Vijayamma Blesses YS Sharmila: కడప: మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచార గడువు ముగియనుంది. కీలక సమయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తల్లి తన మద్దతు ఎవరికో ప్రకటించారు. ఈ ఎన్నికల్లో షర్మిలకు ఆమె అండగా నిలిచారు. వైఎస్సార్ ను అభిమానించే వారికి, ప్రేమించే వారికి నమస్కారాలు తెలిపారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఆదరించినట్లే, ఇప్పుడు షర్మిలను ఆదరించాలని కడప ప్రజలకు విన్నపం చేశారు. YSR బిడ్డ షర్మిలమ్మ ఎంపీ గా పోటీ చేస్తుంది, షర్మిలను కడప ఎంపీగా గెలిపించి పార్లమెంట్ కి పంపాలని వీడియో సందేశం ద్వారా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మరోవైపు సీఎం జగన్ సిట్టింగ్ ఎంపీ అవినాష్ రెడ్డిని మరోసారి కడప ఎంపీ బరిలో నిలిపారు. అవినాష్ రెడ్డితో తలపడుతున్న తన కూతురు షర్మిలకు ఓట్లు వేసి గెలిపించాలని కడప ఓటర్లను విజయమ్మ కోరడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి.


షర్మిల ఎంట్రీతో మారిన రాజకీయాలు.. 
వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎంట్రీ ఇచ్చాక.. రాష్ట్ర రాజకీయాలు మారిపోయాయి. సోదరుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని షర్మిల వ్యతిరేకించారు. ముఖ్యంగా బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు అంశంపై విభేదాలున్నాయి. న్యాయం గెలిచేందుకు తాను కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు షర్మిల గతంలోనే ప్రకటించారు. అదే స్థానానికి వైసీపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని జగన్ బరిలో నిలిపారు. అయితే చిన్నాన్న వివేకా హత్య కేసులో నిందితుడు, సూత్రధారి అవినాష్ కు టికెట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని షర్మిల పదే పదే ప్రశ్నల వర్షం కురిపించారు. 



గతంలో తనను కడప ఎంపీగా పోటీ చేయాలని బాబాయ్ వివేకా అడిగితే తాను సున్నితంగా తిరస్కరించానని షర్మిల తెలిపారు. కానీ ఆ సమయంలో బాబాయ్ తనను పోటీ చేయాలని ఎందుకు సూచించారో అర్థం కాలేదని, ఆయన హత్య తరువాత ఒక్కో విషయంపై తమకు అవగాహన వచ్చిందన్నారు. పార్లమెంట్ కు వెళ్లే వారిని గెలిపించాలి, కానీ జైళ్లకు వెళ్లే వారికి ఓటు వేయకూడదంటూ షర్మిల ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. సీబీఐ ఆధారాలు చూపించాక అవినాష్ రెడ్డే ఇదంతా చేశాడని అర్థమైందన్నారు వివేకా కూతురు డాక్టర్ సునీత, షర్మిల. తమ సోదరులు జగన్, అవినాష్ రెడ్డిల వీరిద్దరూ  విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.  మరోవైపు ఎన్నికల కోడ్ వచ్చిన సమయంలో విజయమ్మ అమెరికాకు వెళ్లిపోయారు. గత కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న విజయమ్మ ఎన్నికల ప్రచారం ముగుస్తుందన్న సమయంలో షర్మిలకు మద్దతు ప్రకటించారు.


షర్మిల రాజకీయాల్లోకి రావడంతోనే కుటుంబంలో సంక్షోభం మొదలైందని, ఒక తరంలో ఇద్దరు పాలిటిక్స్ లో ఉంటే నష్టం జరుగుతుందని ఓ జాతీయ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏపీ సీఎం జగన్ చెప్పడం హాట్ టాపిక్ అయింది. అయితే తాను గానీ, తన భర్త గానీ జగన్ నుంచి ఏ సహాయం, ఫేవర్ తీసుకోలేదని.. అలాంటిది ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు. జగన్ జైళ్లో ఉంటే కష్టపడి వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు తాను పార్టీలో ఉన్నది జగనన్నకు గుర్తుకురాలేదా అని షర్మిల పలు అంశాలు లేవనెత్తారు.