కొమరంభీం జిల్లాను అక్టోబరు 11, 2016న ఏర్పాటు చేశారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజన ఉద్యమకారుడు కొమురం భీం పేరును ఈ జిల్లాకు పెట్లారు. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. కొమరంభీం జిల్లాలో రెండే నియోజకవర్గాలు ఉన్నాయి. అవి ఒకటి ఆసిఫాబాద్, రెండు సిర్పూర్. 2014లో ఆసిఫాబాద్‌లో టీఆర్‌ఎస్ గెలవగా... 2018లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి అత్రం సక్కు గెలిచారు. అలాగే.. 2014 ఎన్నికల్లో సిర్పూరులో బీఎస్పీ గెలవగా.. 2018లో మాత్రం బీఆర్‌ఎస్ విజయం సాధించింది.
అసిఫాబాద్ నియోజకవర్గం ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం అదివాసీ పోరాట యోధుడు కోమురంభీం పుట్టిన పోరుగడ్డ. ఇక్కడి నుండి జల్, జంగల్, జమీన్ యుద్దం సాగించారు. ఈ నియోజకవర్గంలో 11 మండలాలు ఉన్నాయి. 2,06,709మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో అదివాసీలు, లంబడాలు, బీసీలు, ఎస్సీ ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో అదివాసీల ఓట్లే... ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయి. ఆసిఫాబాద్ నుంచి ఎమ్మెల్యేగా అత్రం సక్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 171 ఓట్ల తేడాతో బీఆర్‌ఎస్ అభ్యర్థి కోవలక్ష్మిపై కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే సక్కు విజయం సాధించారు. ఆ తర్వాత మారిన సమీకరణాలతో అత్రం సక్కు కాంగ్రెస్ పార్టీని వీడీ బీఆర్‌ఎస్‌లో చేరారు. కానీ పార్టీ నిర్వహించిన సర్వేలో ఆత్రం సక్కుపై పాజిటివ్ టాక్ రాకపోవడంతో.. ఈసారి ఎన్నికలకు కోవలక్ష్మికి టికెట్ ఇచ్చేసింది బీఆర్‌ఎస్. ఎమ్మెల్యేపై నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత ఉండటం.. తమకు కలిసివస్తాయని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు భావిస్తున్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటును తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నాయి. అయితే బీఆర్‌ఎస్ కోవలక్ష్మికి టికెట్ ఇవ్వడంతో కాంగ్రెస్, బీజేపీకి గట్టి పోటీ ఇస్తున్నట్టే అని చెప్పారు. కాంగ్రెస్ నేతలు సరస్వతి, గణేష్ రాథోడ్.. బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టగా... మరోవైపు బీజేపీ నేత కోట్నాక్ విజయ్ కూడా బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పేట్టు లేదు... మూడు పార్టీల్లో ఆదివాసీలు ఏ పార్టీకి అండగా నిలుస్తాయో చూడాలి.
సిర్పూరు నియోజకవర్గం మహారాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ నియోజకవర్గంలో రాజకీయాలు సిర్పూర్ పేపర్ మిల్స్ చుట్టూ తిరుగుతాయి. ఇక్కడ లక్షన్నర ఓట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఇక్కడ బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప గెలిచారు. 2014 ఎన్నికల్లో కోనేరు కోనప్పకు 49,033 ఓట్లు వచ్చాయి. టీఆర్ఎస్ అభ్యర్థి కావేటి సమ్మయ్య 40,196 ఓట్లుకు మాత్రమే వచ్చాయి. దీంతో 8,837 ఓట్ల మెజార్టీతో కోనప్ప గెలిచారు. అయితే.. 2018 ఎన్నికల్లో.. టీఆర్ఎస్ తరపున పోటీ చేశారు కోనేరు కోనప్ప. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి హరీష్ బాబుపై విజయం సాధించారు. పాల్వాయి హరీష్‌బాబుకు 59,052 ఓట్లురాగా.. కోనేరు కోనప్ప 83,088 ఓట్లు సాధించారు. అంటే 24,036 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు కోనప్ప. అంతేకాదు ఈ నియోజకవర్గం నుంచి అత్యధిక సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. 2023 ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకుని నాలుగోసారి విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నారు కోనప్ప. ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యనే ప్రధాన పోటీ ఉంటుంది.