Narasannapeta Constituency: శ్రీకాకుళం జిల్లాలోని మరో కీలక నియోజకవర్గం నరసన్నపేట. రాష్ట్రంలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికలు నుంచి ఈ నియోజకవర్గం ఉంది. ఇప్పటి వరకు ఇక్కడ 16సార్లు ఎన్నికలు జరగ్గా, ఏడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగా, నాలుగు సార్లు టీడీపీ అభ్యర్థులు ఇక్కడ గెలిచారు. ధర్మాన సోదరులకు ఈ నియోజకవర్గం ముందు నుంచీ అండగా ఉంటూ వస్తోంది. ఇక్కడి నుంచి ధర్మాన ప్రసాదరావు రెండు సార్లు విజయం సాధించగా, నాలుగుసార్లు ధర్మాన కృష్ణదాస్(ఒక ఉప ఎన్నిక) విజయం సాధించారు. రానున్న ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, విజయం సాధించిన అభ్యర్థులు, ఇతర అంశాలను తెలుసుకుందాం.
తొలి విజయం కాంగ్రెస్ పార్టీదే
1952లో తొలి ఎన్నిక నరసన్నటపేలో జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన హెచ్‌ఎస్ దొర ఇక్కడి నుంచి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కేఎంపీపీ నుంచి పోటీ చేసిన కేబీ రాజుపై 2140 ఓట్ల తేడాతో ఆయన విజయాన్ని దక్కించుకున్నారు. 1955లో జరిగిన ఎన్నికల్లో ఎస్ జగన్నాథం కేఎల్పీ పార్టీ నుంచి పోటీ చేసి విజయాన్ని దక్కించుకున్నారు. సమీప ప్రత్యర్థి సీపీఐ నుంచి పోటీ చేసిన సత్యనారాయణపై 3064 ఓట్లతో తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1962లో జరిగిన ఎన్నికల్లో ఎస్ జగన్నాథం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వీరన్నాయుడుపై 5065 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్ జగన్నాథం మరోసారి విజయం దక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎంవీవీఏ నాయుడుపై 9,110 ఓట్లతో విజయాన్ని నమోదు చేశారు. 1972లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బి సరోజనమ్మ గెలుపొందారు. సమీప ప్రత్యర్థి ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిమ్మ జగన్నాథంపై 2454 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 1978లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డి సీతారాములు ఇక్కడ గెలుపొందారు. సమీప ప్రత్యర్థి జనతా పార్టీ నుంచి పోటీ చేసిన ఎస్ జగన్నాథంపై 5726 ఓట్ల తేడాతో విజయాన్ని పొందారు. 1983లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిమ్మ ప్రభాకరరావు తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డి సీతారాములు 10,716 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన సిమ్మ ప్రభాకరరావు మరోసారి విజయాన్ని దక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన డి ప్రసాదరావుపై 2162 ఓట్ల తేడాతో విజయాన్ని నమోదు చేశారు. 1989లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన ధర్మాన ప్రసాదరావు.. తన సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన సిమ్మ ప్రభాకరరావుపై 14,892 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 1994లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బి లక్ష్మణరావు గెలుపొందారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావుపై 7971 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
1999లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన ధర్మాన ప్రసాదరావు మరోసారి ఇక్కడి నుంచి గెలుపొందారు. సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన బి లక్ష్మణరావుపై 5770 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ధర్మాన కృష్ణదాస్ విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి పోటీ చేసిన బి లక్ష్మణరావుపై 8868 ఓట్ల తేడాతో విజయాన్ని దక్కించుకున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో మరోసారి దర్మాన కృష్ణదాస్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఇక్కడి నుంచి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థిగా మళ్లీ టీడీపీ నుంచి బరిలోకి దిగిన బి లక్ష్మణరావుపై 17,589 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు.
2012లో జరిగిన ఉప ఎన్నికల్లో ధర్మాన కృష్ణదాస్ వరుసగా మూడోసారి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి టీడీపీ నుంచి బరిలోకి దిగిన బి లక్ష్మణరావుపై 7307 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడి నుంచి టీడీపీ నుంచి బరిలోకి దిగిన బగ్గు రమణమూర్తి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి వైసీపీ నుంచి పోటీ చేసిన ధర్మాన కృష్ణదాస్‌పై 4800 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మరోసారి బరిలోకి దిగిన ధర్మాన కృష్ణదాస్ టీడీపీ నుంచి పోటీ చేసిన బగ్గు రమణమూర్తిపై 19,025 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ధర్మాన కుటుంబానికి అండ.. ఆరుసార్లు దర్మాన సోదరులు విజయం
నరసన్నపేట నియోజకవర్గం ఏర్పాటైన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి, దర్మాన కుటుంబానికి అండగా ఉంటూ వస్తోంది. తొలి ఎన్నిక జరిగిన 1952లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన హెచ్‌ఎస్ దొర విజయం సాధించగా, 1972లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన బి సరోజనమ్మ, 1978లో జరిగిన ఎన్నికల్లో డి సీతారాములు, 1989లో ధర్మాన ప్రసాదరావు, 2004లో ధర్మాన కృష్ణదాస్, 2009లో మరోసారి దర్మాన కృష్ణదాస్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం దక్కించుకున్నారు.
ఆ తరువాత 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలోకి దిగిన ధర్మాన కృష్ణదాస్ మరోసారి విజయాన్ని దక్కించుకోగా, 2019లో జరిగిన ఎన్నికల్లో మళ్లీ ధర్మాన కృష్ణదాస్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలుపొందిన ధర్మాన కృష్ణదాస్ ఉప ముఖ్యమంత్రి, మంత్రిగా పని చేశారు. ఇకపోతే, ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఏడుసార్లు కాంగ్రెస్, కాంగ్రెస్(ఐ), వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు తొమ్మిదిసార్లు విజయం సాధించారు. ఏడుసార్లు కాంగ్రెస్, రెండు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విజయం సాధించింది.
ఈ నియోజకవర్గం ధర్మాన సోదరులకు అండగా ఉంటూ వస్తోంది. ఇప్పటి వరకు 16సార్లు ఎన్నికలు జరగ్గా, ఆరుసార్లు దర్మాన సోదరులు విజయం సాధించారు. ధర్మాన ప్రసాదరావు రెండుసార్లు, ధర్మాన కృష్ణదాస్ నాలుగు సార్లు(ఉప ఎన్నికతో కలిపి) విజయం సాధించారు. హ్యాట్రిక్ విజయాలు సాధించిన నేతగా(ఉప ఎన్నికతో కలిపి) కృష్ణదాస్ ఇక్కడ రికార్డు సృష్టించారు.