Komatireddy Venkat Reddy Comments on Pushpa 2 Movie | హైదరాబాద్: సంధ్య 70 ఎంఎం థియేటర్ వద్ద పుష్ప 2 ప్రీమియర్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన రేవతి కుటుంబానికి తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు. తొక్కిసలాటలో తీవ్ర అస్వస్థతకు గురై కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ తేజ్ ను చూసేందుకు మంత్రి కోమటిరెడ్డి సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. బాలుడు శ్రీ తేజ్ తండ్రికి రూ.25 లక్షల చెక్ అందించారు మంత్రి కోమటిరెడ్డి. శ్రీ తేజ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న మంత్రి కోమటిరెడ్డి.. బాలుడి తండ్రికి ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా 25 లక్షల చెక్ అందించారు. శ్రీ తేజ్ కుటుంబానికి అన్ని రకాల సహాయం అందిస్తామని కోమటిరెడ్డి హామీ ఇచ్చారు.
మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కామెంట్స్
డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీమియర్ బెనిఫిట్ షో చూడటానికి వెళ్లిన సమయంలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం బాధ కలిగించింది. వారి కుమారుడు శ్రీ తేజ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కొడుకు కోరడంతో రేవతి కుటుంబం సినిమా చూసేందుకు వచ్చారు. హీరో అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కు రావడంతో తోపులాట జరిగింది. హీరో వచ్చిన సమయంలో ఆయన బౌన్సర్లు ప్రేక్షకులు, అభిమానులు అందరినీ తోసేశారు. పోలీసులు వద్దని చెప్పినా, హీరో కారు రూఫ్ టాప్ నుంచి చేతులు ఊపుకుంటూ వెళ్లడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. శ్రీ తేజ్ ఆహారం తీసుకునే పరిస్థితి లేదని డాక్టర్లు తెలిపారు. రేవతి ఆత్ కు శాంతి కలగాలి. పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేసిన తర్వాత అల్లు అర్జున్ రావడం వల్ల ఇబ్బందులు తలెత్తాయి.
రేవతి భర్త భాస్కర్ కు ధైర్యం చెప్పడానికి, బాలుడ్ని చూసేందుకు హాస్పిటల్ కు వచ్చాను. ప్రతీక్ ఫౌండేషన్ నుంచి రూ. 25 లక్షలు ఇచ్చాను. బాలుడి ఆరోగ్యం కోసం అయ్యే ఖర్చు బాధ్యత ప్రభుత్వం చూసుకుంటుంది. తెలంగాణలో రాబోయే రోజుల్లో బెనిఫిట్ షోస్ ఉండవు. ఏదైనా సందేశాత్మక సినిమాలు, దేశం కోసం తీసే సినిమాలు, తెలంగాణ చరిత్రపై సినిమాలు వస్తే అప్పుడు బెనిఫిట్ షోలకు అనుమతిపై ఆలోచిస్తాం. రేవతి భర్తకు చాలా అప్పులున్నాయి. పిల్లల ఖర్చు చూస్కునే ప్రయత్నం చేస్తాను. శ్రీ తేజ్ ఆరోగ్యం కుదుట పడేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడి మాటలు వస్తాయో, లేదో చెప్పలేమని వైద్యులు చెప్పారని’ కోమటిరెడ్డి తెలిపారు.
శ్రీతేజ్ హెల్త్ బులెటిన్
హైదరాబాద్: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో అస్వస్థతకు గురైన శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదలైంది. శ్రీతేజ్ క్రమంగా కోలుకుంటున్నాడని, వెంటిలేటర్ సాయం లేకుండా ఆక్సిజన్ తీసుకుంటున్నాడని కిమ్స్ వైద్యులు తాజా ప్రకటనలో తెలిపారు. శ్రీతేజ్ ఫీడింగ్ సక్రమంగా తీసుకుంటున్నాడని, అతడి న్యూరాలజీ కండీషన్ స్థిరంగా ఉందని డాక్టర్లు తెలిపారు.
పుష్ప సినిమాపై సంచలన వ్యాఖ్యలు
కిమ్స్ హాస్పిటల్‌లో శ్రీతేజ్ కుటుంబాన్ని పరామర్శించి, ఆర్థిక సాయం అందించిన తరువాత మంత్రి కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నేను కూడా పుష్ప 2 సినిమా చూశాను. అదేమైన దేశ భక్తికిగానీ, తెలంగాణ చరిత్రకిగానీ సంబంధించిన సినిమానా?. 3 గంటలు సినిమా చూసే సమయంలో మనం చాలా పనులు చేసుకోవచ్చు. మేం కూడా క్షమాపణ చెప్తున్నాం. సినిమాలతో యువత చెడిపోతుంది. మేసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు అంటే వేరు. ఇకపై చారిత్రక, తెలంగాణ సినిమాలు చూస్తాను. ఇకపై తెలంగాణలో బెనిఫిట్ షోలు ఉండవు. సినిమా హీరోలు కచ్చితంగా నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. మీ సినిమాలకు, ఫంక్షన్లకు గానీ పోలీసులు పర్మిషన్లు ఇవ్వకపోతే సినిమా వాళ్ళు బయటకి వెళ్లొద్దు. సినిమా ప్రీమియర్లు అంటూ బయటకి వచ్చి ఓపెన్ టాప్ కార్లలో తిరగవద్దు. ఇంకోసారి ఇలాంటివి రిపీట్ కావొద్దు. తెలంగాణ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుంది. నిబంధనలకు అనుగుణంగా హీరోలు, ప్రొడ్యూసర్స్ పోలీసులకు సహకరించాలి’ అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.