జగిత్యాల జిల్లా.. అనేక ప్రత్యేకతల కలబోత. రాష్ట్రంలోనే సంపూర్ణ ఆయకట్టు కలిగిన జిల్లాగా గుర్తింపు పొందింది. ఈ జిల్లాలో ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, రామగుండం, మంథని. ఈ ఐదు నియోజకవర్గాల్లో ఈసారి ఆ పార్టీ జెండా ఎగరబోతోంది.
జగిత్యాల నియోజకవర్గం.. ఈ నియోజకవర్గంలో 1,74,856 ఓట్లు ఉన్నాయి. జగిత్యాల నుంచి కాంగ్రెస్ నేత టి.జీవన్‌రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రికార్డు సృష్టించారు. కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని 2018లో టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్) సొంతం చేసుకుంది. 1952 నుంచి 16 సార్లు జరిగిన ఎన్నికల్లో 12 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. టిడిపి మూడు సార్లు, టిఆర్ఎస్ ఒకసారి విజయం సాధించింది. 2014లో టి.జీవన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తెలంగాణ ప్రత్యేక రాష్రంగా ఏర్పడిన తర్వాత ఇవి తొలి ఎన్నికలు. ఆ సమయంలో రాష్ట్ర మంతటా టీఆర్ఎస్ ప్రభావం ఉంది. అయినా... జగిత్యాల ప్రజలు కాంగ్రెస్‌కి పట్టం కట్టారు. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ఎం.సంజయ్ కుమార్‌పై కాంగ్రెస్ అభ్యర్థి 7,828 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. టి.జీవన్‌రెడ్డికి 62,531 ఓట్లు రాగా.. టీఆర్ఎస్ అభ్యర్థి ఎం.సంజయ్ కుమార్‌కు 54,788 ఓట్లు వచ్చాయి. టీడీపీ అభ్యర్థి ఎల్.రమణ 22,385 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. ఇక, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి ఎం.సంజయ్ కుమార్ విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిపై 61,185 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఎం.సంజయ్ కుమార్‌కు 1,04,247 ఓట్లు రాగా... కాంగ్రెస్ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డికి 43,062 ఓట్లు వచ్చాయి. 2023 ఎన్నికల్లో మళ్లీ ఎం.సంజయ్ కుమార్‌కే బీఆర్ఎస్ టిక్కెట్టు ఇచ్చింది. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. అయినా... బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ఇక్కడ పోటీ కనిస్తోంది.
కోరుట్ల నియోజకవర్గం.. ఇది నిజామాబాదు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది. కోరుట్ల నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కోరుట్ల, మెట్‌పల్లి మండలాలు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో 1,86,704 మంది ఓటర్లు ఉన్నారు. 1957 నుంచి రెండు ఉప ఎన్నికలతో సహా మొత్తం 16 సార్లు ఎన్నికలు జరిగాయి. అత్యధికంగా టీఆర్ఎస్ నుంచి కె.విద్యాసాగరరావు వరుసగా నాలుగు సార్లు విజయం సాధించి రికార్డు సృష్టించారు. 2009, 2010 ఉపఎన్నిక, 2014, 2018 ఎన్నికల్లో గెలిచారు. ఈ నియోజకవర్గంలో వెలమ సామాజిక వర్గం తమ పట్టు నిలబెట్టుకుంటూ వస్తోంది. 2014 ఎన్నికల్లో కోరుట్ల నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్‌కు చెందిన కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఇండిపెండెంట్ అభ్యర్థి జువ్వాడి నర్సింగారావుపై 20,585 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. విద్యాసాగర్ రావుకి 58,890 ఓట్లు రాగా.. నర్సింగారావుకి 38,305 ఓట్లు వచ్చాయి. బీజేపీ అభ్యర్థి సురభి భూంరావుకు 35,805 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో కోరుట్ల నుంచి వరుసగా నాలుగోసారి కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు గెలిచారు.. కాంగ్రెస్ అభ్యర్థి జువ్వాడి నరసింగరావుపై 31,220 ఓట్ల మెజార్టీతో విద్యాసాగర్‌రావు విజయం సాధించారు. విద్యాసాగర్ రావుకు 84,605 ఓట్లు రాగా, జువ్వాడి నరసింగరావుకు 53,385 ఓట్లు వచ్చాయి. 2023 ఎన్నికల్లో విద్యాసాగర్‌రావు కుమారుడు కల్వకుంట్ల సంజయ్ బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్నారు.
ధర్మపురి నియోజకవర్గం... ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం. ఇది పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ధర్మపురి నియోజకవర్గంలో ధర్మపురి, గొల్లపల్లి, వెల్గటూరు, పెగడపల్లి, ధర్మారం మండలాలు ఉన్నాయి. ఓటర్లు దాదాపు 2లక్షల వరకు ఉంటారు. 2014, 2018 ఎన్నికల్లో ధర్మపురి నుంచి టీఆర్‌ఎస్ తరపున కొప్పుల ఈశ్వర్ గెలిచారు. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్ మధ్య పోటీ జరిగింది. లక్ష్మణ్ కుమార్‌పై 18,679 ఓట్ల మెజార్టీతో కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. కొప్పుల ఈశ్వర్‌కు 67,836 ఓట్లు రాగా, లక్ష్మణ్ కుమార్‌కు 49,157 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా కొప్పుల ఈశ్వర్ 441 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలిచారు. ఈసారి కూడా కొప్పుల ఈశ్వర్, కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మణ్ కుమార్‌లే ప్రత్యర్థులు. కొప్పుల ఈశ్వర్‌కు 70,579 ఓట్లు రాగా, లక్ష్మణ్ కుమార్‌కు 70,138 ఓట్లు వచ్చాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొప్పుల ఈశ్వర్‌కే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఈసారి కూడా ధర్మపురి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే పోటీ కనిపిస్తోంది.
రామగుండం నియోజకవర్గం... ఇక్కడ 1,59,953 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నియోజకవర్గం కూడా పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ నియోజకవర్గం పరిధిలో రామగుండం, కమాన్‌పూర్ రెండు మండలాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ.. తన ప్రత్యర్థి, ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి అయిన కోరుకంటి చందర్‌పై విజయం సాధించారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన సోమారపు సత్యనారాయణకు 35,789 ఓట్లు రాగా.. కోరుకంటి చందర్‌కు 33,494 ఓట్లు వచ్చాయి. కోరుకంటి చందర్‌పై 2,295 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు సోమారపు సత్యనారాయణ. కాంగ్రెస్ అభ్యర్థి బాబర్ సలీంపాషాకు 16,900 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల్లో.. టిట్ ఫర్ టాట్ అయ్యింది. ఫార్వార్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్.... టీఆర్‌ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణపై 26,090 ఓట్ల మెజార్టీతో గెలిచారు. కోరుకంటి చందర్‌కు 60,444 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు 34,354 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్‌సింగ్ ఠాకూర్‌కు 26,614 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2018 ఎన్నికల తర్వాత కోరుకంటి చందర్ బీఆర్‌ఎస్‌లో చేరారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా కోరుకంటి చందర్ పోటీ చేస్తున్నారు.
మంథని నియోజకవర్గంలో 2,03,387 మంది ఓటర్లు ఉన్నారు. మంథని, కాటారం, మహాదేవ్‌పూర్, ముత్తారం, మల్‌హర్‌రావు మండలాలు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున పుట్టా మధు... కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిల్ల శ్రీధర్‌బాబుపై 19,366 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2014లో పుట్టామధు తొలిసారి అసెంబ్లీలోకి ప్రవేశించారు. పుట్టమధుకు 84,037 ఓట్లు రాగా... శ్రీధర్‌బాబుకు 64,677 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు, బీజెపీ అభ్యర్థి రేండ్ల సనత్‌కుమార్, కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పోటీ చేశారు. శ్రీధర్‌బాబు.. టీఆర్ఎస్ పుట్ట మధుపై 16,230 ఓట్ల మెజార్టీతో గెలిచారు. శ్రీధర్ బాబుకు 89,045 ఓట్లు, పుట్ట మధుకు 72,815 ఓట్లు వచ్చాయి. 2023లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా పుట్ట మధూకర్ బరిలో ఉన్నారు.