ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాజకీయాలు కూడా వేగంగా మారుతున్నాయి. సాధారణంగానే ఎన్నికల సమయంలో జరిగే పార్టీ మార్పులు, అసంతృప్తులు అక్కడక్కడా మొదలయ్యాయి కూడా. వచ్చే ఏడాది ఏపీలో జరిగే ఎన్నికల్లో హోరాహోరీ తప్పదన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీతో పాటు ప్రతిపక్షాల్లో ఉన్న నేతలు కూడా సేఫ్ ప్లేస్ కోసం వేట సాగిస్తున్నారు. ఉన్న చోట గెలిచే అవకాశం ఉంటే సరి లేకపోతే పార్టీ ఫిరాయింపులకు రెడీ అవుతున్నారు.
ఈ తరుణంలో హిందూపురం వైసీపీ ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించిన ఎమ్మెల్సీ ఇక్బాల్ టీడీపీలో చేరబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. తాజాగా వైసీపీ అధిష్టానం హిందూపురం ఇన్ ఛార్జ్ బాధ్యతల నుంచి ఆయన్ను తప్పించడంతో ప్రస్తుతం అనంతపురం పార్లమెంట్ పరిధిలో ఇప్పుడు జోరుగా ప్రచారం సాగుతోంధి.
ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ప్రస్థానం
రిటైర్డ్ పోలీస్ అధికారి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఈయన ఐజీగా రిటైర్డ్ అయిన తర్వాత జగన్ మోహన్ రెడ్డి అద్వర్యం లో వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీలోకి చేరినప్పటి నుంచి ఈయనకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పదవి ఇస్తూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ నుంచి నందమూరి బాలకృష్ణ పై పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల అనంతరం ఎమ్మెల్సీగా కొనసాగారు.
ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలతో హిందూపురం ఇన్చార్జ్ బాధ్యతల నుంచి వైసీపీ ప్రభుత్వం ఆయనను తప్పించింది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరో కొత్త ప్రయోగం చేయబోతుందంటూ పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ముస్లిం మైనార్టీ ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిని ఆకట్టుకునేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా అనంతపురం ఎంపీ సీటును వచ్చే ఎన్నికల్లో ముస్లింలకు కేటాయిస్తే బాగుంటుందని ఓ సర్వే నివేదిక ఇచ్చినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఎంపిగా అవకాశం ఇస్తారా???
అయితే అనంతపురం పార్లమెంటుకు ముస్లిం అయినా మహమ్మద్ ఇక్బాల్ ను టికెట్ ఇస్తే ఎలా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం. వైఎస్ఆర్సిపికి సంబంధించి మైనార్టీ లీడర్లు జిల్లాలో చాలామంది ఉన్నారు. తాడపత్రికి చెందిన ఫయాజ్ భాషా పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటారు. పార్టీలో తనకు అవకాశం కల్పించాలని ఫయాజ్ ముఖ్యమంత్రి వద్ద పలుమార్లు విన్నవించుకున్నారు. మరోవైపు ఉర్దూ అకాడమీ చైర్మన్ నవీన్ అహ్మద్ మరికొందరు నాయకులు పార్టీ కోసం పని చేస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. అయితే మహమ్మద్ ఇక్బాల్ ఇప్పటికే రాజకీయంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో బలంగా పాతుకుపోయాడు. దీనికి తోడు అధిష్టానం వద్ద మంచి గుర్తింపు ఉంది. పలు సర్వేల్లో ఇక్బాల్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు ఆ పార్టీ నేతలు అంటున్నారు. అనంతపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఇప్పటిదాకా ముస్లింలు పోటీ చేసిన సందర్భం లేదు.
ఈ ప్రయోగం వల్ల తమకు కలిసి వస్తుందని వైసీపీ నేతలు ఆశిస్తున్నారు. అనంతపురం పార్లమెంటు పరిధిలో సుమారు 60 వేలకుపైగా ముస్లిం ఓట్లు ఉన్నాయి. తాడిపత్రిలో 30 వేలు, గుంతకల్లు 25వేలు, రాయదుర్గంలో 20 వేలు, కళ్యాణ్ దుర్గంలో 18 వేలు, ఉరవకొండలో 19వేలు, సింగనమలలో 10వేలకుపైగా ఓటర్లు ఉండడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముస్లిం ఓటర్లకు అనుకూలంగా ఉండడంతో ముస్లిం అభ్యర్థి ఎంపిక ఎమ్మెల్యేలకు కూడా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు.
మహమ్మద్ ఇక్బాల్ ఈ ప్రతిపాదనను అంగీకరిస్తారా లేక సైలెంట్‌గా ఉంటారా అన్న విషయం తెలియాల్సి ఉంది. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత హిందూపురం ఇన్చార్జిగా, ఎమ్మెల్సీగా కొనసాగారు. ప్రస్తుతం ఇన్చార్జి పదవి నుంచి పార్టీ పక్కన పెట్టడంతో కాస్త మనస్థాపానికి గురైన ఇక్బాల్ పార్టీకి అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది.
ఒకానొక సందర్భంలో రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆలోచన సైతం చేసినట్లు తెలుస్తోంది. మొత్తానికి అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ స్థానాన్ని ముస్లింలకు కేటాయిస్తే దాని ప్రభావం మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గంపై ఉంటుందని అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం అవుతుంది.