Breaking News: ప్రాణ హాని పొంచి ఉంది- వైజాగ్ సీపీకీ లక్ష్మీనారాయణ ఫిర్యాదు
Latest Telugu breaking News: ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ చూడొచ్చు.
ఎన్నికల వేళ టీడీపీకి ముఖ్యంగా యనమల రామకృష్ణుడికి బిగ్‌షాక్ తగిలింది. కీలక నేత యనమల కృష్ణుడు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. చాలా రోజుల నుంచి పార్టీకి దూరంగా ఉన్న కృష్ణుడు వైసీపీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. తుని టికెట్ విషయంలో వచ్చిన విభేదాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రాణహాని ఉందని వైజాగ్ సీపీకి మాజీ జేడి, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. తనను అంతమొందించేందుకు విశాఖపట్నంలో కుట్ర జరుగుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు ఫిర్యాదు చేస్తున్నానని.. విశాఖపట్నం పోలీసులు చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు అభ్యర్థించారు.
Background
జనరల్ ఎన్నికల్లో నేడు మరో దశ పోలింగ్ జరుగుతోంది. ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. 13 రాష్ట్రాల్లో 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. ఎండలు ఎక్కువగా ఉన్నందున త్వరగా ఓటు వేసి వెళ్లిపోదామనుకునే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే పోలింగ్‌కు టైం కాకుండానే ఉదయం ఆరు గంటల నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
రెండో దశలో కేరళలోని మొత్తం 20 సీట్లకు పోలింగ్ జరుగుతోంది. కేరళతోపాటు కర్ణాటకలోని 14 స్థానాలకు, రాజస్థాన్‌లోని 13 స్థానాలకు, యూపీ, మహారాష్ట్రలోని 8 స్థానాలకు, ఎంపీలోని 7 సీట్లకు, బిహార్, అసోంలోని ఐదు పార్లమెంట్ సీట్లకు, ఛత్తీస్‌గడ్, పశ్చిమబెంగాల్‌లోని మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. పై రాష్ట్రాలతోపాటు మణిపూర్, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లోని ఒక్కో స్థానికి కూడా పోలింగ్ నడుస్తోంది.
రెండో దశలో 13 రాష్ట్రాల్లోని 89 నియోజకవర్గాలకు చెందిన 15.88 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించి పోటీలో ఉన్న వారి భవిష్యత్‌ను తేల్చనున్నారు. వీరిలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మంది మహిళలు ఉన్నారు. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాల్లోని 102 సీట్లకు తొలి దశ పోలింగ్ జరిగింది. ఇందులో 60శాతానికిపైగా ఓటింగ్ నమోదు అయింది.
రెండో దశ పోలింగ్‌లో తేలనున్న ప్రముఖుల భవిష్యత్
రెండో దశ పోలింగ్ జరుగుతున్న సీట్లలో చాలా మంది ప్రముఖులు బరిలో ఉన్నారు. వారి భవిష్యత్‌ను ఓటర్లు తేల్చనున్నారు. వారి ముఖ్యమైన వ్యక్తి రాహుల్ గాంధీ. ఆయన కేరళలోని వయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇవాళ అక్కడ కూడా పోలింగ్ జరుగుతోంది. ఆయనతోపాటు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తిరువనంతపురం నుంచి, కేసీ వేణుగోపాల్ అలప్పుళ నుంచి పోటీలో ఉన్నారు. గుంజాల్ నుంచి లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, జోద్‌పూర్ నుంచి కేంద్రమంత్రి షెకావత్, మాండ్య నుంచి కుమారస్వామి, బెంగళూరు రూరల్ నుంచి డీకే శివకుమార్ సోదరుడు, రాజ్‌నంద్‌గావ్ నుంచి ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ భగేల్ పరీక్ష ఎదుర్కొంటున్నారు. సినీ నటి హేమమాలిని(మధుర) రామాయణంలో రాముడు పాత్రధారి అరుణ్ గోవిల్(మీరట్) కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్(తిరువనంతపురం) పోటీలో ఉన్నారు.
ముందు ఓటు తర్వాతే టిఫిన్
ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్. అభివృద్ధి చెందిన దేశం కోసం ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ముందు ఓటు వేసిన తర్వాత టిఫిన్ తిని విశ్రాంతి తీసుకోండని సలహా ఇచ్చారు. .
- - - - - - - - - Advertisement - - - - - - - - -