Ex MP Vivek Gave Loan To CM KCR: మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి (Vivek Venkataswamy)... ఇటీవలే బీజేపీ (BJP)ని వదిలి కాంగ్రెస్ (Congress)లో చేరారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు(Chennoor) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌కు ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో ఆయన ఆస్తులు, అప్పులకు సంబంధించి ఆసక్తికర అంశాలు వెలుగుచూశారు. తనకు దాదాపు 606 కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు వివేక్ వెంకటస్వామి. అంతేకాదు... ఆయన ముఖ్యమంత్రితోపాటు... పలువురు రాజకీయ నేతలకు అప్పులు ఇచ్చినట్టు కూడా అఫిడవిట్‌లో చూపించారు.
సీఎం కేసీఆర్ (CM KCR) కు కోటి రూపాయల అప్పు ఇచ్చినట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు మాజీ ఎంపీ వివేక్. ముఖ్యమంత్రికే కాదు.. కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(KomatiReddy Rajagopal Reddy)కి ఒకటిన్నర కోట్ల రూపాయలు అప్పుగా ఇచ్చినట్టు వెల్లడించారు. వీటితోపాటు దాదాపు 24 కోట్ల రూపాయలను వ్యక్తిగత అప్పులు ఇచ్చినట్టుగా చూపించారు వివేక్.
మాజీ ఎంపీ వివేక్ వెంకస్వామి అఫిడవిట్‌లో ఇంకా చాలా ఆసక్తికరమైన అంశాలు బయటపడ్డారు. వివేక్ మొత్తం ఆస్తులు 600 కోట్లుకుపైగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో పోటీపడుతున్న అన్నీ పార్టీల అభ్యర్ధుల కంటే వివేక్ వెంకస్వామి ఆస్తులే అత్యధికం. దీంతో... ఆయన అత్యంత ధనవంతుడైన అభ్యర్థిగా నిలిచారు. వివేక్ చరాస్తులు 329 కోట్లు కాగా... వీటిలో వ్యాపార సంస్థలు, కార్లు, బంగ్లాలు, నగలు, బ్యాంక్ డిపాజిట్‌లు ఉన్నాయి. ఇక.. వివేక్ వెంకటస్వామి భార్య సరోజ పేరుతో మరో 52 కోట్లు విలువ చేసే ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. విశాఖ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వ్యవస్థాపకుడిగా, చైర్మన్‌గా... ఆ సంస్థలో రూ.285 కోట్ల విలువచేసే షేర్లు ఆయనకు ఉన్నాయి. అలాగే... ఆయన సతీమణి సరోజ ఆ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. ఆమెకు కూడా రూ.44.90 కోట్ల విలువచేసే షేర్లు ఉన్నాయి. 2014లో పెద్దపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేసిన సమయంలో వివేక్ చూపించిన ఆస్తులతో పోలిస్తే.. ఇప్పుడు ఆయన ఆస్తులు 127 శాతం పెరిగినట్టు తెలుస్తోంది.
ధనవంతులైన అభ్యర్థుల జాబితాలో వివేక్ తర్వాత స్థానంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉన్నారు. పాలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఆయన ఆస్తుల విలువ రూ.460కోట్లు. అయితే... గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఆస్తులు మాత్రం కేవలం రూ.59 కోట్లు. కేసీఆర్‌కు సొంత కారు కూడా లేదని ఆఫిడవిట్‌లో పేర్కొన్నారు. అంతేకాదు... మాజీ ఎంపీ వివేక్‌కు రూ.1.06కోట్లు అప్పుగా తీసుకున్నట్టు తన అఫిడవిట్‌లోనూ స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
మాజీ ఎంపీ వివేక్... సీఎం కేసీఆర్ అప్పు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు మాజీ ఎంపీ వివేక్, సీఎం కేసీఆర్‌కు మధ్య లావాదేవీలు జరిగినట్లు బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి. వివేక్ దగ్గర కేసీఆర్ అప్పు తీసుకున్నారని బయటకు రావడంతో... కేసీఆర్‌కు, మాజీ ఎంపీ వివేక్‌కు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది.