కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో రెండో జాబితాను ప్రకటించింది. ఇందులో పాత కొత్త నేతలకు సీట్లు కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో మొదలైన అసంతృప్తుల లొల్లి షురూ అయింది. అందరూ ఊహించినట్లే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మునుగోడు టికెట్ దక్కింది. ఎల్బీ నగర్ టికెట్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ రెడ్డికి కేటాయించింది. పలువురు నేతలు హస్తం పార్టీ తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. కొందరికి టికెట్ దక్కగా, మరికొందరికి నిరాశే ఎదురైంది.  నిజామాబాద్ రూరల్ నుంచి హీరో నితిన్ మామ నగేష్ పోటీ చేయాలని భావించారు. కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. అయితే నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ సీటును మాజీ ఎమ్మెల్సీ భూపతిరెడ్డికి కేటాయించింది. మామ నగేశ్ రెడ్డి టికెట్ కోసం నితిన్ కూడా శతవిధాలా ప్రయత్నించారు. ఆయనకు నిరాశే ఎదురైంది. దీంతో నగేష్ రెడ్డి ఇవాళ కార్యకర్తలతో సమావేశం అయి, భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు.


జడ్చర్ల అసెంబ్లీ టికెట్ ను మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ ప్రయత్నించారు. ఒకానొక సమయంలో టికెట్ ఆయనకే అన్న ప్రచారం చేసుకున్నారు. జడ్చర్ల ఇవ్వకపోయినా నారాయణపేట అసెంబ్లీ సీటు వస్తుందని ఎర్ర శేఖర్ భావించారు. రెండింట్లో ఆయనకు నిరాశే ఎదురైంది. జడ్చర్ల టికెట్ ను అనిరుధ్ రెడ్డికి కేటాయించింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పై రగిలిపోతున్న ఎర్ర శేఖర్, ఇవాళ పార్టీ కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోనున్నారు. మునుగోడు టికెట్ కోసం పాల్వాయి స్రవంతి తీవ్రంగా ప్రయత్నించారు. అయితే రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరడంతో ఆయనకే టికెట్ ఇచ్చింది.


ఇటీవలే పార్టీలో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి...మునుగోడు సీటును కేటాయించింది కాంగ్రెస్. మహబూబ్ నగర్ నుంచి యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేరు ఖరారైంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన బండి రమేశ్ కు కూకట్ పల్లి సీటును ఖరారు చేసింది. వరంగల్ పశ్చిమ టికెట్ విషయంలో జంగా రాఘవరెడ్డి చివరి వరకు ప్రయత్నించినప్పటికీ…నాయిని రాజేందర్ రెడ్డికే టికెట్ దక్కింది. హుజురాబాద్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన ఒడితెల ప్రణవ్ కు ఖరారైంది.మహేశ్వరం నుంచి అనూహ్యంగా కిచ్చెన లక్ష్మారెడ్డి పేరును ప్రకటించింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి పాలేరు స్థానాలను కేటాయించింది. ఈ మధ్యనే పార్టీలోకి వచ్చిన రేవూరి ప్రకాశ్ రెడ్డికి పరకాల సీటు ఖరారైంది.


జూబ్లీహిల్స్ అసెంబ్లీ టికెట్ ను విష్ణువర్ధన్ రెడ్డి ఆశించారు. అయితే ఈ టికెట్ అజారుద్దీన్ కు కేటాయించింది కాంగ్రెస్. ముస్లిం ఓటర్లు అధికంగా ఉండటంతో ఈ స్థానం నుంచి అజరుద్దీన్ బరిలోకి దించింది. దీంతో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్, నేడు తన అనుచరులతో భేటీ కానున్నారు. విష్ణువర్ధన్ రెడ్డి పార్టీ మారనున్నట్లు తెలుస్తోంది. ఇబ్రహీం పట్నం టికెట్ దక్కకపోవడంతో దండెం రాంరెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. మహేశ్వరం టికెట్ లక్ష్మారెడ్డికి ఇవ్వడంపై పారిజాత నర్సిహా రెడ్డి అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ లిస్ట్ కారణంగా ముసలం స్టార్ట్ అయింది. మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంతో నేడు ఆయన ముఖ్య అనుచరులతో భేటీ కానున్నారు. మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇవ్వడంపై చలమల కృష్ణారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. నేడు చౌటుప్పల్ లో అనుచరులతో కృష్ణారెడ్డి భేటీ కానున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎల్లారెడ్డి టికెట్ ప్రకటనపై వడ్డేపల్లి అసంతృప్తిగా ఉన్నారు. నేడు కార్యకర్తలతో వడ్డేపల్లి సుభాష్ భేటీ కానున్నారు. కాంగ్రెస్ పార్టీకి సుభాష్ రెడ్డి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.