Telangana Assembly Elections 2023 :
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కాంగ్రెస్ ఆశావహుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఈ నెల మొదటి వారంలో తొలి జాబితా విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ... అనుకోని పరిస్థితులతో వాయిదా పడినట్లు తెలుస్తోంది. కేంద్రం ఎన్నికల సంఘం అధికారులు ఇప్పటికే తెలంగాణలో పర్యటిస్తున్నారు. రాజకీయ పార్టీలు, జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించింది. ఎన్నికల సన్నద్దతపై పలు సూచనలు చేసింది.
త్వరలోనే ఎన్నికల షెడ్యూల్
ఎన్నికల షెడ్యూలు ఎప్పుడైనా రావచ్చని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ తేదీ ఖరారైతే...అదే రోజుగానీ మరుసటి రోజు మొదటి జాబితా ప్రకటన ఉంటుందని పీసీసీ భావిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన ఉంటుందని అంచనా వేసినప్పటికీ అది సాధ్యమయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈ వారంలో అభ్యర్థుల జాబితా విడుదల అవుతుందనుకున్నా పరిస్థితులు అలా కనిపించడం లేదు. 30 నియోజకవర్గాలకు ఒకే దరఖాస్తు రావడంతో వీరి అభ్యర్థిత్వానికి హైకమాండ్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరో నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాబితా కొలిక్కి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరో 30 నియోజకవర్గాల్లో టికెట్ల కోసం గట్టి పోటీ ఉండడంతో మరొకసారి సర్వేలు నిర్వహించాలని స్క్రీనింగ్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 7వ తేదీన పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతుందని అంచనా వేసినా, అది వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈ నెల రెండో వారంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై తెలంగాణతో పాటు మిగిలిన రాష్ట్రాలకు అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకుంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర ఎన్నికల కమిటీ తేదీ ఖరారైన వెంటనే, స్క్రీనింగ్ కమిటీ సమావేశమై మొదటి జాబితాకు దాదాపు 70 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
27 నియోజకవర్గాలల్లో సర్వేలు
సూర్యాపేట, జనగామ, ఖైరతాబాద్, ఎల్బీనగర్, జూబ్లీహిల్స్, మిర్యాలగూడ, భువనగిరి తదితర 27 నియోజకవర్గాలల్లో సర్వేలు జరిగినట్లు సమాచారం. గెలుపే లక్ష్యంగా పారదర్శకంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఆలస్యం కావడం పార్టీ గెలుపుపై ఆ ప్రభావంతీవ్రంగా చూపినట్లు రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తుంది. అలాంటప్పుడు ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన చేయాలని భావిస్తున్నప్పటికీ అవకాశాలు కనిపించడం లేదని కాంగ్రెస్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికల షెడ్యూలు తేదీ ఆలస్యం అయ్యేటట్లయితే షెడ్యూల్ కన్నా ముందే మొదటి జాబితా విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ప్రత్యర్థులను ఇరుకున పెట్టేలా కేసీఆర్ వ్యూహాలు
గులాబీ బాస్ కేసీఆర్ ఒకే సారి 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించేశారు. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారం మునిగిపోయారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను వివరిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ నోటిఫికేషన్ విడుదలకు ముందే కొత్త కొత్త అస్త్రాలతో ప్రతిపక్షాలను ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు మరిన్ని కొత్త పథకాలను ప్రకటిస్తారని, ప్రతిపక్షాలకు మైండ్ బ్లాంక్ అవడం గ్యారెంటీ అంటూ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే ప్రకటించేశారు. ఇలాంటి సమయంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ప్రకటన ఆలస్యం అవుతుండటంతో నేతల్లో ఊపిరి తీసుకోలేకపోతున్నారు. తమ సీటు వస్తుందా రాదా ? అన్న టెన్షన్ లో మునిగిపోయారు.