కాంగ్రెస్‌ పార్టీ సీనియర్లతో పాటు కొత్త వారిని బరిలోకి దించింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో గజ్వేల్‌లో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కాంగ్రెస్ అభ్యర్థి తూముకుంట నర్సారెడ్డి ఢీ కొట్టబోతున్నారు. ఆందోల్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, అధికార పార్టీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌ మరోసారి బరిలోకి దిగారు. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత రెండు సార్లు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్‌ పార్టీదే విజయం. గత రెండు ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను పరాజయమే పలకరించింది. 


పద్మా దేవేందర్ ను హ్యాట్రిక్ ఖాయమేనా ?
మెదక్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నుంచి మైనంపల్లి రోహిత్‌ రావు, బీఆర్ఎస్ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పోటీ పడుతున్నారు. 2014,2018 ఎన్నికల్లో పద్మా దేవేందర్ రెడ్డి గెలుపొందారు. ముచ్చటగా మూడోసారి గెలవాలని చూస్తుంతే రోహిత్ రావు చెక్ పెట్టాలని చూస్తున్నారు. సంగారెడ్డిలో కాంగ్రెస్‌ నుంచి జగ్గారెడ్డి, బీఆర్‌ఎస్‌ తరపున చింతా ప్రభాకర్ బరిలోకి దిగారు. 2004, 2009, 2018 ఎన్నికల్లో జగ్గారెడ్డి గెలుపొందితే...2014లో చింతా ప్రభాకర్‌ గెలిచారు. వీరిద్దరు ముచ్చటగా మూడోసారి తలపడుతున్నారు. జహీరాబాద్‌లో ఆగం చంద్రశేఖర్‌ కాంగ్రెస్‌ నుంచి, మాణిక్‌ రావ్ గులాబీ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. 


కొడంగల్ లో రేవంత్ రెడ్డి వర్సెస్ పట్నం 
ఉమ్మడి  మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్‌ పార్టీ. కొడంగల్‌లో ఎంపీ రేవంత్‌ రెడ్డి, సిట్టింగ్‌ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఢీ కొట్టబోతున్నారు. గత ఎన్నికల్లో రేవంత్‌ రెడ్డి ఓటమి పాలయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున గెలుపొందారు. 2018లో ఓటమి పాలుకావడంతో మల్కాజ్‌గిరి నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. గద్వాలలో కాంగ్రెస్‌ నుంచి సరితా తిరుపతయ్య, బీఆర్ఎస్‌ నుంచి కృష్ణమోహన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. అలంపూర్‌లో కాంగ్రెస్‌ నుంచి సంపత్‌ కుమార్‌, బీఆర్ఎస్‌ నుంచి అబ్రహం బరిలో దిగుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి అబ్రహం రెండు సార్లు గెలుపొందారు. మూడోసారి ఆయనే పోటీ చేస్తున్నారు. 


టీడీపీ కంచుకోటలో బీఆర్ఎస్ పాగా
నాగర్‌కర్నూల్‌ స్థానంలో కాంగ్రెస్‌ నుంచి కూచుకల్ల రాజేశ్‌ రెడ్డి, బీఆర్ఎస్ తరపున జనార్దన్ రెడ్డి తలపడుతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో మర్రి రాజశేఖర్‌ రెడ్డి గెలుపొందారు. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న నాగర్‌కర్నూల్‌ను బీఆర్ఎస్‌ కంచుకోటగా మార్చేశారు. అచ్చంపేట్‌లో కాంగ్రెస్ తరపున సీహెచ్‌ వంశీకృష్ణ, అధికార పార్టీ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఢీ కొట్టబోతున్నారు. గువ్వల బాలరాజు ఇప్పటికే రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడోసారి బరిలోకి దిగారు. 


కల్వకుర్తి నియోజకవర్గంలో హస్తం పార్టీ నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డి, గులాబీ పార్టీ నుంచి జైపాల్ యాదవ్ పోటీ పడుతున్నారు. జైపాల్ యాదవ్ 1999, 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున గెలుపొందారు. 2018లో బీఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. షాద్‌ నగర్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ తరపున శంకరయ్య, బీఆర్ఎస్‌ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే అంజయ్య పోటీ చేస్తున్నారు. 2014, 2018 ఎన్నికల్లో అంజయ్య గెలుపొందారు. కొల్లాపూర్‌ నియోజకవర్గంలో హస్తం పార్టీ నుంచి జూపల్లి కృష్ణారావు, బీఆర్ఎస్ తరపున సిట్టింగ్‌ ఎమ్మెల్యే హర్షవర్దన్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. 1999, 2004, 2009, 2012, 2014 ఎన్నికల్లో జూపల్లి కృష్ణారావు గెలుపొందారు. వైఎస్‌ కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు.