YS Jagan On Pitapurm :  వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తానని సీఎం జగన్ పిఠాపురం ప్రజలకు హామీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ గెలిస్తే  పిఠాపురంలో ఉండరన్నారు.  దత్తపుత్రుడికి ఓటు వేయకండి.. దత్తపుత్రుడికి ఓటేస్తే ఇక్కడే ఉంటాడా? హైదరాబాద్ వెళ్తాడా? అని ప్రశ్నించారు. పవన్ తన చివరి ప్రచారసభను పిఠాపురంలో నిర్వహించారు.  గాజువాక, భీమవరం అయిపోయింది.. ఇప్పుడు పిఠాపురం అంటున్నారని విమర్శించారు. 


టీడీపీ మేనిఫెస్టోను అమలు చేయలేరు !                                  


టీడీపీ మేనిఫెస్టోపైనా జగన్ విమర్శలు చేశారు.  చంద్రబాబును నమ్మడం అంటే కొండ చిలువ నోట్లో తలపెట్టడమేనన్నరాు.  కూటమికి ఓటేస్తే పథకాలన్నిటింకీ ముగింపే. 2 లక్షల 70 వేల కోట్ల రూపాయలు నేరుగా ప్రజల ఖాతాల్లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం జమ చేసింది. రాబోయే ఐదేళ్ల ఇంటింటి అభివృద్ది, పథకాల కొనసాగింపును నిర్ణయించే ఎన్నికలు. ఐదేళ్లు లంచాలు, వివక్ష లేకుండా సంక్షేమ పథకాలు అందించాం. ఇంటి వద్దకే పెన్షన్‌, పౌరసేవలు, పథకాలు ఇస్తున్నామన్నారు. సాధ్యంకాని హామీలతో చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారని.. పొరపాటున బాబుకు ఓటు వేస్తే ప్రజలు మోసపోయినట్టేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.  


మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంగా భావించి అమలుచేశాం !                               


2 లక్షల 31 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.  ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి 99 శాతం హామీలు అమలు చేశామని  జగన్ తెలిపారు.  గతంలో ఎప్పుడైనా ఈ పథకాలు చూశారా. అక్కాచెల్లెమ్మల పేరుపై 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు.  రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం. విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నకు తోడుగా ఉన్నాం. డ్రైవర్‌ అన్నదమ్ములకు వాహనమిత్ర, నేతన్నలకు నేతన్న నేస్తం. జగనన్న తోడు, చేదోడుతో చిరు వ్యాపారులకు తోడుగా నిలిచామని గుర్తు చేశారు.  


ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మంచిదే !                                  


‘‘ల్యాండ్ టైటిలుగా యాక్ట్ విపరీతంగా దుష్ప్రచారం చేస్తున్నారు. ఇదే దత్తపుత్రుడు మంగళగిరి వెళ్లి భూములు కొన్నాడు.. బాలకృష్ణ మొన్ననే విశాఖలో రిషికొండలో భూమలు కొన్నాడు.. మీ ఇద్దరినీ అడుగుతున్నా.. మీకు ఒరిజినల్ డీడ్స్ ఇచ్చారా? జిరాక్స్ ఇచ్చారా?. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న 9 లక్షల మందికి ఒరిజినల్ డీడ్స్ ఇచ్చాం’’ అని సీఎం జగన్‌ వివరించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై విపక్షాలు చెసే ప్రచారం నమ్మవద్దన్నారు. 


సీఎం జగన్ చివరి రోజు మూడు ప్రచార సభల్లో పాల్గొన్నారు. మొత్తంగా నలభై నియోజకవర్గాల వరకూ సభలు నిర్వహించారు.