కరీంనగర్ జిల్లా... ఇది ఉద్యమాల పోరుగడ్డ. గతంలో ఈ జిల్లా కాంగ్రెస్‌కే పట్టు ఉండేది. కానీ 2014 నుంచి సీన్ మారింది. 2014, 2018 ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైంది కాంగ్రెస్ పార్టీ. 2014 నుంచి కరీంనగర్ జిల్లాపై బీఆర్‌ఎస్ పట్టు సాధించింది. ఈ జిల్లా నుంచి బడా నాయకులు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కరీంనగర్, చొప్పదండి, మానుకొండూరు, హుజూరాబాద్.
కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం... ఈ నియోజకవర్గం పరిధిలో కరీంనగర్, కొత్తపల్లి రెండు మండలాలు ఉన్నాయి. ఇది కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 1,99,331 మంది. ఇక్కడ అత్యధికత వెలమ సామాజిక వర్గం నేతలదే. గత ఎన్నికల ఫలితాలను భట్టి చూస్తే... ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక శాతం గెలుపొందింది వెలమ సామాజిక వర్గం నేతలే. మూడుసార్లు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన గంగుల కమలాకర్ గెలిచారు. తొమ్మిది సార్లు వెలమ సామాజిక వర్గం నేతలు గెలవగా, మూడు సార్లు బీసీ సామాజిక వర్గం నేతలు గెలిచారు. వైశ్య, బ్రాహ్మణ, రెడ్డి నేతలు కూడా ఒక్కో సారి విజయం సాధించారు.
2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్) అభ్యర్థిగా పోటీ చేసిన గంగుల కమలాకర్ బీజెపీ అభ్యర్థి బండి సంజయ్‌పై 24,683 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఆ ఎన్నికల్లో గంగుల కమలాకర్‌కు 77,209 ఓట్లు రాగా... బీజెపీ అభ్యర్థి బండి సంజయ్‌కు 52,455 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి చలిమేడ లక్ష్మీ నరసింహ రావుకు 51,339 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక, 2018 ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ తరపున గంగుల కమలాకర్, బీజెపీ తరపున బండి సంజయ్, కాంగ్రెస్ పార్టీ తరపున పొన్నం ప్రభాకర్ పోటీ చేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్... సమీప ప్రత్యర్థి అయిన బీజెపీ అభ్యర్థి బండి సంజయ్‌పై 14,974 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో గంగుల కమలాకర్‌కు 80,983 ఓట్లు, బండి సంజయ్‌కు 66,009 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌కు 39,500 ఓట్లతో మూడో స్థానంలోనే ఆగిపోయారు. గంగుల కమలాకర్‌కు 2018 తర్వాత కేసీఆర్ కేబినెట్‌లో చోటు దక్కింది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీ స్థానానికి పోటీ చేసి.. టీఆర్‌ఎస్ సీనియర్ నేత బోయినపల్లి వినోద్ కుమార్‌పై గెలుపొందారు.
2023 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా గంగుల కమలాకర్‌నే ప్రకటించింది. 2014, 2108లో గంగులకు ప్రత్యర్థిగా ఉన్న బీజేపీ అభ్యర్థి బండి సంజయ్.. ప్రస్తుతం కరీంనగర్ ఎంపీగా ఉన్నారు. అయితే.. ఈసారి కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమంటున్నారు బండి సంజయ్. అధిష్టానం ఆదేశిస్తే... అసెంబ్లీ బరిలో నిలుస్తానని ప్రకటించారు. దీంతో కరీంనగ్ నియోజకవర్గంలో ఎన్నికలు ఈసారి రసవత్తంగా సాగనున్నాయి. బండి సంజయ్ ఎమ్మెల్యే ఎన్నికల బరితో దిగే అవకాశం ఉండటంతో... బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్... ముస్లిం ఓటు బ్యాంకు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.
చొప్పదండి నియోజవర్గం.. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకే వస్తుంది. చొప్పదండి అసెంబ్లీ స్థానంలో గంగాధర, రామడుగు, చొప్పదండి, మల్యాల్, కొడిమ్యాల్, బోయినపల్లి మండలాలు ఉన్నాయి. 1952 నుంచి 2004 వరకు జనరల్ కేటగిరీగా ఉన్న ఈ నియోజకవర్గం... 2008 నియోజకవర్గాల పునర్విభజనలో ఎస్సీ రిజర్వుడ్ అయ్యింది. చొప్పదండి నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ మూడుసార్లు, టీడీపీ ఆరుసార్లు, టీఆర్ఎస్ రెండుసార్లు, పీడీఎఫ్ ఒకసారి గెలిచాయి. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి బొడిగె శోభ.. కాంగ్రెస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యపై 54,981 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచింది. కరీంనగర్ జిల్లా నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన తొలి దళిత మహిళా ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు బొడిగె శోభ. అయితే.. 2018లో ఆమెకు టీఆర్‌ఎస్ టికెట్ దక్కలేదు. దీంతో బీజేపీ చేరి... ఆ పార్టీ తరపున పోటీచేశారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా సుంకె రవిశంకర్ కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంపై 42,127 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. రవి శంకర్‌కు 91,090 ఓట్లు రాగా, మేడిపల్లి సత్యంకు 48,963 ఓట్లు వచ్చాయి. బొడిగె శోభకు కేవలం 15,600 ఓట్లు వచ్చాయి. 2023లో ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తరపున రవి శంకర్ బరిలో ఉన్నారు.
మానుకొండూరు నియోజకవర్గం.. ఇది కూడా ఎస్సీ రిజర్వుడ్. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ కైవసం అయ్యింది. రెండు ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రసమయి బాలకిషన్ పోటీ చేసి విజయం సాధించారు. ఇప్పుడు 2023 ఎన్నికల్లోరూ రసమయి బీఆర్‌ఎస్ టికెట్ దక్కించుకుని బరిలో ఉన్నారు. 2014లో టీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్, కాంగ్రెస్ అభ్యర్థి ఆరేపల్లి మోహన్ మధ్య ప్రధానంగా పోటీ జరిగింది. రసమయికి 54.2 శాతం ఓట్లు రాగా, ఆరేపల్లికి 38.088 శాతం ఓట్లు లభించాయి. టీడీపీ అభ్యర్థి కవ్వంపల్లి సత్యానారాయణకు 9.13 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఇక 2018లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా రసమయి బాలకిషన్, కాంగ్రెస్ అభ్యర్థిగా ఆరేపల్లి మోహనే తలపడ్డారు. ఈ పోరులోనూ రసమయి విజయం సాధించారు. రసమయికి 51.47 శాతం ఓట్లు రాగా, ఆరేపల్లికి 33.25 శాతం ఓట్లు లభించాయి.
హుజురాబాద్ నియోజకవర్గం... ఈ నియోజకవర్గ పరిధిలో వీణవంక, జమ్మికుంట, హుజురాబాద్, కమలాపూర్, ఇల్లందుకుంట మండలాలు ఉన్నాయి. 2లక్షల మంది ఓటర్లు ఉన్నారు. నియోజకవర్గం ఏర్పడిన కొత్తలో ఎస్సీ రిజర్వుడుగా ఉండేది. 1967లో జనరల్ సీటుగా మారింది. 2018లో బీఆర్ఎస్ తరపున గెలిచిన ఈటల రాజేందర్... ఆ తర్వాత ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. హుజురాబాద్‌లో జరిగిన ఉపఎన్నికల్లో అధికార బీఆర్ఎస్‌పై గెలిచారు ఈటల రాజేందర్. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటల పోటీచేయగా... ఆయనకు 95,315 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి కేతిరెడ్డి సుదర్శన్ రెడ్డికి 38,278 ఓట్లు దక్కాయి. టీడీపీ తరపున పోటీ చేసిన కశ్యప్ రెడ్డికి 15,642 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ 57,037 వేల మెజార్టీతో గెలిచారు. కేసీఆర్ తొలి కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా ఈటల పనిచేశారు. ఇక... 2018లో ఈటలకు లక్ష ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డికి 61,121 ఓట్లు దక్కాయి. 2,867 ఓట్లు నోటాకు రాగా... నోటా మూడో ప్లేస్ ఉంది. బీజేపీ నుంచి పోటీ చేసిన పుప్పాల రఘుకు కేవలం 1,683 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సమీప ప్రత్యర్థి కౌశిక్ రెడ్డిపై 43,719 ఓట్ల తేడాతో గెలిచారు ఈటల. రెండోసారి కూడా కేసీఆర్ కేబినెట్ లో వైద్యారోగ్యశాఖ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో ఈటల బీఆర్ఎస్‌ను వీడారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2021లో జరిగిన హుజూరాబాద్ ఉపఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన ఈటలకు 1,07,022 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు 83,167 ఓట్లు దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరు వెంకట్‌కు కేవలం 3,014 ఓట్లు రావడంతో డిపాజిట్ కోల్పోయారు. 2021 ఉపఎన్నికలో గెల్లు శ్రీనివాస్‌పై 23,855 ఓట్ల మెజార్టీతో గెలిచారు ఈటల రాజేందర్.