Pulivendula ZPTC by-election: పులివెందుల జడ్పీటీసీలో టీడీపీ పాగా వేసింది. రెండు రోజుల క్రితం జరిగిన ఉపఎన్నికల్లో విజయం సాధించింది. ఏడు వేలకుపైగా ఓట్లు పోలైతే టీడీపీ అభ్యర్థి లతారెడ్డికి భారీగా ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. 


అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్ని ఫలితాలు వచ్చాయి. ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యింది. ఇందులో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. మొత్తం 7614 ఓట్లు పోలైతే... అందులో 6735 ఓట్లు టీడీపీ అభ్యర్థి లతారెడ్డికే వచ్చాయి. వైసీపీ అభ్యర్థి హేమంత్‌రెడ్డికి 685 ఓట్లు మాత్రమే పడ్డాయి. దీంతో ఆయన డిపాజిట్ కోల్పోయాయి. లతారెడ్డి 6వేలకుపైగా మెజార్టీతో విజయం సాధించారు.  


పేరుకే పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక. కానీ అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా వైసీపీ, టీడీపీ వ్యూహాలతో రాజకీయాన్ని వేడెక్కించాయి. పార్టీలు మారడాలు, డబ్బుల పంపిణీ, కొట్లాటలు ఇలా చాలా సీన్‌లు ఈ ఎన్నికల్లో కనిపించాయి. అందుకే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఈ ఎన్నికలపై యావత్ రాష్ట్రం ఆసక్తిగా గమనించింది. పోలింగ్ రోజు అయితే రణరంగాన్నే తలపించాయి పరిస్థితులు. టీడీపీతో కుమ్మక్కైన అధికారులు ఓటర్లను బెదిరించి రిగ్గింగ్‌కు పాల్పడినట్టు వైసీపీ ఆరోపిస్తూ వచ్చింది. అధికార పార్టీ గెలవచ్చేమో కానీ ప్రజాస్వామ్యం ఓడిపోయిందంటూ ఎద్దేవా చేసింది. దానికి టీడీపీ నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్‌లు పడ్డాయి. 


ఇలా ఇరువైపుల నుంచి పరిస్థితి హాట్ హాట్‌గా ఉన్నటైంలోనే ఇవాళ ఉదయం నుంచి కౌంటింగ్‌  ప్రారంభమైంది. కడప శివారులో ఉన్న ఉర్దూనేషనల్ యూనివర్శిటీలో అధికారులు లెక్కింపు చేపట్టారు. ముందు అభ్యర్థులు, ఏజెంట్లు సమక్షంలో బ్యాలెట్‌ పత్రాలను కట్టలుగా కట్టారు. అనంతరం లెక్కింపు చేపట్టారు. ఇందులో టీడీపీ అభ్యర్థి విజయం సాధించినట్టు అధికారులు ప్రకటించారు. 


ఈ విజయంతో పులివెందులలో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి జై టీడీపీ అంటూ నినాదాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన నేతలు జగన్ మోహన్ రెడ్డి మారాల్సిన టైం వచ్చిందని అన్నారు. అనవసరమైన ఆరోపణలు చేయడం మాని వాస్తవాలు తెలుసుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందే పులివెందులకు స్వేచ్ఛ వచ్చిందని అభిప్రాయపడ్డారు. నలభై ఏళ్లుగా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోలింగ్ జరగకుండా అడ్డుకుంటా వచ్చారని ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో ఆ కోపాన్ని ప్రజలు చూపించారన్నారు. 


పులివెందులలో విజయం గెలుపే కాదని దొంగఓట్లతో గెలిచారని ఆరోపిస్తోంది వైసీపీ. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని విమర్శిస్తోంది. ఒక్కొక్కరితో కనీసం ఇరవై నుంచి ముఫ్పై ఓట్లు వేశామని చెబుతున్నారని ఓ ఫోన్ ఆడియోను తన సోషల్ మీడియా హ్యాండిల్‌లో పెట్టింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే ఈ దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు,టీడీపీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించింది.  


అధికారులు కూడా టీడీపీతో కుమ్మక్కై రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, నిజమైన ఓటర్ల వద్ద స్లిప్‌లు లాక్కొని ఓట్లు వేశారని ఆరోపించింది.ఇదీ ఓ గెలుపేనా అంటూ ఎద్దేవా చేస్తోంది. గెలుపుపై అంత ధీమా ఉంటే కేంద్ర బలగాల సహాయంతో మరోసారి పోలింగ్ పెట్టాలని బుధవారం జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.