Allu Arjun on Revanth Reddy comments: 'పుష్ప 2' పెయిడ్ ప్రీమియర్ రోజు సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి మృతి చెందిన విషయం అల్లు అర్జున్ (Allu Arjun Press Meet)కు తెలుసు అని, ఆయనకు ఏసీపీ చెప్పినప్పటికీ వినిపించుకోలేదని అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. బన్నీ అరెస్ట్, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సినీ ప్రముఖులు అల్లు ఇంటికి వెళ్లడంపైనా విమర్శలు చేశారు. రేవతి ఇంటికి ఎవరూ వెళ్లలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరు మృతి చెందారని చెబితే 'మన సినిమా హిట్' అని అల్లు అర్జున్ అన్నట్టు అసుదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. దీనిపై అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన ఏం చెప్పారంటే?


అందులో ఎవరి తప్పు లేదు - అల్లు అర్జున్
సంధ్య థియేటర్ దగ్గర జరిగింది దురదృష్టకరమైన ఘటన అని, అందులో ఎవరి తప్పు లేదని, అదొక యాక్సిడెంట్ అని అల్లు అర్జున్ చెప్పారు. జనాలకు మంచి ఎక్స్‌పీరియన్స్ అందించాలని అనుకున్నాం. పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వాలని అనుకున్నారు. ''అదొక హ్యూమన్ యాక్సిడెంట్. ఎవరి కంట్రోల్ లో లేదు. రేవతి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి. థియేటర్లకు వచ్చిన మనుషులను నవ్వించి బయటకు పంపించాలని అనుకునే వ్యక్తిని. థియేటర్ అనేది టెంపుల్ లాంటిది. అక్కడ యాక్సిడెంట్ జరిగితే నా కంటే బాధ పడే వ్యక్తి ఎవరైనా ఉంటారా? శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రతి గంటకు నేను అప్డేట్స్ తెలుసుకుంటున్నాను'' అని అల్లు అర్జున్ చెప్పారు. 


నిజంగా నాకు తెలియదు - అల్లు అర్జున్
సంధ్య థియేటర్‌లో అభిమానులతో కలిసి పెయిడ్ ప్రీమియర్ చూస్తున్న టైంలో బయట జరిగిన తొక్కిసలాట, అభిమాని రేవతి మృతి గురించి తనకు నిజంగా తెలియదని అల్లు అర్జున్ తెలిపారు. సినిమా (పుష్ప 2) పెద్ద సక్సెస్ అయినా సరే సక్సెస్ మీట్ పెట్టలేదని, ప్రోగ్రామ్స్ అన్నీ క్యాన్సిల్ చేశానని అల్లు అర్జున్ చెప్పారు. మూడేళ్లు కష్టపడి చేసిన సినిమా థియేటర్లో ఎలా ఉందో చూడలేదని ఆయన చెప్పారు. 


''నేను ఉన్న చోట ఘటన జరిగింది. అందుకు క్షమాపణలు కోరుతున్నాను. కానీ, అందులో నా ప్రమేయం లేదు. నేను అలా అన్నానని, ఇలా అన్నానని ఎవరెవరో ఏవేవో చెబుతున్నారు. కాళ్ళూ చేతులు విరిగిపోతే పర్వాలేదని అన్నానని అంటున్నారు. అటువంటి మాటలు విన్నప్పుడు బాధగా ఉంటుంది. నేషనల్ మీడియా ముందు అలా చెప్పడం నా క్యారెక్టర్ ను తప్పుగా చిత్రీకరించడం. నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తుంటే బాధగా ఉంది. నేను అందరినీ గౌరవిస్తా. నా గురించి తప్పుడు ప్రచారం జరుగుతుండటంతో క్లారిటీ ఇవ్వడానికి వచ్చాను'' అని అల్లు అర్జున్ తెలిపారు. 


బాధ్యత లేకుండా వ్యవహరించలేదు - అల్లు అర్జున్
సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట, రేవతి మృతి దురదృష్టకరమైన ఘటన అని అల్లు అర్జున్ చెప్పారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ''మూడేళ్లు కష్టపడి చేసిన సినిమా. కోట్లకు విక్రయించాం అనుక నాకు ఓ బాధ్యత ఉంటుంది. సినిమా ఎలా ఉందో చూడాలని థియేటర్ కు వెళ్లాను. అంతే తప్ప బాధ్యతారాహిత్యంగా లేను. అదే థియేటర్ దగ్గరకు గత 20, 30 ఏళ్లుగా వెళ్తున్నాను. బోలెడు సినిమాలకు వెళ్లాను. ఎప్పుడూ ఇటువంటి ఇటువంటివి జగరలేదు'' అని చెప్పారు. 


పోలీస్ పర్మిషన్ లేకుండా వెళ్ళాననేది అబద్ధం - అల్లు అర్జున్
పోలీసు పర్మిషన్ లేకుండా సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లానని చెబుతున్నారని, అది పూర్తిగా అబద్ధం అని అల్లు అర్జున్ క్లారిటీ ఇచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ... ''పర్మిషన్ వచ్చిందని థియేటర్ యాజమాన్యం చెప్పారు. అందుకే వెళ్లాను. వెళ్లేసరికి పోలీసులు క్లియర్ చేస్తున్నారు. వాళ్ళ డైరెక్షన్ లో వెళుతున్నాను. ఒకవేళ పర్మిషన్ లేకపోతే పోలీసులు వెనక్కి వెళ్లిపొమ్మని చెప్పేవారు. అప్పుడు వెళ్ళిపోతాం. పోలీసులు క్లియర్ చేస్తుంటే పర్మిషన్ ఉందనుకుని వెళ్లాను. రోడ్ షో చేయలేదు. థియేటర్ దగ్గరకు కొన్ని మీటర్ల దూరంలో కార్ ఆగింది. ఒక పాయింట్ తర్వాత బోలెడు మంది జనాలు వస్తారు. 'మీరు ఒక్కసారి చెయ్యి ఊపండి. వాళ్ళు వెళ్ళిపోతారు' అని బౌన్సర్లు, పోలీసులు చెబుతారు. అందుకే హ్యాండ్ వేవ్ ఇస్తాం. సెలబ్రిటీలు ఎవరినైనా అడగండి... వేవ్ చేస్తే ఫ్యాన్స్ కదులుతారు. వేలమంది ఫ్యాన్స్ వచ్చినప్పుడు కారులో కూర్చుంటే పొగరు చూపించినట్టు ఉంటుంది. నేను చెబితేనే ఫ్యాన్స్ అక్కడ నుంచి కదులుతారు'' అని చెప్పారు.


థియేటర్ లోపల పోలీస్ నన్ను కలవలేదు - అల్లు అర్జున్
థియేటర్ లోపల బన్నీ దగ్గరకు పోలీసులు వెళ్లి రేవతి మృతి విషయం గురించి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. దానిని అల్లు అర్జున్ ఖండించారు. ''నా దగ్గరకు ఏ పోలీస్ రాలేదు. నాతో ఏం చెప్పలేదు. మా మేనేజ్మెంట్ వచ్చి 'బయట ఓవర్ క్రౌడ్ అవుతోంది. మీరు వెళ్లిపోండి' అని చెప్పారు. పోలీసులకు ప్రాబ్లమ్ అవుతుందని చెప్పారు. సినిమా మొదలైన కాసేపటికి నా భార్యతో కలిసి నేను బయటకు వచ్చేశా. మరుసటి రోజు వరకు నాకు తెలియదు. రేవతి మృతి గురించి మర్నాడు తెలిస్తే షాక్ అయ్యా. నా కొడుకు, నా కూతురు థియేటర్ లోపల ఉన్నారు. అలా జరిగిందని తెలిస్తే ఎవరైనా సరే పిల్లల్ని తీసుకు వెళతారు కదా! నేను అలా చేయలేదు. పిల్లల్ని వదిలేసి నేను వెళ్ళిపోయా. అటువంటిది చనిపోయిన విషయం తెలిసి కూడా సినిమా చూశానని చెబుతున్నారు.


రెండో రోజు రేవతి విషయం తెలిశాక మా వాసు (బన్నీ వాస్)కి ఫోన్ చేసి వెంటనే వాళ్ళను కలవమని చెప్పాను. నేను కూడా వెళ్లాలని అనుకున్నాను. నన్ను ఆస్పత్రికి రావొద్దని బన్నీ వాస్ అన్నాడు. తర్వాత నా మీద కేస్ ఫైల్ అయినట్టు తెలిసింది. అందుకే కలవలేదు. లీగల్ టీమ్ కలవొద్దని చెప్పలేదు. చిరంజీవి గారి ఫ్యాన్స్, కళ్యాణ్ గారి ఫ్యాన్స్... ఏదో జరిగిందని తెలిస్తే వెళ్లి కలిశా. అటువంటి నా అభిమానులకు జరిగితే వెళ్లకుండా ఎలా ఉంటాను? డబ్బు గురించి కాదు... వాళ్లకు అండగా ఉంటామని చెప్పడానికి వీడియో విడుదల చేశా'' అని చెప్పారు.



Also Read: టాలీవుడ్ మీద 'పుష్ప 2' ఎఫెక్ట్... ఇకపై బెనిఫిట్ షోలు ల్లేవ్ - టికెట్ రేట్లూ పెరగవ్