Meat shops and slaughterhouses on Independence Day 2025 | హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా AIMIM అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న మాంసం దుకాణాలు, కబేళాలు మూసివేయడాన్ని తీవ్రంగా విమర్శించారు. మున్సిపల్ అధికారులు తీసుకున్న ఈ చర్యను నిర్లక్ష్యపూరిత, రాజ్యాంగ విరుద్ధమైనదిగా ఒవైసీ అభివర్ణించారు. హైదరాబాద్ ఎంపీ బుధవారం (ఆగస్టు 13, 2025) నాడు 'ఎక్స్' లో పలు మున్సిపల్ కార్పొరేషన్లు జారీ చేసిన ఉత్తర్వులను విమర్శించారు. మాంసం తినడానికి, స్వాతంత్ర్య దినోత్సవానికి మధ్య సంబంధం ఏమిటని అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.

ఒవైసీ తన పోస్టులో ఇలా రాసుకొచ్చారు. "దేశంలోని అనేక మున్సిపల్ కార్పొరేషన్లు ఆగస్టు 15నాడు మాంసం దుకాణాలను, కబేళాలను మూసివేయాలని ఆదేశించాయి. దురదృష్టవశాత్తు గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ GHMC కూడా అదే విధంగా ఉత్తర్వును జారీ చేసింది. ఇది నిర్లక్ష్యపూరితమైనది మాత్రమే కాదు రాజ్యాంగ విరుద్ధమైనది. "ప్రజలు మాంసం తినడానికి, దేశంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకోవడానికి మధ్య సంబంధం ఏమిటి?. తెలంగాణ రాష్ట్రంలో 99 శాతం మంది మాంసం తింటారు. ఈ విధంగా మాంసం నిషేధించడం ప్రజల స్వేచ్ఛ, జీవనోపాధి, గోప్యత, సంస్కృతి, మతం హక్కులను ఉల్లంఘించడమే" అని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు.

మాంసం దుకాణాలను మూసివేయాలని ఉత్తర్వులుస్వాతంత్ర్య దినోత్సవం, జన్మాష్టమి సందర్భంగా మాంసం దుకాణాలను మూసివేయాలని GHMC ఇదివరకే ఆదేశాలు జారీ చేసింది. మున్సిపల్ కార్పొరేషన్ GHMC చట్టం, 1955లోని సెక్షన్ 533 (B) కింద ఈ ఉత్తర్వును జీహెచ్ఎంసీ జారీ చేసింది. GHMC కమిషనర్ ఈ ఉత్తర్వులను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లకు పంపారు.

అన్ని మున్సిపల్ కార్పొరేషన్లలో ఆదేశాలుదేశవ్యాప్తంగా పలు మున్సిపల్ కార్పొరేషన్లు ఆగస్టు 15న జంతు వధ చేయకుండా చికెన్, మటన్ మాంసం దుకాణాలు, కళేళాలు మూసివేయాలని ఉత్తర్వులు జారీ  చేయడంపై వివాదం నెలకొంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ సైతం అదే నిర్ణయం తీసుకుంది. GHMC లోని పశువైద్య అధికారులు, సహాయక డైరెక్టర్లు (పశువైద్య), డిప్యూటీ డైరెక్టర్లు (పశువైద్య), పశువైద్య విభాగాలకు ఈ ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు. దీనితో పాటు, GHMCకి చెందిన అన్ని జోనల్ కమిషనర్లు, అదనపు కమిషనర్లు, తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంఘం మేనేజింగ్ డైరెక్టర్.. పశువైద్య, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశారు. ముంబైలో మున్సిపల్ అధికారులు ఇలాంటి ఆదేశాలు జారీ చేశారని, ప్రజల స్వేచ్ఛ, హక్కును హరిస్తున్నారని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.