రకరకాల అంచనాల మధ్య తీవ్ర ఉత్కంఠతో సాగిన కర్ణాటక ఎన్నికల్లో ఫలితాలు వస్తున్నాయి. మరికొన్ని గంటల్లో పూర్తి ఫలితం వచ్చే ఛాన్స్ ఉంది. ఉదయం తొమ్మిదిన్నర వరకు ఉన్న ట్రెండ్స్‌ను పరిశీలిస్తే... కాంగ్రెస్‌ భారీ మెజార్టీతో గెలిచే ఛాన్స్ ఉందన మాత్రం స్పష్టం అవుతోంది. 



హంగ్ వస్తుందేమో అని చాలా ఎగ్జిట్ పోల్ అంచనా వేశాయి. అయితే కర్ణాటక ఓటరు మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారని ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. ఉదయం తొమ్మిదినర వరకు ఉన్న ట్రెండ్స్ చూస్తే బీజేపీ 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉంటే... కాంగ్రెస్ ఆ స్థానాలకు డబుల్‌ మెజార్టీలో దూసుకెళ్తోంది. ఆ పార్టీ 137 స్థనాల్లో ఆధిక్యంలో ఉంది. ఈసారి జేడీఎస్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. కేవలం 17 స్థానలకే ఆ పార్టీ పరిమితం అయ్యేలా కనిపిస్తోంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. 



కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 సీట్లు అవసరం. ఆ మార్గ్‌ను కాంగ్రెస్ ఎప్పుడో దాటేసింది. కర్ణాటకను రాజకీయపరంగా 6 ప్రాంతాలుగా విభజించి చూస్తే... మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యత సాధించింది. బెంగళూరు, సెంట్రల్ కర్ణాటక, కోస్టల్ కర్ణాటకలో బీజేపీ హవా కొనసాగింది. ఇక్కడ కూడా హోరాహోరీ పోటీ నెలకొంది. మిగతా మూడు ప్రాంతాల్లో కాంగ్రెస్‌ పూర్తి ఆధిక్యత సాధించింది.   



ఒకవేళ కాంగ్రెస్, బీజేపీల్లో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ రాకపోతే...అప్పుడు JDS కింగ్ మేకర్ అవుతుందని చాలా మంది అంచనాలు వేశారు కానీ అవి తలకిందులయ్యాయి. ఎగ్జిట్‌ పోల్స్‌లో కూడా"హంగ్" వచ్చే అవకాశమూ ఉందని తేలడం వల్ల టెన్షన్ మరింత పెరిగింది. అయితే అలాంటి టెన్షన్‌కు కర్ణాటక ఓటర్లు తావులేకుండా చేశారు.  కర్ణాటక ఎన్నికల ట్రెండ్‌ని చూస్తే...కన్నడిగులు ఎప్పుడూ ఒకే ప్రభుత్వానికి రెండోసారి అధికారం ఇచ్చిన దాఖలాల్లేవు. ఇప్పుడు కూడా అదే నిజమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 1985 నుంచి రాష్ట్రంలో ఇదే ట్రెండ్ కొనసాగుతోంది.