Anantapuram News: ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ అనంతరం జరుగుతున్న హింసాత్మక ఘటనల్లో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అనంతపురంలోని తాడిపత్రిలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యే  కేతిరెడ్డి పెద్దరెడ్డి, టీడీపీ నేతలు జేసీ ప్రభాకర్‌ రెడ్డి మధ్య ఎప్పటి నుంచో ఉన్న వైరం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఇందులో భాగంగా ఒకరిపై ఒకరు రాళ్లు వేసుకున్నారు.


ఇది తీవ్ర రూపం దాలుస్తున్న టైంలో పోలీసులు కలుగు చేసుకొని ఇద్దర్నీ రహస్య ప్రాంతాలకు తరలించారు. కొందరు అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వెళ్లిన పోలీసులు అక్కడ ఉన్న సీసీ ఫుటేజ్‌ను ధ్వంసం చేయడం చర్చనీయంశమైంది.


జేసీ ఇంటిపైకి దాడికి యత్నించిన వ్యక్తుల్లో కీలకమైన వ్యక్తి పెద్దారెడ్డి ఇంట్లో దాక్కున్నాడని ఆయన్ని పట్టుకోవడానికే పోలీసులు ఆ ఇంట్లోకి ప్రవేశించేందుకు యత్నించారు. ఆ టైంలో తలుపులు, గేట్లు పగలగొట్టి ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. ఆ పుటేజ్ హార్డ్ డిస్క్‌లను కూడా తమతో తీసుకెళ్లారని ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఆరోజే చెప్పారు. 






 


ఇప్పుడు వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ చూస్తే అదంతా నిజమని తెలుస్తోంది. అయితే పోలీసులు తీసుకెళ్లిన వీడియో ఫుటేజ్ ఇప్పుడు మీడియాకు ఎలా వచ్చిందని చర్చ నడుస్తోంది. ఇద్దరు నేతలు తాడిపత్రి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయిన పోలీసులు అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.