Palnadu Tadipatri And Chandragiri: సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ రోజు, ఆ తరువాత జరిగిన పరిణామాలతో పల్నాడ జిల్లాలోని పలు ప్రాంతాలు, అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులను పోలీసులు అదుపులోకి తీసుకువస్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో పోలింగ్‌, ఆ తరువాత రోజు జరిగిన గొడవలు, దాడులతో భయానక వాతావరణం నెలకొంది. అనేక మంది తీవ్ర స్థాయిలో గాయపడగా, వాహనాలు పెద్ద ఎత్తున ధ్వంసం అయ్యాయి. గడిచిన మూడు రోజులు నుంచి పరిస్థితులు ఏమాత్రం అదుపులోకి రాకపోవడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు పోలీసులు పల్నాడు జిల్లాలో 144 సెక్షన్‌ అమలు చేయడంతోపాటు పలువురిని అదుపులోకి తీసుకుని పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు పలువురిని అరెస్ట్‌ చేయగా, మరికొందరిని హౌస్‌ అరెస్ట్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పల్నాడు ప్రాంతంలో అధికార వైసీపీ, టీడీపీలోని కీలక నాయకులను పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. హౌస్‌ అరెస్ట్‌ అయిన వారిలో గురజాల, మాచర్ల ఎమ్మెల్యే, వారి అనుచరులు ఉన్నారు. మరికొందరిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించడం ద్వారా పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. 


తాడిపత్రిలోనూ పోలీసుల ముందస్తు చర్యలు


అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలోనూ పోలింగ్‌ రోజు నుంచి పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్నాయి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అనుచరులు మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ జరుగుతున్న అల్లర్లను అదుపులో చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని చెప్పవచ్చు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గొడవలను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే జేసీ కుటుంబాన్ని తాడిపత్రి నుంచి బయటకు పంపించేశారు. జేసీ ప్రభాకర్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పోలీసు బందోబస్తు నడుమ హైదరాబాద్‌కు పోలీసులు తరలించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని కూడా మరో ప్రాంతానికి పోలీసులు తరలించారు. వీరి అనుచరుల్లో కీలకమైన వ్యక్తులను హౌస్‌ అరెస్ట్‌ చేయడంతోపాటు కొందరిని పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ చర్యలు వల్ల గొడవలు అదుపులోకి వస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. 


చంద్రగిరిలో 144 సెక్షన్ అమలు 


తిరుపతి జిల్లా చంద్రగిరిలో ఇంకా పరిస్థితి అదుపులోకి రాలేదు. చంద్రగిరిలో కూటమి తరఫున పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి పులవర్తి నానిపై దాడి జరిగింది. పద్మావతి యూనివర్శిటీలో ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్‌ వద్ద పరిస్థితిని సమీక్షించేందుకు వెళ్లి వస్తున్న టైంలో ఆయనపై వైసీపీ లీడర్లు హత్యాయత్నం చేశారు. కారులో ఉండగానే మారణాయుధాలతో అటాక్ చేశారు. ఆయనతోపాటు సెక్యూరిటీ కూడా గాయపడ్డారు. కోలుకున్న నాని గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ ఘటనలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు. అయినా చంద్రగిరిలో పరిస్థితి ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఇవాళ కూడా 144 సెక్షన్ కొనసాగిస్తున్నారు. గుంపులు గుంపులుగా తిరిగొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.