తెలంగాణ ఎన్నికల్లో గెలుపొందడమే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఎత్తులు వేస్తోంది. నోటిఫికేషన్ విడుదల కాకముందే దూకుడుగా వ్యవహరిస్తున్న గులాబీ పార్టీ...నోటిఫికేషన్ వచ్చాక జెట్ స్పీడ్ తో ప్రచారం చేసేందుకు రెడీ అవుతోంది. గులాబీ బాస్, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ విరామం లేకుండా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. ఏ జిల్లాకు వెళ్లినా, ఏ మండలానికి వెళ్లినా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్ స్ట్రాటజీ మార్చేసింది. కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ కీలక నేతలంతా హస్తం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టేలా కామెంట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు, మున్సిపల్ మంత్రి కేటీఆర్, ఇతరం నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీనే లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణ సరిహద్దుల్లో కర్ణాటక రైతుల ఆందోళన
కర్ణాటక తరహాలోనూ తెలంగాణ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను ఇచ్చింది. తుక్కుగూడలో జరిగిన బహిరంగసభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, ఆరు హామీలను ప్రకటించారు. ఆరు గ్యారెంటీలపై బీఆర్ఎస్ నేతలు ఎదురుదాడి ప్రారంభించారు. దేశంలో ఎక్కడ 24 గంటల ఇవ్వడం లేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే 24గంటల కరెంటును రైతులుకు ఇస్తున్నామని పదే పదే ప్రకటిస్తున్నారు. బహిరంగ సభలు, ప్రెస్ మీట్లలోనూ కాంగ్రెస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు. కరెంట్ రైతులకు నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పి...మాట తప్పారని విమర్శిస్తున్నారు. ఆఖరికి రైతులంతా కలిసి కరెంట్ కోసం రోడ్లెక్కిఆందోళనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు రైతులు సబ్ స్టేషన్ల దగ్గరకు వచ్చి మొసళ్లు వదులుతున్నారని ప్రజలకు చెబుతున్నారు. కర్ణాటకలోనే హామీలు అమలు చేయలేని కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ఎలా అమలు చేస్తుందని బీఆర్ఎస్ నేతలు ఎదురు దాడి ప్రారంభించారు. బీఆర్ఎస్ నేతల విమర్శలతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దుల్లోనూ కొందరు రైతులు, హస్తం పార్టీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేయడం బీఆర్ఎస్ పార్టీకి బూస్ట్ ఇచ్చినట్లయింది.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ప్రతీ నెలా రూ.2,500 నగదు, పేద మహిళలకు కేవలం ₹500కే వంట గ్యాస్ సిలిండర్ కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించింది. రైతు భరోసా కింద ప్రతిఏటా రైతులతో సహా కౌలు రైతుకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలు, భూమిలేని నిరుపేదలకు ఏడాదికి రూ.12 వేలు ఇస్తామని చెప్పింది. వరికి మద్దతు ధరతో పాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని తెలిపింది. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింది ఇల్లు లేని వారికి ఇంటి స్థలంతో పాటు నిర్మాణానికి రూ.5 లక్షలు, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇస్తామని చెప్పింది. గృహజ్యోతి పథకం కింద పథకం కింద పేదల ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనుంది. చేయూత పథకం కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.10 లక్షల ఆరోగ్య బీమా, చేయూత కింద నెలకు రూ.4 వేల పింఛన్ ఇస్తామని ప్రకటించింది కాంగ్రెస్. యువ వికాసం కింద కళాశాల విద్యార్థుల కోచింగ్ ఫీజు కోసం రూ.5 లక్షల వరకు సాయం అందిస్తామని, ఇచ్చిన హామీలన్నీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని చెప్పింది.