ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ సమావేశమైనట్టు సమాచారం. పెండింగ్‌లో ఉన్న అభ్యర్థుల జాబితాతోపాటు ఎన్నికల మేనిఫెస్టో అంశంపై చర్చించారని తెలుస్తోంది. ఇప్పటి వరకు జరుగుతున్న ప్రచారం భవిష్యత్‌లో చేపట్టాల్సిన ప్రచార వ్యూహాలపై మాట్లాడుకున్నారని వినికిడి.  


తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ రాక ముందు నుంచి బీఆర్‌ఎస్ తన రాజకీయ వ్యూహాలకు పదును పెట్టింది. ముందుగానే అభ్యర్థులను ప్రకటించి వారిని నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేసింది. ఐదు నియోజకవర్గాల్లో ఇంకా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ నేపథ్యంలో వీటి ప్రకటన ఆలస్యమవుతోంది. షెడ్యూల్ వచ్చిన వేళ ఆ నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు ముమ్మరం చేసింది. 


ఈ నెల 15 నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రచారం స్టార్ట్ చేయనున్నారు. ఈ లోపే జనగామ, నర్సాపూర్, నాంపల్లి, గోషామహల్, మల్కాజిగిరి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలని బీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో ఎవరిని పోటీలో పెట్టాలనే విషయంపై క్లారిటీ వచ్చినప్పటికి పార్టీలో ఇతర నాయకులను శాంతింప జేస్తున్నారు. ఈ పనిని మంత్రులు కేటీఆర్, హరీష్‌కు అప్పగించారు కేసీఆర్
జనగామ నుంచి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, నర్సూపూర్ నుంచి సునీతా లక్ష్మారెడ్డి, నాంపల్లి నుంచి ఆనంద్‌ గౌడ్‌, గోషామహల్‌ నుంచి గోవింద్ రాటే, మల్కాజిగిరి మర్రి రాజశేఖర్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నాయి. వారిని అభ్యర్థులగా ప్రకటిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది వారికి ప్రత్యర్థులుగా ఉన్న వారిని ఎలా సంతృప్తి పరచాలనే అంశంపై చర్చిస్తోంది పార్టీ అధినాయకత్వం. 


ఇవాళ మంత్రి హరీష్‌రావు, కేటీఆర్‌తో జరిగిన సమావేశంలో వీటిపై ఆరా తీసినట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చేపట్టబోయే ఎన్నికల ప్రచారం రూట్ మ్యాప్‌తోపాటు అక్కడ ఏర్పాట్లు ఇవ్వాల్సిన హామీలపై కూడా చర్చించినట్టు సమాచారం.