తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిర్ణయించారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్‌లో విలీనం అవుతుందని గత కొద్ది రోజులుగా చర్చ నడుస్తోంది. ఇన్నాళ్లు జరిగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో ప్రస్తుతం జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. 


119 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయించిన షర్మిల... బీఫామ్‌ల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పాలేరులో పోటీ చేయాలని తనపై ఒత్తిడి ఉందని తనతోపాటు అనిల్‌, విజయ కూడా పోటీ చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నట్టు షర్మిల తెలిపారు. అవసరం అనుకుంట్ వారు కూడా బరిలో ఉంటారని పేర్కొన్నారు. 


తెలంగాణ రాష్ట్రం బాగు కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరిపినట్టు పేర్కొన్నారు షర్మిల. బీఆర్‌ఎస్‌ను ఓడించాలంటే కలిసి ఉంటే బాగుంటుందని భావించామన్నారు. అందుకే ఓటు చీలిపోకుండా కలిసి పోటీ చేయాలని చర్చలు జరిపినట్టు వివరించారు. అయితే అవి సత్ఫలితాలను ఇవ్వలేదని అందుకే ఒంటరిగానే బరిలోకి దిగబోతున్నట్టు తెలిపారు. కచ్చితంగా భారీ విజయం సాధించి వైఎస్‌ఆర్ పాలన తీసుకొని వస్తారమన్నారు షర్మిల