TDP Vs YSRCP: గత ఎన్నికల్లో రాయలసీమ(Rayalasema)లో జగన్ గెలుపు గురించి చెప్పాలంటే మాటలు చాలవు...రాష్ట్ర చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో జగన్(Jagan) గుత్తాధిపత్యం చెలాయించారు. ఏకంగా 56 స్థానాల్లో 53 చోట్ల వైసీపీ జయకేతనం ఎగురవేసింది వైసీపీ. కడప, కర్నూలు జిల్లాల్లో ప్రత్యర్థుల ఖాతానే తెరవలేదంటూ వైసీపీ ఊచకోత ఏ రేంజ్‌లో సాగిందో అర్థమతువుంది. మొత్తం రాయలసీమలోనే గెలిచిందెవరంటే...ఒకటి చంద్రబాబు(Chandrababu), మరొకటి ఆయన బావమరది నందమూరి బాలకృష్ణతోపాటు మరో సీనియర్ తెలుగుదేశం నేత పయ్యావుల కేశవ్ మాత్రమే. ఈసారి ఆ మూడు స్థానాలను సైతం కైవసం చేసుకుంటామని జగన్ ధీమా వ్యక్తం చేస్తుండగా...తెలుగుదేశం పూర్వ వైభవం సాధిస్తుందని చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు.
జగన్ ఇలాకాలో చోటు దక్కేనా..?
కడప(Kadapa) జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్‌పార్టీదే హవా..వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఏకచత్రాధిపత్యంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా తీర్చిదిద్దారు. అయినప్పటికీ ఒకప్పుడు తెలుగుదేశం (Telugudesam)పార్టీ ఏడుస్థానాలు గెలిచుకుని సత్తా చాటింది. ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌కు దీటుగా జవాబిచ్చినా...గత ఎన్నికల్లో మాత్రం పూర్తిగా తుడుచుకుపెట్టుకుపోయింది. పదికి పదిస్థానాలు వైసీపీ(YCP) ఖాతాలో పడ్డాయి. పులివెందుల నుంచి మరోసారి సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి(YS Jagan) బరిలో దిగుతుండగా...టీడీపీ(TDP) నుంచి పాత ప్రత్యర్థి బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ పోటీ నామమాత్రమే అయినప్పటికీ జగన్ మెజార్టీ ఎంత తగ్గిస్తే టీడీపీ అంత బలపడినట్లే లెక్క. ఇక్కడ వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్న దస్తగిరి కూడా పోటీ చేస్తానంటూ చెప్పుకొస్తున్నారు.
జిల్లాలో మరో కీలక నియోజకవర్గం కమలాపురం. ఇక్కడ నుంచి జగన్ మేనమామ రవీంధ్రనాథ్ రెడ్డి పోటీ చేస్తుండగా ఇదే స్థాన నుంచి నాలుగుసార్లు ఓటమి పాలైన పుత్తా నరసింహారెడ్డి ఇక పోటీ నుంచి విరమించుకుని ఆయన కుమారుడు చైతన్యరెడ్డిని ఈసారి పోటీకి దించారు. వరుస ఓటములతో సానుభూతి దక్కుతుందేమోనని పుత్తా కుటుంబం ఆశలుపెట్టుకుంది. కానీ ఈ నియోజకవర్గంలో వైఎస్ కుటుంబాన్ని కాదని వేరొకరు గెలవడమంటే అసాధ్యమనే చెప్పాలి. ఇక మరో ఆసక్తికర పోటీ కడప టౌన్‌లో కనిపిస్తోంది. ముస్లిం జనాభా ఎక్కువగా ఉంటే కడపనగరంలో మొదటి నుంచి ఆ సామాజికవర్గానికే టిక్కెట్ కేటాయిస్తున్నారు . మూడు దశాబ్దాలుగా ముస్లింలే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తుండంతో రెడ్డి సామాజికవర్గం గుర్రుగా ఉంది. దీంతో ఈసారి తెలుగుదేశం పార్టీ రెడ్డప్పగారి మాధవీరెడ్డి (Madhavi Reddy)ని బరిలోకి దింపి ప్రయోగానికి సిద్ధమైంది. వైసీపీ(YCP) నుంచి హ్యాట్రిక్ విజయం కోసం అంజాద్‌బాషా(Amjadh Bhasha) తహతహలాడుతున్నారు. రెడ్డి సామాజికవర్గం ఓట్లతోపాటు మహిళ సెంటిమెంట్ ఓట్లపై తెలుగుదేశం దృష్టిసారించింది.
జమ్మలమడుగు(Jammalamadugu) నుంచి వైసీపీ తరపును మరోసారి సుధీర్‌రెడ్డి పోటీలో నిలవగా...పొత్తులో భాగంగా ఈ సీటు బీజేపీకి కేటాయించే అవకాశం ఉంది. ఆ పార్టీ తరపున అమర్‌నాథ్‌రెడ్డిగానీ, ఆయన కుటుంబ సభ్యులు బరిలో నిలిచే అవకాశాలు ఉన్నాయి. ప్రొద్దుటూరు నుంచి రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మరోసారి వైసీపీ తరపున బరిలో దిగుతుండగా....తెలుగుదేశం పార్టీ మాత్రం ఎవరూ ఊహించని విధంగా రాజకీయ కురువృద్ధుడు వరదరాజులరెడ్డి(varadharajula Reddy)కి టిక్కెట్ కేటాయించింది. 80ఏళ్ల వయసులో మరోసారి టిక్కెట్ సాధించి వరదరాజులురెడ్డి అందరినీ ఆశ్చర్యపరిచారు. 25 ఏళ్లపాటు ప్రొద్దుటూరుని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన వరదరాజులురెడ్డి... గత రెండు దఫాలుగా ఆయన శిష్యుడే అయిన రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. 2019లో ఓడిపోయినప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉంటున్న ఆయన అనూహ్యంగా చంద్రబాబును మెప్పించి టిక్కెట్ సాధించారు. ఈ టిక్కెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉక్కు ప్రవీణ్‌రెడ్డి, లింగారెడ్డికి తీవ్ర నిరాశ ఎదురైంది.
కర్నూలులో ఖాతా తెరిచేదెవరో..?
పౌరుషాల పురిటిగడ్డ కర్నూలు జిల్లాలోనూ గత ఎన్నికల్లో టీడీపీ ఖాతా తెరవలేదు. జగన్ ఒక్కఛాన్స్ దెబ్బకు ఆ పార్టీ నేతలంతా ఓటమిపాలైనా...జగన్ మోసాన్ని ప్రజలు తెలుసుకున్నారని....ఈసారి గెలుపు టీడీపీదేనని నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డ(Allagadda)లో తరతరాలుగా రాజకీయ వైరం కలిగి ఉన్న ఆళ్లగడ్డలో మరోసారి భూమా, గంగుల కుటుంబాలు పోటీపడుతున్నాయి. తెలుగుదేశం నుంచి మాజీమంత్రి అఖిలప్రియ(Akila Priya) టిక్కెట్ దక్కించుకోగా...వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రిజేంద్రరెడ్డి సమరానికి సై అంటున్నారు. కర్నూలు(Karnool) టిక్కెట్‌ను అనూహ్యంగా మాజీ ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ దక్కించుకున్నారు. దీనికోసమే ఆయన తన ఉద్యోగానికి సైతం రాజీనామా చేశారు. టీడీపీ(TDP) నుంచి ప్రముఖ పారిశ్రామివేత్త టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్(TG Bharath) పోటీలో ఉన్నారు. పాణ్యంలో మరోసారి కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి ఢీకొట్టబోతున్నారు. డోన్‌లో మంత్రి బుగ్గన(Bhuggana) రాజేంద్రనాథ్‌రెడ్డిపై ఈసారి మాజీ కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీలో నిలిచారు. సీనియర్ టీడీపీ లీడర్ కేఈ కృష్ణమూర్తి రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లే. ఆయన కుమారుడు కేఈ శ్యాంబాబుకు పత్తికొండ టిక్కెట్ టీడీపీ ఖరారు చేసింది. ఎమ్మిగనూరు నుంచి మరోసారి బుట్టా రేణుక, జయనాగేశ్వర్‌రెడ్డి తలపడుతున్నారు.
అనంత ఓటరు అంతరంగం అనంతం
రాయలసీమలో తెలుగుదేశానికి మంచి పట్టున్న జిల్లా అనంతపురం(Anathapuram)లో గత ఎన్నికల్లో తీవ్ర పరాభవం పాలైనా...తిరిగి మళ్లీ పుంజుకున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్(Payyavula Kesav) మరోసారి ఉరవకొండ నుంచి బరిలో దిగగా...ఆయనపై పాత ప్రత్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డికే వైసీపీ సీటు ఇచ్చింది. రాయదుర్గంలో జగన్ నమ్మినబంటు కాపు రామచంద్రారెడ్డిని కాదని జగన్ మెట్టుగోవిందరెడ్డికి టిక్కెట్ కేటాయించారు. అన్ని సర్వేల్లోనూ కాపు వెనకబడిపోయాడని...ఈసారి టిక్కెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో ఆయన తాడేపల్లిలోని జగన్ ఇంటికి దణ్ణంపెట్టి మరీ పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు. తెలుగుదేశం నుంచి మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులే(Kalva Srinivasulu) మళ్లీ బరిలో ఉన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మరో నియోజకవర్గం తాడిపత్రి..ఇక్కడ జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar Reddy), ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దరెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా విభేదాలు ఉన్నాయి. పలుమార్లు ఇళ్లపై దాడులు చేసుకునే వరకు వెళ్లారు. దీంతో ఈ నియోజకవర్గంపై పైచేయి ఎవరు సాధిస్తారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌రెడ్డి(Asmith Reddy) మరోసారి తెలుగుదేశం తరఫున బరిలో నిలవగా....వైసీపీ టిక్కెట్ పెద్దరెడ్డే దక్కించుకున్నారు. కల్యాణదుర్గంలో ఇద్దరూ కొత్త అభ్యర్థులే కావడం విశేషం. మంత్రి ఉషశ్రీచరణ్(Usha Sricharan)ను పెనుకొండకు మార్చి ఎంపీ తలారి రంగయ్యకు వైసీపీ టిక్కెట్ కేటాయించింది. తెలుగుదేశం సైతం ఉమామహేశ్వరనాయుడు, చౌదరి కొట్లాడుకుంటుండటంతో కొత్త అభ్యర్థి సురేంద్రబాబును రంగంలోకి దింపింది. నియోజకవర్గంలో ఇద్దరూ కొత్త అభ్యర్థులే కావడంతో గెలుపు ఎవరి పక్షనా నిలుస్తుందో...కేడర్ ఎవరికి దెబ్బ వేస్తారో ఎన్నికల తర్వాతే తేలనుంది.
రాప్తాడులో మరోసారి పరిటాల కుటుంబానికే టిక్కెట్ దక్కింది. మాజీమంత్రి సునీత(Paritala Sunitha) పోటీ చేస్తుండగా....సిట్టింగ్ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి వైసీపీ టిక్కెట్ కేటాయించింది. హిందూపురం నుంచి నందమూరి బాలకృష్ణ(Nandhamuri Balakrishna) హ్యాట్రిక్ విజయంపై కన్నేయగా...ఆయనపై కొత్త అభ్యర్థి నారాయణ్ దీపికను వైసీపీ పోటీలో నిలిపింది. హలో ధర్మవరం అంటూ ఉదయాన్ని ప్రజలను పలకరించే వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైసీపీ నుంచి బరిలో నిలవనుండగా....పొత్తుల భాగంగా ఈ సీటు భాజపాకు దక్కే అవకాశం ఉంది. ఆ పార్టీ తరపున సూర్యనారాయణరెడ్డి మరోసారి పోటీ పడనున్నారు.
చిత్తూరు చిక్కేనా...?
వైనాట్ 175 నినాదం ఎత్తుకున్న సీఎం జగన్‌మోహన్‌రెడ్డి(Jagan)...ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ కుప్పం(Kuppam)లో చంద్రబాబు(Chandrababu)ను ఓడించి తీరుతామని పదేపదే చెబుతున్నారు. అందుకు అనుగుణంగానే మూడేళ్ల ముందు నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారు. కీలక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandra Reddy)కి ఆ బాధ్యతలు అప్పగించారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబును ఓడించేందుకు వచ్చిన అవకాశాన్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమాత్రం వదులుకోవడం లేదు. తన సొంత నియోజకవర్గం కన్నా ఇక్కడే ఎక్కువ ఫోకస్ పెట్టారు. అటు చంద్రబాబు సైతం గతంలో ఎప్పుడూ వెళ్లలేనన్నిసార్లు వెళ్లారు. ఈసారి లక్ష మెజార్టీతో గెలిపించి జగన్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దీంతో ఇక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది.
ఇక పుంగనూరులో అడ్డేలేకుండా హ్యాట్రిక్ విజయాలు సాధించిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు టీడీపీ ప్రత్యేక వ్యూహాలు సిద్ధం చేసింది. ఆయనపై ఈసారి చల్లా రామచంద్రారెడ్డిని పోటీకి నిలిపింది. అంగబలం, అర్థబలం దండిగా ఉన్న పెద్దిరెడ్డి ముందు రామచంద్రారెడ్డి ఏమేరకు ఎదురు నిలవగలడో చూడాలి. చిత్తూరు జిల్లాలో ఈసారి రాజకీయ వారసులు బరిలో దిగారు. చంద్రగిరి నుంచి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి(Chevireddy Bhaskar Reddy) తనయుడు మోహిత్‌రెడ్డి, తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి(Bhumana Karunakar Reddy) తనయుడు అభినయ్‌రెడ్డికి వైసీపీ టిక్కెట్లు కేటాయించింది. చంద్రగిరిలో పులివర్తినానికి టీడీపీ టిక్కెట్ ఇవ్వగా....తిరుపతి సీటు పొత్తులో భాజపాకు కేటాయించే అవకాశం ఉంది. అలాగే మరో కీలక నియోజకవర్గం నగరి నుంచి ఫైర్‌బ్రాండ్ మంత్రి రోజా(RK Roja) మరోసారి బరిలో నిలిచారు. ఆమెకు ప్రత్యర్థుల నుంచి కాకుండా సొంతపార్టీ నేతల నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక టీడీపీ నుంచి మాజీమంత్రి బొజ్జల గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాశ్ పోటీ చేయనున్నారు. శ్రీకాళహస్తిలో సిట్టింగ్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికే వైసీపీ టిక్కెట్ ఇవ్వగా...రకరకాల సమీకరణాల అనంతరం మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డిని తెలుగుదేశం బరిలో దింపింది.