మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. కుమారుడితో పాటు మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మల్కాజ్ గిరి అసెంబ్లీ సీటుతో పాటు మెదక్ అసెంబ్లీ సీటును ఆశించారు. బీఆర్ఎస్ రెండు సీట్లు ఇవ్వకుండా, మైనంపల్లికి మల్కాజ్ గిరి సీటును మాత్రమే కేటాయించడంతో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్ గిరి అభ్యర్థి కోసం కసరత్తు చేస్తోంది.
మైనంపల్లి రాజీనామా ప్రకటనతో మర్రి రాజశేఖర్ రెడ్డికి మల్కాజ్ గిరి సీటు లైన్ క్లియర్ అయినట్లుగా సమాచారం. బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజిగిరి నుంచి పోటీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మైనంపల్లి వంటి శక్తివంతమైన నాయకుడిని ఎదుర్కోవాలంటే అదే స్థాయిలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నాయకుడు అవసరం ఉందని బీఆర్ఎస్ భావిస్తోంది. మర్రి రాజశేఖర్ రెడ్డి గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి మల్లారెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో మైనంపల్లికి మర్రి రాజశేఖర్ రెడ్డి సరైన అభ్యర్థి అని డిసైడ్ అయినట్లు సమాచారం.
మల్కాజ్ గిరి నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డి పోటీలో నిలిస్తే అనేక అంశాలు కలిసి వస్తాయని బీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాలలో మల్కాజిగిరి నియోజకవర్గం కూడా ఒకటి. రాజశేఖర్ రెడ్డి కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలో పేరుపొందిన కళాశాలలు నడిపిస్తున్నారు. తల్లి పేరిట "అరుంధతి" హాస్పిటల్ పేరిట ఉచితంగా పేదలకు వైద్య సహాయం అందిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేయడానికి అన్ని కోణాల్లో సరైన వ్యక్తి మర్రి రాజశేఖర్ రెడ్డేనని నేతలు అభిప్రాయపడుతున్నారు. మంత్రి మల్లారెడ్డి కూడా అల్లుడికి సీటు ఇప్పించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా అల్లుడ్ని గెలిపించుకోవాలని మల్లారెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు.
బీఆర్ఎస్ లో మరో సీనియర్ నేత శంభీపూర్ రాజు సైతం మల్కాజ్ గిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవం ఉండటం, ఆర్థికంగా బలవంతుడు కావడంతో ఆయన పేరును బీఆర్ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. శంభీపూర్ రాజుకు...ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ వద్ద మంచి పేరు వస్తుంది. ఇదే తనకు కలిసి వస్తుందని ఆయన భావిస్తున్నారు. అసెంబ్లీ సీట కేటాయిస్తే గెలుస్తానని పార్టీ నేతలకు చెబుతున్నట్లు సమాచారం.
మరోవైపు ఇదే అసెంబ్లీ సీటును కుమారుడు సాయికిరణ్ కోసం మంత్రి తలసాని శ్రీనివాస్ జోరుగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ను కలిసి...మల్కాజ్ గిరి సీటు కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది. ఎంపీ సీటు కాకుండా అసెంబ్లీ టికెట్ కేటాయించాలని పదే పదే ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. మైనంపల్లి హనుమంతరావు రెండు సీట్లు డిమాండ్ చేసినా, కేసీఆర్ పట్టించుకోలేదు. దీంతో ఆయన పార్టీని వీడారు. ఈ నేపథ్యంలో తలసాని కుమారుడికి టికెట్ ఇస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.