Chandrababu Letter To Apsrtc MD For Additional Buses: ఈ నెల 13న (సోమవారం) పోలింగ్ నేపథ్యంలో ఆర్టీసీ అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) కోరారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీకి శనివారం ఆయన లేఖ రాశారు. బస్సులు పెంచడం ద్వారా ప్రయాణ సౌకర్యంతో ఓటింగ్ శాతం కూడా పెరుగుతుందని లేఖలో పేర్కొన్నారు. 'పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ సహా ఇతర నగరాల్లో ఉన్న ఏపీ ఓటర్లు ఓటు వేసేందుకు సొంత ప్రాంతాలకు వస్తారు. ఇప్పటికే హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు ఓటు వేసేందుకు ఏపీలోని తమ ఊళ్లకు ప్రయాణమవుతున్నారు. ఇలాంటి సమయంలో సొంత ప్రాంతానికి వెళ్లడానికి ఆర్టీసీ సౌకర్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పటికే హైదరాబాద్, విజయవాడ బస్టాండ్ ల్లో ప్రయాణికుల రద్దీ కనిపిస్తోంది. అవసరమైనన్ని బస్సులు అందుబాటులో లేక సొంతూళ్లకు వెళ్లే ప్రయాణీకులు చాలాసేపు నిరీక్షిస్తున్నారు. ఈ 2, 3 రోజులు అదనపు బస్సులు ఏర్పాటు చేసి ప్రయాణ సౌకర్యానికి ఇబ్బంది లేకుండా చేయాలి.' అని లేఖలో చెప్పారు. 


సొంతూళ్లకు భారీగా.. 


అటు, సార్వత్రిక ఎన్నికల్లో తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు భారీగా సొంతూళ్లకు పయనమవుతున్నారు. రద్దీ దృష్ట్యా  హైదరాబాద్ నుంచి 2 వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అటు, దక్షిణ మధ్య రైల్వే సైతం ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ ఆర్టీసీ బస్సులో 10 రోజుల ముందే సీట్ల రిజర్వేషన్ పూర్తి కాగా బస్టాండులు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఎంజీబీఎస్ నుంచి 500, జేబీఎస్ నుంచి 200, ఉప్పల్ నుంచి 300, ఎల్బీనగర్ నుంచి 300 ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే, ప్రయాణికుల రద్దీని బట్టు మరిన్ని బస్సులు పెంచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే, ఇదే అదునుగా ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు ప్రధాన నగరాలకు టికెట్ ఛార్జీలను పెంచుతున్నారని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. సాధారణ రోజుల్లో రూ.500 నుంచి రూ.1000 వరకూ టికెట్ ఛార్జీలుండగా.. ప్రస్తుతం రూ.5 వేల వరకూ ఖర్చు చేయాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ స్లీపర్ బస్సుల్లో హైదరాబాద్ నుంచి విజయవాడ వరకూ టికెట్ రేట్లు రూ.2,500 వరకూ చూపిస్తున్నాయని పేర్కొంటున్నారు. అలాగే, హైదరాబాద్ నుంచి విశాఖ, రాజమండ్రి, కడప, తిరుపతి వంటి ప్రధాన నగరాలకు సైతం అదే రేంజ్ లో రేట్లు చూపిస్తున్నాయని చెబుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జాం


మరోవైపు, ఉద్యోగ, ఉపాధి కోసం హైదరాబాద్ లో స్థిరపడ్డ వారు చాలా మంది తమ సొంత వాహనాల్లో ఓటు వేసేందుకు ఏపీకి పయనమవుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ - విజయవాడ (Vijayawada) హైవేపై రద్దీ నెలకొంది. వారాంతం, వరుస సెలవులు, పోలింగ్ కు ఇంకా రెండు రోజులే టైం ఉండడంతో శనివారం వేకువజాము నుంచే జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. ఈ వాహనాలు విజయవాడ మీదుగా రాజమహేంద్రవరం, విశాఖ వైపు తరలివెళ్తున్నాయి. అటు, హైదరాబాద్ శివారు హయత్ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెంట్ వరకూ ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతోంది. అటు, చౌటుప్పల్, పంతంగి టోల్ ప్లాజాల వద్ద కూడా పెద్ద సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి.


Also Read: Ram Charan: ఈ గట్టున రామ్‌చరణ్‌ - ఆ గట్టున అల్లు అర్జున్, గేమ్‌ ఛేంజర్‌ ఎవరు?