ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గకుండా ఉండేందుకు ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషన్ కొత్త విధానాలు తీసుకొస్తోంది. అందులో భాగంగానే కర్ణాటక ఎన్నికల్లో వినూత్న ప్రయోగానికి సిద్దమైంది. ప్రత్యేక పరిస్థితుల్లో ఓటు వినియోగించుకోలేకపోయేవాళ్లకు ఓట్ ఫ్రమ్ హోం ఆఫ్షన్ ఇస్తోంది. దీని కోసం ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్టు ఈసీ పేర్కొంది. కర్ణాటక ఎన్నికల్లో తొలిసారి ప్రవేశ పెట్టే ఈ సంస్కరణపై చాలా ప్రసంశలు అయితే వస్తున్నాయి. దీని వల్ల ఓటింగ్ శాతం పెరిగే ఛాన్స్ ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 


కర్ణాటక ఎన్నికల్లో భారత ప్రధాన ఎన్నికల అధికారులు తీసుకున్న నిర్ణయంపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ట్విట్టర్‌ వేదికగా స్పందించిన లక్ష్మీనారాయణ అన్ని వర్గాలకు అప్లై చేయాలంటూ సూచన చేస్తున్నారు.  లక్ష్మీనారాయణ ఏమన్నారంటే.. ‘‘కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 80 ఏళ్లుపైబడిన వారిని ఇంటి నుంచి ఓటు వేయడానికి అనుమతించాలని భారత ఎన్నికల సంఘం నిర్ణయించడం మంచి పరిణామం’’ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచడానికి ఈ సదుపాయాన్ని ఇతర వయసుల వారికి కూడా వర్తింపజేయాలి అని ఈసీకి విన్నవించారు. 
ఇంతకీ ఏంటీ ఓట్ ఫ్రమ్ హోం కాన్సెప్ట్‌






80 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులకు భారత ప్రధాన ఎన్నికల కమిషన్‌ ఇంటి నుంచే ఓటు వేసుకనే వెసులుబాటు కల్పించనుంది. కర్ణాట ఎన్నికల నుంచే దీన్ని అమలు చేయనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ప్రకటించారు. ఓటు ఫ్రం హోంను వినియోగించుకోవడానికి ఈసీ పక్కా విధానాలను ఏర్పాటు చేసింది. అంతా పారదర్శకతతో ఉంటుందని.. ఎవరికీ ఎలాంటి అపోహలు అవసరం లేదని చెబుతోంది. 


ఓటు ఫ్రం హోంకు పోలింగ్‌కు ముందు దరఖాస్తు చేసుకోవాలి. పోస్టల్‌ బ్యాలెట్‌ తరహాలోనే ఇంటి నుంచి ఓటు వేయడానికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.  80 ఏళ్లు పైబడిన వారు, దివ్యాంగులు పోలింగ్‌ కు ఐదు రోజుల ముందే ఫారం 12 ఈ కోసం దరఖాస్తు చేసుకోవాలి. వచ్చిన దరఖాస్తులను ఎన్నికల సంఘం వేగంగా పరిశీలిస్తుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్నికల సంఘం టీం సభ్యులు దరఖాస్తు చేసుకున్న వారు అర్హులా..? కాదా..? అనేది గుర్తిస్తారు. అర్హులు అని తేలాక.. పోలింగ్‌ జరిగే రోజు ఫారం 12ఈ తీసుకుని.. ఎన్నికల సిబ్బంది వారి ఇంటికే వెళ్తారు. బ్యాలెట్‌ పేపర్‌ వారికి ఇచ్చి ఓటు వేయిస్తారు. 


అదే తరహాలో..
ఓటు వేసే సమయంలో పోలింగ్‌ బూత్‌లో ఎలాంటి ఏర్పాట్లు చేస్తారో! అచ్చం అలాంటి జాగ్రత్తలే తీసుకుంటారు.  ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో సైతం తీస్తారు. ఓటు ఎవరికి వేశారనేది మాత్రం ఎవరికీ తెలియదు. పోలింగ్‌ సిబ్బందితో పాటు ఆయా పార్టీల ఏజెంట్లు కూడా వారి వెంట ఉంటారు. 


ఇక అన్ని ఎన్నికల్లోనూ ఇదే అవకాశం కల్పించే ఛాన్స్‌!
ఈ ఓటు ఫ్రం హోం కర్ణాటకలో ఎలా అమలవుతుందన్న దాన్ని పూర్తి స్థాయిలో సమీక్షించి ఇక అన్ని రకాల ఎన్నికల్లో ఈసీ అమలు చేసే అవకాశం ఉంది.  కర్నాటకలో 80 ఏళ్లకు పైబడిన ఓటర్లు 12 లక్షల 15 వేల మంది ఉండగా.. 5 లక్షల 55 వేల మంది దివ్యాంగులు ఉన్నారు.   వీరందరూ దాదాపుగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం ఈ ఏర్పాట్లు చేస్తోంది.