Telangana Election 2023 : రాజకీయాల్లో  సామాజిక సమీకరణాలు కీలకం. ఈ విషయంలో బీఆర్ఎస్ లెక్క తప్పినట్లుగా కనిపిస్తోంది.తెలంగాణలో బలమైన బీసీ వర్గంగా ఉన్న  ముదిరాజ్ వర్గానికి ఒక్క టిక్కెట్ కూడా కేటాయించకపోవడంతో ఆ వర్గం మొత్తం ఏకం అయింది. దీంతో ముదిరాజ్‌లను సంతృప్తి పరిచేందుకు బీఆర్ఎస్ ఆ వర్గానికి చెందిన ప్రముఖులకు తిరస్కరించలేని ఆఫర్లు ఇస్తూ పార్టీలోకి తీసుకుంటోంది. కానీ ఎంత మందిని పార్టీలో చేర్చుకున్నా టిక్కెట్ ఇవ్వకపోవడం అనేది ఆ వర్గాన్ని అసంతృప్తికి గురి చేసిందన్న అభిప్రాయం మాత్రం గట్టిగా వినిపిస్తోంది. 


ముదిరాజ్‌ల వర్షం రాజకయంగా క్రియాశీలకం


తెలంగాణ బీసీ వర్గాల్లో ముదిరాజుల వర్గం ప్రభావవంతమనది.  బీసీ వర్గాల్లో ముదిరాజుల ఓట్లు కనీసం యాభై లక్షలు ఉంటాయని అంచనా. అంటే వీరిని ఏ మాత్రం తేలికగా తీసేసేందుకు ఏ రాజకీయ పార్టీలూ సిద్ధంగా ఉండవు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఆ వర్గానికి ప్రతినిధిగా ఉన్నారు. ఆయను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ వర్గం ఓట్లు దూరమవకుండా ఉండేందుకు కేసీఆర్ చాలా ప్రయత్నాలు చేశారు.   రాజ్యసభ సభ్యుడిగా ఉన్న బండా ప్రకాష్ ను రాజీనామా చేయించి.. ఎమ్మెల్సీని చేశారు. ఆయనను మంత్రిని చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ మంత్రి వర్గంలో మార్పు చేర్పులు చేయకపోవడంతో చాన్స్ రాలేదు.  


నీలం మధుకు టిక్కెట్ నిరాకరించడంతో అసలు రచ్చ 


సంగారెడ్డి  జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంలో నీలం మధు ముదిరాజ్ అనే నేతను బీఆర్ఎస్ హైకమాండ్ ప్రోత్సహించింది.  ఆయన బలంగా కార్యక్రమాలు నిర్వహించారు. నియోజకవర్గం వ్యాప్తంగా అనుచరుల్ని ఏర్పాటు చేసుకున్నారు. పదేళ్ల పాటు ఎమ్మెల్యేగా ఉన్న మహిపాల్ రెడ్డి పై అసంతృప్తి ఉందని.. ఈ సారి బీసీలకు కేటాయిస్తారని అనుకున్నారు.  కానీ కేసీఆర్ ఆలోచించారో కానీ నీలం మధుకు టిక్కెట్ కేటాయించలేదు.   నీలం మధు పట్టు విడవకుండా.. బుజ్జగింపులకు లొంగకుండా పోటీకి సిద్ధమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ముదిరాజ్ వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చారు. బహిరంగసభ నిర్వహించారు. ఇది బీఆర్ఎస్ నేతలకు ఇబ్బందికరంగా మారింది. వెంటనే ఆపరేషన్ ముదిరాజ్ ప్రారంభించారు.  దిద్దుబాటు చర్యలకు బీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. తిరస్కరించలేని ఆఫర్లు ఇచ్చి ముదిరాజ్ వర్గంలో పేరున్న వారిని పార్టీలో చేర్చుకుంటోంది. 


బీఆర్ఎస్‌లో పలువురు ముదిరాజ్ నేతల చేరిక ! 


రెండేళ్ల సర్వీసు ఉన్నప్పటికీ రాజీనామా చేయించి ఉద్యోగ సంఘం నేత మామిళ్ల రాజేందర్ ను ముదిరాజ్ అన్న కారణంగానే పార్టీలో చేర్చుకున్నారు. తాజాగా బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్ ను కూడా పిలిచి ఆఫర్ ఇచ్చి కండువా కప్పుకోబోతున్నారు. ముదిరాజ్‌ల బహిరంగసభలో బిత్తిరి సత్తి ప్రసంగం సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆయనకే కండువా కప్పేస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడంపై ఊగిసలాడుతున్న  టీ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ కూడా బీఆర్ఎస్ నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్లుగా చెబుతున్నారు. 
  
కీలక నియోజకవర్గాల్లో ముదిరాజ్‌ల ఓట్లు ఎక్కువ ! 


బీఆర్ఎస్‌పై ముదిరాజుల అసంతృప్తిని గుర్తించి నీలం మధును కాంగ్రెస్‌లో చేర్చుకున్నారు. ఆయనకు పటాన్ చెరు టిక్కెట్ ఆఫర్ చేసే అవకాశం ఉంది.   ముదిరాజ్‌ సామాజిక తరగతి ఓట్లు గజ్వేల్‌లో 60 వేలు, సిద్ధిపేటలో 45 వేలు, సిరిసిల్లలో 40 వేలు, కామారెడ్డిలో 30 వేల దాకా ఉన్నాయి. ఇవి ఇప్పుడు కీలకంగా మారనున్నాయి. ఈ అంశాన్ని బీఆర్‌ఎస్‌ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. ముదిరాజ్‌ల ఓట్లతోపాటు గజ్వేల్‌లో బీజేపీ నుంచి పోటీ చేయబోతున్న ఈటల రాజేందర్‌ రూపంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వ్యూహాలు పన్నుతోంది. పోటీగా ఆ వర్గం మొత్తాన్ని ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.