల ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎమ్మెల్సీగా నాగబాబు అభ్యర్థిత్వాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ తో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు. అభ్యర్థి నాగబాబు శుక్రవారం నాడు తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారిణి వనితారాణికి సమర్పించారు.
నామినేషన్ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, జనసేన ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇదివరకే కూటమి అభ్యర్థిగా నాగబాబు పేరును ఖరారు చేయగా.. పార్టీ అధికారిక ప్రకటన విడుదల చేసింది.
ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ సందర్భంగా అభ్యర్థి నాగబాబుకు ఏపీ మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో విజయం తమదేనని ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే మొత్తం 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు మార్చి 2న ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మార్చి 10న నామినేషన్ దరఖాస్తుల గడువు ముగియనుంది. మార్చి 11 న అభ్యర్థుల నామినేషన్లు పరిశీలించనున్నారు. మార్చి 13న నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగియనుడగా.. మార్చి 20న ఎలక్షన్ కమిషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనుంది. అదే రోజు ఓటింగ్ అనంతరం ఫలితాలు ప్రకటిస్తారు. మార్చి 29న కొత్త ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో ప్రకటించిన 5 శాసన మండలి సభ్యుల ఎన్నికకు కూటమి తొలి అభ్యర్థిగా జనసేన నేత కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఏపీ శాసనసభా భవనంలో రిటర్నింగ్ అధికారి, రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి ఆర్. వనితా రాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.