Andhra Pradesh Elections 2024: ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగిపోయాయి.. అభ్యర్థులు, వారి ఫాలోవర్స్‌ రిలాక్స్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. కానీ బెట్టింగ్‌ బంగార్రాజులు మాత్రం కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పందేలు జోరు పెంచుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుండగా ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం ఇది వేరే లెవల్‌ అన్నట్టు ఉంది పరిస్థితి. సంక్రాంతి పండుగ రోజుల్లో పందేల బరుల వద్దే జరిగే పందేలు.. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో మధ్యవర్తుల ద్వారా రూ.కోట్లలో 1.5 రేషియాలో పందేలు కాస్తున్నారు.


గోదావరి జిల్లాల పందెం రాయుళ్లకు మరోసారి సంక్రాంతి పండగ వచ్చింది. అవును సంక్రాంతి టైంలో జరిగే కోడి పందేలు ఎంత ఫేమస్సో ఇప్పుడు అంతకంటే ఎన్నికల బెట్టింగ్‌లు ఫేమస్‌గా మారిపోతున్నాయి. సంక్రాంతి టైంలో ఎక్కడెక్కడి నుంచో జనాలు గోదావరి జిల్లాలకు వచ్చి కోడి పందేలు కాస్తుంటారు. ఇప్పుడైతే ఆన్‌లైన్‌లోనే అంతకు మించి హడావుడి కనిపిస్తోంది. ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు? ఎవరికి ఎంత మేజార్టీ వస్తుందనే ఆసక్తిని బెట్టింగ్‌ రాయళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. 


ఎన్నికల ఫలితాలు రానున్న వేళ ప్రతీ అంశాన్నీ లెక్కకట్టి మరీ బెట్టింగ్‌ల జోరు పెంచారు పందెంరాయుళ్లు. అలా బెట్టింగ్‌ రాయుళ్లకు పిఠాపురం హాట్‌ సీటుగా మారింది. పిఠాపురంతోపాటు మిగతా సీట్లపై కూడా ఉండిలో ఆయన గెలుస్తాడా... గెలిస్తే ఎంత మెజార్టీ? పవర్‌లోకి ఏ పార్టీ వస్తుంది? ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుంది? ప్రతిపక్షం పార్టీ ఎన్ని సీట్లు దక్కించుకుంటుంది.. ఇలా ఒక్కటేమిటి.. పందేలాకు కాదేదీ అనర్హం అన్న చందంగా బెట్టింగ్‌ బంగర్రాజులు ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బెట్టింగ్‌లతో యమ బిజీగా గడుపుతున్నారు.


ఉభయగోదావరి జిల్లాలో భారీగా..
భీమవరం కేంద్రంగా కోడిపందేలు జోరుగా జరుగుతాయని తెలిసిందే. ఇప్పుడు ఎలక్షన్‌ బెట్టింగ్‌లకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కేంద్రంగా నిలుస్తోంది. ఈ జిల్లాలో ముఖ్యంగా ఉండి నియోజకవర్గంపైనే ఎక్కువగా పందేలు జరుగుతున్నాయని సమాచారం. ఉండి నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్ధిగా పోటీచేసిన రఘురామకృష్ణంరాజు గెలుస్తారని, ఆయనకు ఇంత మెజార్టీ వస్తుందని ఎక్కువగా పందేలు జరుగుతున్నాయని తెలుస్తోంది. 


ఒక్క ఉండి నియోజకవర్గంమీదే తెలుగు రాష్ట్రాల్లో సుమారు 500 కోట్ల రూపాయల పందేలు జరుగుతున్నట్లు సమాచారం. ఇదే తరహాలో భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, నర్సాపురం నియోజకవర్గాలపైనా పందేలు జోరుగా సాగుతున్నాయి.


పిఠాపురం మెజార్టీపైనే గురి..
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా పిఠాపురంపైనే అందరి దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది. పిఠాపురంలో విన్నింగ్‌ అభ్యర్ధి మెజార్టీపైనే బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. ఇక్కడ కూడా రూ.కోట్లలో పందేలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక్కడ కూటమి నుంచి పవన్‌ కల్యాణ్‌, వైసీపీ నుంచి వంగా గీత పోటీలో ఉండగా పవన్‌ కల్యాణ్‌ 50 వేలు మెజార్టీ వస్తుందని, గీతకు కేవలం ఇన్ని ఓట్లే వస్తాయని ఇలా అనేక కోణాల్లో బెట్టింగ్‌ల జోరు సాగుతోంది. 


ముమ్మిడివరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్ధి దాట్ల సుబ్బరాజు గెలుపుపైనా, మెజార్టీపైనా పందేలు జోరుగా సాగుతున్నాయి. కాకినాడ ఎంపీ స్థానం, తుని అసెంబ్లీ, అమలాపురం పార్లమెంటు, అసెంబ్లీ, రాజమండ్రి సిటీ, రూరల్‌, పి,గన్నవరం, కొత్తపేట, జగ్గంపేట, అనపర్తి, రాజానగరం ఇలా చాలా నియోజకవర్గాల్లో బెట్టింగ్‌లు జోరు ఊపందుకుంది.


ప్రభుత్వ ఏర్పాటుపైనా బెట్టింగ్‌లే..
రాష్ట్రంలో ఇన్ని సీట్లతో ఆపార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, లేదు మళ్లీ ఈప్రభుత్వమే అధికారం చేపడుతుందని, పులివెందులలో జగన్‌కు ఈసారి ఇంత మెజార్టీ అని, కుప్పంలో చంద్రబాబుకు అంత మెజార్టీ అని, ఈసారి లోకేష్‌ ఓడిపోతాడని, కాదు గెలుస్తాడని, కడపలో వైఎస్‌ షర్మిలకు ఎన్ని ఓట్లు వస్తాయని, ఇలా పందేల పండుగ ఎన్నికల ఫలితాల సందర్భంగా ఊపందుకుంది.


బెట్టింగ్‌ల వెనుక ప్రతిష్ట..
మా అభ్యర్ధిపై ఇన్ని లక్షల రూపాయలు బెట్టింగ్‌ వేశాం... ఓస్‌ అంతేనా మా అభ్యర్ధిపై ఇన్ని లక్షలకుపైగా పందేలా కాశాం. ఇలా ప్రతిష్ట ఇష్యూగా ప్రస్తుత బెట్టింగ్‌లు మారాయి. డబ్బులు పోయినా ఫర్వాలేదు.. కానీ అభ్యర్థుల అభిమానంతో పందేలు ఎక్కువగా నడుస్తున్నట్టు చెబుతున్నారు.