మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...హస్తం కండువా కప్పుకోనున్నారు. ఈ నెల 5న ఆయన అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి, సీనియర్ నేత మల్లు రవి... గురువారం తుమ్మల ఇంటికి వెళ్లి పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. రేవంత్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన మాజీ మంత్రి తుమ్మల... 5న కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. పాలేరు అసెంబ్లీ టికెట్ ఇచ్చేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరితే...పార్టీ మరింత బలోపేతమవుతుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలతో రాజకీయ అనుబంధం తెంచుకోలేనిదన్నారు తుమ్మల. ఇటీవల ఆయన అనుచరులు వెయ్యి కార్లు, రెండు వేల బైక్ లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రజల అభిమానం, ఆత్మీయత, ఆవేదన చూసిన తర్వాత ఎన్నికల బరిలో దిగాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం తనకు రాజకీయాలు అవసరం లేకున్నా... ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం కొనసాగుతానని స్పష్టం చేశారు. రాజకీయంగా ఎన్నోసార్లు కిందపడ్డా ప్రజలు మళ్లీ నిలబెట్టారని...జిల్లాలో పుట్టిన మహా నేతలకు దక్కని గుర్తింపు తనకు దక్కిందన్నారు. పాలేరు గోదావరి జలాలు తీసుకురావడమే తన లక్ష్యమన్నారు తుమ్మల నాగేశ్వరరావు. తన ప్రజల కోసం.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు తుమ్మల. గోదావరి జలాలతో మీ పాదాలు కడిగేందుకు ఎమ్మెల్యేగా వస్తానని అన్నారు. మీతో శభాష్ అనిపించుకుంటానని.. అప్పటి వరకూ ఎవరికి తలవంచే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన రాజకీయ జీవితం ప్రజల చేతుల్లోనే ఉందని.. జిల్లా అభివృద్ధి కోసం జీవితం అంకితం చేశానని చెప్పారు.
తెలుగుదేశం పార్టీతో ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైంది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు సొంత గడ్డ... సత్తుపల్లి నియోజకవర్గం నుంచి తుమ్మల మొదటి సారి ఓటమి పాలైనా..ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. తుమ్మల నాగేశ్వరరావు మొత్తం ఐదుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. 1985,1994,1999,2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. 2016లో బీఆర్ఎస్ లో చేరి...టీఆర్ఎస్ పార్టీ నుంచి అసెంబ్లీకి పాలేరు ఉపఎన్నికలో పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితపై 45,684 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో పాలేరు నుంచి పోటీ చేసిన ఆయన...కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు.
1983 ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన...1985 ఎన్నికల్లో తొలిసారి గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఎన్టీఆర్ మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 నుంచి 1999 వరకు ఎన్టీఆర్, చంద్రబాబుల మంత్రివర్గంలో చిన్ననీటి పారుదల , ఎక్సైజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1999 నుంచి 2004 వరకు చంద్రబాబు కేబినెట్ లో భారీ నీటి పారుదల, రోడ్లు, భవనాల శాఖల మంత్రిగానూ పని చేశారు. తెలంగాణ ఏర్పాటయిన తర్వాత... కెసిఆర్ మంత్రివర్గంలో 2015 నుంచి 2018 వరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, రోడ్డు, భవనాలు శాఖల మంత్రిగా పనిచేశారు. తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరితే...క్లీన్ స్వీప్ ఖాయమని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.