Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు త్వరలోనే నోటిఫికేషన్ రానున్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆయా పార్టీలు అభ్యర్థుల వేట మొదలుపెట్టాయి. ఆశావాహులు సైతం పార్టీ పెద్దలను కలిసి, తమకు బీ-ఫారం ఇస్తే గెలుచుకుని వస్తామని చెబుతున్నారు. అయితే, ఈ ఉపఎన్నిక విషయంలో తెలంగాణలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ ఒక్క గెలుపు తమ పార్టీ భవిష్యత్తును నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాయి.
పార్టీలతో పాటు పార్టీ కీలక నేతలు ఈ గెలుపును తమ సత్తా చాటేందుకు ముఖ్యమైనదిగా అంచనా వేస్తున్నారు. అయితే, ఈ మూడు పార్టీలకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఒక జీవన్మరణ సమస్యగా ఉండనుందని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. ఈ మూడు పార్టీలకు ఈ ఉపఎన్నికలో గెలుపు ద్వారా సాధించే రాజకీయ లక్ష్యాలు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డికి గెలుపు కీలకం
తెలంగాణ వచ్చాక జూబ్లీహిల్స్ బీఆర్ఎస్‌కు కంచుకోటగా మారింది. ఇప్పుడు ఈ ఉపఎన్నిక ద్వారా కాంగ్రెస్ ఇక్కడ పాగా వేయడానికి మంచి అవకాశం. అయితే, ఈ ఉపఎన్నిక గెలుపు చాలా ముఖ్యమైందని హస్తం పార్టీ పెద్దలు భావిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన ఆరు హామీలు అమలు చేశామని ప్రతీ వేదికపైనా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుపై నిర్ణయం తీసుకున్న ఛాంపియన్ పార్టీగా చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో, ప్రజలు తమ వైపే ఉన్నారన్న సంకేతం ఇచ్చేందుకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం.
కేవలం పార్టీ విషయంలోనే కాకుండా, సీఎంగా రేవంత్ రెడ్డి పాలనకు జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం ప్రజలు వేసే మార్కులుగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా, ఈ నియోజకవర్గ గెలుపు ద్వారా రేవంత్ రెడ్డికి పార్టీలోనూ పట్టు పెరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్‌లో కొందరు సీనియర్ నేతలు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా గళం విప్పుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ గెలుపు ద్వారా వారి నోరు మూయించే అవకాశం రేవంత్ రెడ్డికి దక్కనుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం, వ్యతిరేక శక్తులు బలంగా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపే అవకాశం లేకపోలేదు. అంతేకాకుండా, హైకమాండ్ వద్ద రేవంత్ పలుకుబడి మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ ఉపఎన్నిక రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సాధించే ఫలితాలకు నిదర్శనం అయ్యే అవకాశం ఉంది. ఈ కారణాలతోనే సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపుపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే వరద బాధిత ప్రాంతాలను సందర్శించారు.
సిట్టింగ్ సీటు నిలబెట్టుకోవడం బీఆర్ఎస్‌కు అత్యవసరం
జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవడం గులాబీ పార్టీకి అత్యంత కీలకమైనదిగా చెప్పవచ్చు. రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు వ్యతిరేక ఫలితాలను ఓటర్లు కట్టబెట్టినా, నగర ఓటర్ మాత్రం ఆ పార్టీపై నమ్మకం పెట్టుకుని ఎక్కువ స్థానాలను గులాబీ పార్టీకి కట్టబెట్టారు. ఈ ఉపఎన్నికల్లో అదే సత్తా చాటలేకపోతే బీఆర్ఎస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందనే సంకేతాన్ని ఇస్తుంది. అందుకోసమే, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈ ఉపఎన్నికలో గెలవడానికి తనదైన శైలిలో వ్యూహాలు రచిస్తున్నట్లు తెలంగాణ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక వెలువడింది, పార్టీలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో బీఆర్ఎస్‌కు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు చాలా అవసరం. ఈ గెలుపు ద్వారా ప్రజల్లో తమ పట్ల నమ్మకం పోలేదని, కాళేశ్వరం నివేదికను ప్రజలు పట్టించుకోలేదని చెప్పుకునే అవకాశం గులాబీ పార్టీకి దక్కుతుంది. ఒకవేళ సీటు కోల్పోతే, బీఆర్ఎస్ పార్టీకి రానున్న జీహెచ్‌ఎంసీ సహా స్థానిక సంస్థ ఎన్నికల్లో కష్టాలు తప్పవు. పార్టీలోనూ కేసీఆర్ నాయకత్వంపై నేతల్లో నమ్మకాలు సడలిపోయే అవకాశం లేకపోలేదు.
బీజేపీ నూతన అధ్యక్షుడికి ఈ ఉపఎన్నిక ఒక సవాల్
జూబ్లీహిల్స్ ఉపఎన్నికను బీజేపీ పార్టీ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీజేపీ అధ్యక్షుడిగా రాంచందర్ రావు ఎన్నికైన తరుణంలో ఆయనకు ఇది ఒక సవాల్ లాంటిది. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయడం వంటి ఘటన నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీజేపీకి కీలకంగా మారింది. కొత్త నాయకుడిగా రాంచందర్ రావు నాయకత్వ పటిమకు ఈ గెలుపు అవసరం. ఈ ఎన్నికల్లో గెలుపు ద్వారా రానున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠంపై కమలం జెండా ఎగురవేసే నైతిక బలం ఆ పార్టీకి చేకూరే అవకాశం ఉంది. అంతేకాకుండా, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా తెలంగాణలో బీజేపీ నిలిచిందన్న సంకేతాలను ఈ ఉపఎన్నికను గెలుచుకోవడం ద్వారా ప్రజల్లోకి పంపే అవకాశం ఉంది. ఈ కోణంలో కమలం నేతలు జూబ్లీహిల్స్ ఉపఎన్నికపైన ఇప్పటికే దృష్టి సారించారు. హైదరాబాద్ పరిధిలో ముఖ్యనేతల పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఇలా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో గెలుపు ఒక జీవన్మరణ సమస్యగా మారింది. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారో, ఎవరి వ్యూహాలు పని చేస్తాయి, జూబ్లీహిల్స్ ఓటర్ ఏ పార్టీకి పట్టం కడతారు అన్న విషయాలు తేలాలంటే ఇంకా కొంత ఆగాల్సిందే.