Rains In Hyderabad | హైదరాబాద్: 20 సెంటిమీటర్ల మేర భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హైదరాబాద్‌కు అత్యంత భారీ వర్ష సూచన చేసింది. అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని, రెవెన్యూ విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

లోతట్టు, వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలకు ఆదేశాలు..

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం, మరొక నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగనున్న నేపథ్యంలో, రెవెన్యూ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, లోతట్టు, వరద ముంపు ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు ఇబ్బందులు రాకుండా చూడాలని ఆదేశించారు. వరద నీటితో పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ప్రవహిస్తున్నాయి. వరద నీటిని దాటే ప్రయత్నం చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలకు సూచించారు.

విపత్తుల నిర్వహణ శాఖ, ఆయా జిల్లాల్లో ఇరిగేషన్, విద్యుత్, పంచాయతీరాజ్, రహదారులు, పోలీసు విభాగాలతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని సూచించారు. ప్రతి జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూములు 24 గంటలూ పనిచేయేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని, సాయంత్రం తరువాత హైదరాబాద్‌లో భారీ వర్షం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు.

గురువారం వరకు భారీ వర్షాలు..

హైదరాబాద్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కువరనున్నాయని ఉద్యోగులు సైతం వర్క్ ఫ్రమ్ హోం చేయడం మంచిదని పోలీసులు సూచించారు. భారీ వర్షాలు కురుస్తున్న హనుమకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, భూపాలపల్లి తదితర జిల్లాల పరిస్థితిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రజలతో నేరుగా సంబంధమున్న రెవెన్యూ శాఖ నిరంతరం పనిచేసి, ముఖ్యంగా రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలని మంత్రి తెలిపారు.

ఆ జిల్లాల్లో 15 నుంచి 25 సెంటీమీటర్ల వర్షపాతం

కామారెడ్డి, సూర్యాపేట, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, హైదరాబాద్ లలో 150 మి.మీ నుంచి 250 మి.మీ వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ తెలిపారు. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అతి తక్కువ వర్షపాతం నమోదవుతుందని వెల్లడించారు.

నల్గొండ : నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు భారీ వరద ప్రవాహం 

26 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

ఇన్ ఫ్లో, 1,74,533 క్యూసెక్కులు

ఔట్ ఫ్లో : 2,33,051 క్యూసెక్కులు 

పూర్తి స్థాయి నీటి మట్టం : 590 అడుగులు

ప్రస్తుత నీటి మట్టం : 589.30

పూర్తి స్థాయి సామర్ధ్యం : 312.0450 టీఎంసీలు

ప్రస్తుత సామర్థ్యం : 309.95 టీఎంసీలు