అవును నిజమే... కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న టైంలో హైదరాబాద్‌లోని రిసార్ట్స్, ఫైవ్‌స్టార్ హోటల్స్ ఫుల్ అయిపోతున్నాయి. కాంగ్రెస్‌ మేజిక్ ఫిగర్‌ దాటే ఛాన్స్ ఉన్నప్పటికీ కూడా అత్తెసరు మెజార్టీ వస్తే పరిస్థితి ఏంటన్నదానిపై మంతనాలు సాగుతున్నాయి. గతంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ  జాగ్రత్త పడింది. 


అవసరం అయితే విజయం సాధించిన అభ్యర్థులను క్యాంపులకు తరలించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందుకే హైదరాబాద్‌లోని కొన్ని ఫైవ్‌స్టార్‌ హోటల్స్, రిసార్ట్స్‌ బుక్‌ చేసిందని ప్రచారం నడుస్తోంది. కొందరు కర్ణాటక వ్యక్తుల పేర్లు మీద ఈ హోటల్స్, రిసార్ట్స్ బుక్‌ అయినట్టు నిర్వాహకులు చెబుతున్నారు. 



గత ఎన్నికల్లో కూడా బీజేపీ 104 సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. 80 స్థానాలతో కాంగ్రెస్ రెండో స్థానంలో ఉంది. 35 స్థానాల్లో విజయం సాధించిన జేడీఎస్‌ జాక్‌పాట్ కొట్టింది. పరిస్థితిని త్వరగా అవగతం చేసుకున్న కాంగ్రెస్, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. బీజేపీకి అవకాశం ఇవ్వకుండా ఫలితాల తర్వాత పొత్తు పెట్టుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. తర్వాత కాంగ్రెస్‌లోని కొంతమంది రెబల్స్‌ విడిపోయి బీజేపీకి మద్దతు ఇచ్చి అప్పటి జేడీఎస్ ప్రభుత్వాన్ని కూల్చేశారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేశారు. 



ఇప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా కాంగ్రెస్ ముందస్తు చర్యలు తీసుకుంటోంది. తాజ్ కృష్ణలో 18, పార్క్ హయత్‌లో 20, నోవేటల్ హోటల్‌లో 20 గదులను బుక్ చేసినట్టు సమాచారం. కాంగ్రెస్‌ నేతల పేరు మీదే ఇవి బుక్ అయినట్టు తెలుస్తోంది. 



ప్రస్తుతం ఉన్న ట్రెండ్స్ చూస్తుంటే ఆ  పరిస్థితి కనిపించడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ ఆధిక్యంలో ఉంది. ప్రస్తుత ట్రెండ్స్‌ ప్రకారం కాంగ్రెస్‌ 120కిపైగా స్థానాల్లో ముందంజలో ఉంది. బీజేపీ 71 స్థానాల్లో, జేడీఎస్‌ 25 స్థానాల్లో అధిక్యంలో ఉంది. 


కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థి ఎవరు?


ట్రెండ్స్ ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడేలా కనిపిస్తోంది కానీ కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ నుంచి సీఎం పదవికి పోటీదారు ఎవరు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ప్రస్తుతం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ ఈ రేసులో ముందంజలో ఉన్నారు.


ముఖ్యమంత్రి పదవి విషయంలో తనకు, శివకుమార్‌కు మధ్య ఏమైనా విభేదాలున్నాయా అని సిద్ధరామయ్యను చాలా మంది మీడియా ప్రతినిధులు అడిగితే.. 'కాంగ్రెస్ ఇంకా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదని... కచ్చితంగా ఆయన తనకు పోటీదారు అని ఒప్పుకున్నారు. 



ముఖ్యంగా కర్ణాటకలో ఎన్నికల ఫలితాలకు ముందు ముఖ్యమంత్రి పేరు ప్రకటించకపోవడం కాంగ్రెస్‌లో వస్తున్న ఆనవాయితీ. ఇది చాలా ఏళ్ల తరబడి కొనసాగుతున్న ప్రక్రియ. పార్టీ మెజారిటీతో అధికారంలోకి వస్తే ముందుగా ఎన్నికైన ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని చెబుతారు. అప్పుడు హైకమాండ్ నిర్ణయిస్తుందన్నారు.


అయితే కాంగ్రెస్ కు మెజారిటీ వస్తే సిద్ధరామయ్య, డీకేఎస్ మధ్య సీఎం పదవి కోసం పోరు తీవ్రమవుతుందని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. సిద్ధరామయ్య అనుభవజ్ఞుడు, సీనియర్ నాయకుడని, ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉందని కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యే  అభిప్రాయపడుతున్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఉన్న డీకేఎస్ కాంగ్రెస్‌కు అత్యంత సన్నిహితుడు.